నగరాభివృద్దికోసం నావంతు కృషి: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

దిశ దశ, కరీంనగర్: 

కరీంనగర్ అభివృద్ధికి నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది… నగరాన్ని అద్దంలా తీర్చిదిద్దే బాధ్యత నాదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. జన్మనిచ్చి నన్ను ఇంత వాడిని చేసిన కరీంనగర్ ను అద్బుతంగా అభివృద్ది చేసేందుకు కసితో పనిచేస్తాన్నారు. ఆదివారం కరీంనగర్ కార్పోరేటర్ల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్ మాట్లాడుతూ… అందరూ కలిసి తనను సన్మానిస్తారని ఊహించలేదని, ఇదే కార్పొరేషన్ కు రెండుసార్లు ప్రాతినిథ్యం వహించిన తనకు సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటి వరకు కరీంనగర్ కార్పొరేషన్ కు కేంద్రం పూర్తి స్తాయిలో సహకరించిందన్న సంజయ్ మరిన్ని నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని ప్రకటించారు. అమృత్ వన్ స్కీంలో రూ. 132 కోట్లు వచ్చాయని, అందులో కేంద్రం వాటా రూ.66 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఆ నిధులవల్లనే నిరంతరం నగర ప్రజలకు తాగునీరు ఇవ్వగలుగుతున్నామని వ్యాఖ్యానించారు. అమృత్ 2 కింద మరో 147 కోట్లు మంజూరైతే. కేంద్రం తన వాటా కింద రూ. 73.5 కోట్లను ఇప్పటికే విడుదల చేసిందని వివరించారు. స్మార్ట్ సిటీ మిషన్ కింద రూ. 934 కోట్లు మంజూరు కాగా ఇప్పటి వరకు రూ. 765 కోట్లు నిధులు అలాట్ చేసినట్టు బండి సంజయ్ వివరించారు. మిగిలిన రూ.176 కోట్లు రవాల్సి ఉండగా స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ రూ. 100 కోట్ల వరకు రావాల్సి ఉందని, కేంద్రం నుండి 70 కోట్లు వస్తాయిని అన్నారు. కేంద్రం నుండి ఆ నిధులు తీసుకొచ్చే బాధ్యత తనదేనని, కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం అవసరమైన ప్రణాళికలు రూపొందించాలన్నారు. కార్పోరేషన్ అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులిచ్చే పరిస్థితి ఉండదని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు అందించడంతో పాటు తనవంతు వాటా ఇస్తామని ఒప్పుకుంటేనే నిధులు కెటాయించే అవకాశం ఉంటుందన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. నేరుగా కేంద్రం నిధులిచ్చే అవకాశమే ఉంటే కరీంనగర్ ను అద్దంలా తీర్చిదిద్దేవాడినని ప్రకటించారు. ఎన్నికలప్పుడు మాత్రమే నా పార్టీ అభ్యర్థులు గెలవాలనుకుని పనిచేస్తానని, కోపాన్ని వీడి గొడవలకు తావివ్వకుండా కలిసి పనిచేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. కరీంనగర్ అభ్యున్నతే లక్ష్యంగా పని చేస్తానని ఇందుకోసం మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ లతో కూడా చర్చిస్తానని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మేయర్ వై సునీల్ రావ్, వివిధ పార్టీలకు చెందిన కార్పోరేటర్లు పాల్గొన్నారు. 

You cannot copy content of this page