చివరి సమావేశమూ రసాభసాయేనా..?
బహిష్కరించిన బీఆర్ఎస్
దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ బల్దియా సరికొత్త రికార్డు క్రియేట్ చేసుకుంది. చరిత్రలో ఏనాడు లేని విధంగా విడ్కోలు సమావేశం జరుపుకుని తన ప్రత్యేకతను చాటుకుంది. ఐదేళ్ల పాటు బాధ్యతల్లో ఉన్నప్పుడు విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం సహజమే అయినా చివరి సమావేశం రోజున ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని పదవి కాలం ముగిసిన రోజున కలిసిపోతుంటారు. రాజకీయంగా నొప్పించే విధంగా మాట్లాడినట్టయితే క్షమపణలు చెప్పుకుని తమ పదవి కాలంలో జరిగిన అనుభవాలను నెమరువేసుకోవడం సహజం. కానీ కరీంనగర్ బల్దియా చివరి సమావేశం కూడా రచ్చరచ్చగానే సాగడం గమనార్హం.
భారీ బందోబస్తు…
ఏనాడూ లేని విధంగా కరీంనగర్ కార్పోరేషన్ కార్యాలయం భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున మోహరించిన పోలీసు బలగాల నడుమ చివరి సమావేశం జరిగింది. కేవలం కార్పోరేటర్ పదవిలో ఉన్న వారిని మాత్రమే సమావేశానికి ఆహ్వానించాలని అధికారులు పోలీసులకు స్ఫష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో బాధ్యతల్లో లేని వారిని లోపలకు అనుమతించలేదు. మునిసిపల్ సమావేశానికి వెల్లే ప్రతి ఒక్కరిని క్రాస్ చెక్ చేసిన తరువాతే లోపలకు పంపించారు పోలీసులు.
బహిష్కరణ…
ఇకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్పోరేటర్లు చివరి సమావేశాన్ని బహిష్కరించి మునిసిపల్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. చివరి సమావేశం రోజున కార్పోరేటర్ దంపతులను సన్మానించడం ఆనవాహయితీగా వస్తోందని, ఈ సారి మాత్రం కేవలం పదవిలో ఉన్న వారు మాత్రమే రావాలన్న షరతు విధించడం సమంజసం కాదన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా కొత్త సాంప్రాదాయానికి తెరలేపారంటూ మండిపడ్డారు. అంతేకాకుండా మేయర్ అఫ్రాన్ ధరించకుండా కాషాయ కండువా కప్పుకోవడం కూడా సరైన చర్య కాదంటూ వ్యాఖ్యానించారు. వైరుధ్యంగా సాగిన చివరి సమావేశాన్ని తాము బహిష్కరిస్తున్నామని ప్రకటించారు.