ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు… కట్నం కోసం వేధించాడు..

జరిమానా… జైలు శిక్ష విధించిన ఫ్యామిలీ కోర్ట్

దిశ దశ, కరీంనగర్:

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ ప్రబుద్దుడు అదనపు కట్నం కోసం భార్యను వేధిండచమే కాకుండా, అత్తా, మామలు నివాసం ఉంటున్న గుడిసెకు నిప్పంటించిన ప్రబుద్దుడికి కరీంనగర్ ప్రత్యేక ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి లక్ష్మికుమారి జరిమానాతో పాటు జైలు శిక్ష విధించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం… కరీంనగర్ జిల్లా ఎల్ఎండి పోలీస్ స్టేషన్ పరిధిలోని మహాత్మనగర్ చాపల కాలనీకి చెందిన దివ్య(21)ను అదే కాలనీకి చెందిన శివకృష్ణ(25) ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మూడేళ్ల పాటు కాపురం సజావుగానే చేసిన శివకృష్ణ అదనపు కట్నం కోసం భార్య దివ్యను వేధించసాగాడు. దీంతో పెద్దల సమక్షంలో పంచాయితీ జరగగా భార్యను బాగా చూసుకుంటానని శివకృష్ణ పెద్దల ముందు ఒప్పుకుని కాపురానికి తీసుకెళ్లాడు. కొద్ది రోజుల తరువాత మళ్లీ ఆమెను వేధించడం మొదలు పెట్టిన శివకృష్ణ అంతటితో ఆగకుండా అత్తా,మామలు నివసిస్తున్న గుడిసెకు నిప్పంటించాడు. 2022 అక్టోబర్ 10వ తేది రాత్రి జరిగిన ఈ ఘటనపై అతని భార్య దివ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎల్ఎండీ పోలీసులు కేసు దర్యాప్తు చేసి ఘటనకు సంబంధించిన ఆధారాలను కరీంనగర్ ఫ్యామిలీ కోర్టులో సమర్పించారు. శనివారం కోర్టులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జూలూరి శ్రీరాములు సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టి విచారించారు. కేసు పూర్వాపరాలను, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన కరీంనగర్ స్పెషల్ ఫ్యామిలీ కోర్టు జడ్జి లక్ష్మీ కుమారి తీర్పునిచ్చారు. నిందితుడు శివకృష్ణకు రూ. 30 వేల జరిమానా, ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ జడ్జిమెంట్ ఇచ్చారు.

You cannot copy content of this page