చచ్చినా డబ్బులే.. పుట్టినా డబ్బులే…

లంచం తీసుకునే వారిపై చర్య తీసుకోండి

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ బల్దియా సమావేశం వాడివేడిగా సాగింది. అధికార ప్రతిపక్ష పార్టీల సభ్యులు సమస్యలతో పాటు అవినీతి అక్రమాల గురించి సభ దృష్టికి తీసుకొచ్చారు. శుక్రవారం కరీంనగర్ కార్పోరేషన్ సమావేశం జరగగా ఇందులో పలువురు సభ్యులు లేవనెత్తిన అంశాలను పరిష్కరిస్తామని మేయర్ యాదగిరి సునీల్ రావు హామీ ఇచ్చారు. కార్పోరేటర్ కమల్ జిత్ కౌర్ మాట్లాడుతూ… డెత్, బర్త్ సర్టిఫికెట్ల జారీ అవినీతి చోటు చేసుకుంటోందన్నారు. రూ. 2 వేలు తీసుకుంటేనే సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారని, తన డివిజన్ కు సంబంధించిన ఓ వ్యక్తికి చెందిన దృవీకరణ పత్రం కోసం వేరే డివిజన్ కు చెందిన వారు పైరవీ చేశారని సభ దృష్టికి తీసుకొచ్చారు. మునిసిపాలిటీలో ఒకరిద్దరు చేస్తున్న అవినీతి వల్ల మొత్తం బల్దియాకే చెడ్డ పేరు వస్తోందని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కమల్ జిత్ కౌర్ కోరారు. ఇందుకు స్పందించిన మేయర్ సునీల్ రావు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్న మూడు రోజుల్లోనే మరణ, జనన ధృవీకరణ పత్రాలు జారీ చేస్తున్నారని ఇందుకు ఎవరికి మామూళ్లు ఇవ్వాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు ఏమైనా ఉంటే ఆధారాలతో సహా ఇచ్చినట్టయితే ఖచ్చితంగా చర్య తీసుకుంటామని సునీల్ రావు స్ఫష్టం చేశారు. అలాగే సిక్కులు అత్యంత ఘనంగా జరుపుకునే వైశాఖి వేడుక కూడా త్వరలో జరగనున్న నేపథ్యంలో సిక్ వాడి ఏరియాలోని రోడ్లు బాగు పర్చాలని కోరారు. స్మార్ట్ సిటీ నిధులతో ఈ రోడ్ల పనులు చేపట్టాలని గతంలో కూడా కోరానని, ఈ సారైనా వాటిని బాగు చేయించాలని కమల్ జిత్ కౌర్ కోరారు. మరో బీఆర్ఎస్ పార్టీ కార్పోరేటర్ కంసాల శ్రీనివాస్ మాట్లాడుతూ… స్ట్రీట్ లైట్లు వెలగకపోవడం వల్ల రాత్రి వేళల్లో ప్రజలు నడవడానికి ఇబ్బందులు పడుతున్నారని అవి రాత్రిళ్లు వెలిగేలా చొరవ చూపాలన్నారు. రంజాన్ మాసం ప్రారంభం కావడంతో ముస్లింలు వేకువ జామునే సహర్ నమాజ్ చేసేందుకు వెల్తుంటారని వీధుల్లో స్ట్రీట్ లైట్లు లేక చీకట్లు అలుముకోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే తమ ప్రాంతంలో పాములు, కుక్కల బెడద కూడా తీవ్రంగా ఉన్నందున స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని మేయర్ సునీల్ రావు హామీ ఇచ్చారు. బీజేపీ కార్పోరేటర్ పెద్దపల్లి జితేందర్ మాట్లాడుతూ… వాణినికేతన్ పాఠశాల సమీపంలోని రహదారి పూర్తి చేయాలని పదే పదే కోరగా కంప్లీట్ అయినప్పటికీ డ్రైనేజీ పనులు మాత్రం మధ్యలోనే ఆపేశారన్నారు. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నందున త్వరితగతిన ఈ పని పూర్తి చేయాలని జితేందర్ కోరారు. ధన్గర్ వాడి సమీపంలోని రహదారికి ఇరువైపులా 5 ఫీట్లతో వెడల్పుతో నిర్మించారని, అయితే తాజాగా ధన్గర్ వాడి వైపున్న డ్రైనేజీకి 13 ఫీట్ల డ్రైన్లను లింక్ చేయడం వల్ల వరద నీరు వచ్చినప్పుడు ఒకే వైపు నీరు వచ్చి చేరడంతో పాటు లింకేజ్ చేసిన డ్రైన్ల నుండి వచ్చే మురుగును అంతే వేగంగా దిగువకు తరలించే అవకాశం ఉండనుందన స్థానికులు ఇబ్బందులు ఎదురవుతాయన్నాయన్నారు. మునిసిపాలిటీలో అద్దె వాహనాల విషయంలో జరిగిన అవకతవకల గురించి సభలో జితేందర్ మాట్లాడే ప్రయత్నం చేయగా సమావేశం పూర్తయిందని జాతీయగీతం పాడాలని మేయర్ ఆదేశించడం విశేషం.

మాట్లాడుతున్న మేయర్ సునీల్ రావు

రూ. 1000 కోట్లతో నగరాభివృద్ది: మేయర్ సునీల్ రావు

మేయర్ వై సునీల్ రావు మాట్లాడుతూ… స్మార్ట్ సిటీ నిధులు, నగరపాలక సంస్థ వివిధ గ్రాంట్లకు సంబంధించిన రూ వెయ్యి కోట్లతో నగర వ్యాప్తంగా అభివృద్ది పనులు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికి 75 శాతం పనులు పూర్తి కాగా మిగతా 25 శాతం పనులను జులైలోగా పూర్తి చేయాలన్న లక్ష్యం నిర్దేశించుకున్నామన్నారు. విలీన గ్రామాలతో పాటు శివారు ప్రాంతాల అభివృద్ధి పై ప్రధాన దృష్టి సారించామని, రూ. 120 కోట్లతో చేపట్టాల్సిన పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియ కొనసాగుతోందని మేయర్ వివరించారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ అమల్లో భాగంగా స్టాండ్ బై మోటార్లు, జనరేటర్లు, ఇతర సామాగ్రిని సిద్దం చేశామన్నారు. టెక్నికల్ సమస్యలు తలెత్తితే తప్ప నీటి సరఫరా లో అంతరాయం లేకుండ నీటి సరఫరా చేస్తున్నామని, విలీన గ్రామాలకు కూడ త్వరలో నగరపాలక సంస్థ ద్వారా పూర్తి స్థాయిలో మంచి నీటి సరఫరా చేస్తామని ప్రకటించారు. కుక్కల కట్టడి కోసం ఆపరేషణ్ ఏబీసీ చేస్తున్నామని వాటి బర్త్ కంట్రోల్ కోసం రూ. 1800 వ్యాక్సిన్ కొనుగోలు చేసి వేస్తున్నామన్నారు. కోతుల బెడద తప్పించేందుకు ఒక్కో కోతికి రూ. 800 చెప్పిన వెచ్చించి వాటిని పట్టుకుని సుదూర ప్రాంతాలకు తరలించే కార్యక్రమం కూడా చేపట్టామని సునీల్ రావు వెల్లడించారు. ఇప్పటి వరకు 2 వేల కోతులను తరలించామని, రానున్న కాలంలో కూడా ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగిస్తామనని తెలిపారు. సభ్యులు నగరపాలక సంస్థ ఆస్తి పన్నులు, నల్లాబిల్లులు, ట్రేడ్ లైసెన్స్ పన్నులు, ప్రకటన పన్నులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నగరపాలక సంస్థకు రూ. 38 కోట్లు కాగా రూ. 10 కోట్ల ఆస్తి పన్నులు వసూలు కావాల్సి ఉందన్నారు.

You cannot copy content of this page