దిశ ధశ, కరీంనగర్:
కరీంనగర్ అంటేనే వైవిద్యమైన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. తాజాగా ఓ రెండు పార్టీల్లో జరుగుతున్న చర్చ కూడా సరికొత్త పాలిటిక్స్ కు తెర తీసినట్టయింది. కరీంనగర్ కు చెందిన ఓ నేత కారణంగా రెండు పార్టీల్లోనూ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రెండు పార్టీల్లోనూ ఆయన కేంద్రీకృతంగానే అంతర్గత చర్చలు జరుగుతున్నాయి. ముఖ్య నేతలతో ఈ అంశం గురించి చర్చించేందుకు సాహసించలేని పరిస్థితి నెలకొనడంతో రెండు పార్టీల్లోని ఆయన వైరి వర్గం తర్జనభర్జనలు పడుతోంది.
బీఆర్ఎస్, బీజేపీ…
కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన ఆ నేత కీలకమైన పదవిని అందుకున్నారు. ఉద్యమ కారులు, పార్టీకి చెందిన సీనియర్లు చాలా మంది వద్దని వారించడంతో పాటు ఫలానా వారికి ఈ బాధ్యతలు ఇవ్వాలని ప్రతిపాదనలు చేశారు. అయినా బీఆర్ఎస్ అధిష్టానం సదరు నేతకే పదవిని కట్టబెట్టాలని కఠినంగా నిర్ణయించుకుంది. దీంతో చసేదేమీ లేక ఆశావాహులు అంతా కూడా కేసీఆర్ ఆదేశాలని భావించి కిమ్మనకుండా ఉండి పోయారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం వీడడం కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి రావడంతో కొంతమంది నాయకుల ఆలోచనలకు మారిపోయాయి. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ కూడా 8 లోకసభ స్థానాలకు కైవసం చేసుకుని సత్తా చాటుకోవడంతో మారుతున్న పరిణామాలను అంచనా వేస్తున్న నాయకులు ఇతర పార్టీల వైపు తమ చూస్తున్నారన్న ప్రచారం కూడా ఊపందుకుంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీలో చేరి కీలకమైన పదవిని కొట్టేసిన ఆ నేత ఇఫ్పుడు గులాభి పార్టీతో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్న చర్చ మొదలైంది. గులాభి పార్టీ నాయకులు కూడా సదరు ప్రజా ప్రతినిధి వైఖరిపై మల్లగుల్లాలు పడుతున్నా క్యాడర్ ముందు మాత్రం గుంభనంగా వ్యవహరిస్తున్నారు. ఆ నాయకుడిని అక్కున చేర్చుకుని తప్పు చేశామా అన్న అంతర్మథనంలో కూడా కొట్ట మిట్టాడుతున్నారు బీఆర్ఎస్ ముఖ్య నేతలు కొందరు. అయతే తాజాగా సదరు ప్రజా ప్రతినిధి ఎఫెక్ట్ బీజీపీపై కూడా తీవ్రంగా పడినట్టుగా తెలుస్తోంది. కరీంనగర్ ఎంపీగా రెండో సారి గెలిచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ తో ఆ నేత టచ్ లోకి వెల్లడంతో కాషాయం పార్టీలో కూడా అంతర్గతంగా చర్చ మొదలైంది. ఒకటి రెండు సార్లు బాహాటంగానే బండి సంజయ్ ని కలిసిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన సదరు ప్రజా ప్రతినిధి ఆ పార్టీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారని కూడా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలో డిస్కషన్ సాగుతోంది. ఆయన పార్టీ మారుతారా లేదా… అతన్ని బీజేపీలో చేర్చుకుంటారా లేదా అన్న విషయంపై స్పష్టత లేకున్నప్పటికీ బీజేపీలో ఉన్న ఇతర నాయకులు మాత్రం అసలేం జరుగుతోందన్న విషయం అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. కేంద్ర మంత్రి అతని చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేక పక్కన పెడుతారా అన్న విషయం అంతు చిక్కకపోవడంతో అప్పటికే బీజేపీలో చేరిన ఇతర నాయకులు కమలనాథులతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. బీజేపీలో చేరినట్టయితే తమకు ఢోకా ఉండదని భావించి ఇంతకాలం కాషాయం కండువాతో తిరిగితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుండి వస్తున్న నాయకుడు బీజేపీలో చేరేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తుండడంతో తమ భవిష్యత్తు ఏమిటీ అన్న యోచనలో పడిపోయారని తెలుస్తోంది. తాజాగా పార్టీలోకి చేరాలనుకుంటున్న నాయకునికి అందలం ఎక్కించే అవకాశాలు ఉన్నాయన్న సంకేతాలు వస్తుండడంతో ఇప్పటికే బీజేపీలో ఉన్న నాయకులు కేంద్ర మంత్రి వద్దకు వెళ్లడం మానకున్నట్టుగా తెలుస్తోంది. బండి సంజయ్ కూడా ఈ విషయంపై పార్టీలో చర్చించనప్పటికీ తాజా పరిణామాలను గమనించిన నాయకులు మాత్రం మిన్నకుండి పోవడమే బెటర్ అనుకుని బీజేపీకి దూరందూరంగా ఉండడం మొదలు పెట్టినట్టుగా తెలుస్తోంది. దీంతో బీజేపీలోనూ ఈ నాయకుడి చేరిక అంశం హాట్ టాపిక్ గా మారిందని స్పష్టం అవుతోంది. ఒక నాయకుని గురించి రెండు పార్టీల్లో సుదీర్ఘమైన చర్చ సాగుతున్న తీరే కరీంనగర్ పాలిటిక్స్ లో చోటు చేసుకోవడం గమనార్హం.