దిశ దశ, కరీంనగర్:
కరీంనగరానికి ఏమైంది..? సాయంత్రం అయితే చాలు పొగ చూరిపోతున్న తీరుకు కారణాలు ఏంటీ..? విటమిన్స్ అందించే మిల్క్ డైరీ నుండి కాలుష్యం వెదజల్లడం ఏంటీ..? సహజ సిద్దంగా పశువుల నుండి సేకరించే పాలను సిద్దం చేసే చోట కెమికల్స్ వినియోగించాల్సిన అవసరం ఉంటుందా..? వీటిని వినియోగించుకునేందుకు సంబంధిత శాఖలు అనుమతులు ఇచ్చాయా..? అందుకు అనుగుణంగానే ఇక్కడ రసాయనాల వినియోగం జరుగుతోందా అన్న ప్రశ్నే కరీంనగర్ వాసులను కలవరపెడుతోంది. సంధ్య వేళ అవుతున్నదంటే చాలు మిల్క్ డైరీ ప్రాంత వాసులు భయం గుప్పిట చేరిపోతున్నారు. తమను ఈ బాధ నుండి విముక్తి చేయండంటూ సమీప ప్రాంతాల వాసులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
ఆరోగ్యకరమేనా..?
కరీంనగర్ డైరీలో నిత్యం వెలువడుతున్న పొగ వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుండగా, రసాయనాల వల్ల భూమిలోపల కూడా కలుషితం అవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యం కోసం తాగే పాలను తయారు చేసేందుకు సాగుతున్న ఈ ప్రక్రియపై సమీప కాలనీల వాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రోజూ సాయంత్రం వేళల్లో ఈ స్థాయిలో పొగరావడానికి కారణమేంటన్నదే అంతుచిక్కకుండా పోతోందని అంటున్నారు. పొగ వల్ల శ్వాస కోస వ్యాధులు, కంటి సమస్యలు, ఛర్మ సంబంధిత సమస్యలు కూడా ఎదురవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే పశువుల నుండి సహజ సిద్దంగా లభ్యమయ్యే పాలను విక్రయించేందుకు సిద్దం చేసే ప్రక్రియ వెనక అసలేం జరుగుతోంది..? అన్న చర్చ స్థానికంగా సాగుతోంది. అంతేకాకుండా మిల్క్ డైరీ పరిసర ప్రాంతాల్లోని నీరు కూడా కలుషితం అవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నీటిలో TDS శాతం కూడా తీవ్రంగా పెరిగిపోతున్నదని దీంతో మరింత అనారోగ్యాలకు గురవుతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఫిర్యాదులు…
కరీంనగర్ డైరీ నుండి వెలువడుతున్న కాలుష్యం కారణంగా తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు అధికారులకు ఫిర్యాదులు చేశారు. చివరకు కాలుష్య నియంత్రణ విభాగానికి వెల్లి కూడా కంప్లైంట్ చేశారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి శాంపిల్స్ సేకరించుకుని వెల్లారు. వాయు, జలానికి సంబంధించిన రిపోర్టులను పరిశీలించి అధికారులు కరీంనగర్ డైరీపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే కాలుష్య నియంత్రణ అధికారులు వచ్చినప్పుడు మాత్రం డైరీ నుండి వెలువడే కాలుష్య ప్రభావాన్ని తగ్గించారని, ఆ తరువాత షరా మామూలే అన్నట్టుగా మారిపోయిందని స్థానిక కార్పోరేటర్ బోనాల శ్రీకాంత్ ఆరోపించారు. అధికారులు కఠినంగా చర్యలు తీసుకోనట్టయితే సమీప కాలనీల్లో నివసిస్తున్న వారి ప్రాణాలకే ప్రమాదంగా మారనుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డైరీ పరిసర ప్రాంతాల వాసులు కూడా ఇక్కడి నుండి వస్తున్న పొగకు సంబంధించిన వీడియోలను నెట్టింట వైరల్ చేస్తూ కాలుష్యం బారిన కాపాడేందుకు అధికారులు చొరవ తీసుకోవాలని వేడుకుంటున్నారు.