కరీంనగర్ ప్లాట్ల కెటాయింపుపై చర్చ
దిశ దశ, కరీంనగర్:
కలం కార్మికులను అక్కున చేర్చుకునే ప్రయత్నంలోనే నివేశన స్థలాలు ఇప్పిస్తున్నామంటూ ప్రచారం… పట్టాలు ఇచ్చిన తరువాత అవకతవకలు జరిగాయని అడిగితే బీపీఎల్ కోటాలో ఇచ్చారని బుకాయింపు… కరీంనగర్ జర్నలిస్టులతో చెలగాటమాడుతున్నదెవరూ..? సీక్రెట్ లిస్టు తయారు చేసుకోవడానికి కారణం ఏంటీ..? బయటకు వచ్చిన జాబితాలో ఎంత మంది ఉన్నారు..? ప్లాట్ల కెటాయింపు సమయంలో ఎంతమందికి ఇచ్చారు..?
జర్నలిస్ట్ కోటా…
కరీంనగర్ జర్నలిస్టులకు చాలా కాలం తరువాత నివేశనా స్థలాలు కెటాయించే విషయంలో చాలా రోజులుగా కసరత్తులు జరుగుతున్నాయి. కరీంనగర్ జర్నలిస్టు సమాజమంతా కలిసికట్టుగా భూములు ఇప్పించాలని ప్రభుత్వ పెద్దలను చాలా సార్లు అభ్యర్థించారు. చివరకు 2023లో జర్నలిస్టులకు భూములు కెటాయిస్తున్నామని భూమిని గుర్తించామని చెప్పారు. దీంతో కరీంనగర్ జర్నలిస్టుల్లో నెలకొన్న ఆనందరం అంతా ఇంతా కాదు. అక్రిడేషన్ కార్డులు, సీనియారిటీ ప్రాతిపదికన ప్లాట్లు కెటాయిస్తున్నామని చెప్పి అర్థరాత్రి వరకు భేటీలు జరిపి జాబితాను సిద్దం చేశారు. 118 మందితో వెలువడిన జాబితాలో కూడా జర్నలిస్టులుగా పనిచేయని వారి పేర్లను కూడా చేర్చినప్పటికీ పెద్దలను ఎదురించడం సరికాదని చాలామంది జర్నలిస్టులు మిన్నకుండిపోయారు. ప్లాట్లకు సంబంధించిన పట్టాలు ఇచ్చిన తరువాత జర్నలిస్టులుగా పని చేయని వారికి కూడా పట్టాలు ఇవ్వడంతో అగ్గిమీద గుగ్గిళం అయ్యారు బాధిత జర్నలిస్టులు. ఏళ్ల తరబడి పని చేస్తున్న తమకు ప్లాట్లు కెటాయించకుండా జర్నలిజంతో ఏ మాత్రం సంబంధం లేని వారికి ప్లాట్లు ఎలా కెటాయిస్తారంటూ ప్రశ్నించారు. అప్పుడు సరికొత్త ప్రచారానికి తెరలేపారు ప్రముఖులు. నివేశనా స్థలాలు అలాట్ చేసేది స్థానిక ఎమ్మెల్యే అని ఆయన బీపీఎల్ కోటాలో భూములు అలాట్ చేశారంటూ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. అయితే కరీంనగర్ నుండి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న గంగుల కమలాకర్, అప్పుడు మంత్రిగా కూడా వ్యవహరిస్తున్న క్రమంలో ప్రముఖ జర్నలిస్టులంతా ఆయన వైపు వేలు చూపించే ప్రయత్నం చేశారు. జాబితా తయారు చేయడంలో కీలకంగా వ్యవహరించిన జర్నలిస్టులు చేతులు దులుపుకుని సిట్టింగ్ ఎమ్మెల్యే గంగులపై భారం వేసి తప్పించుకునే ప్రయత్నం చేశారన్న ఆవేదన కరీంనగర్ జర్నలిస్టుల్లో వ్యక్తం అయింది. తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు జర్నలిస్టులకు బాసటగా నిలిచిన గంగుల కమలాకర్ ను బాధ్యుడిని చేస్తూ తప్పించుకోవడం ఏంటని ప్రశ్నించిన వారూ ఉన్నారు. కానీ కొంతమంది పెద్ద జర్నలిస్టుల అణిచివేత తీరును కళ్లారా చూసిన సామాన్య రిపోర్టల్లు ఎదురు తిరిగి ప్రశ్నించే ప్రయత్నం చేయలేకపోయారు.
సడలింపులు…
వాస్తవంగా ప్రభుత్వాలు జర్నలిస్టుల విషయంలో కొన్ని మినాహాయింపులు ఇచ్చేందుకు చొరవ తీసుకుంటాయి. జర్నలిస్ట్ సమాజాం కోసం నిబంధనల్లో సడలింపులు చేసి వారికి బాసట కల్పించే ప్రయత్నం చేస్తుంటాయి. రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ అమలు చేసినప్పుడు జర్నలిస్టులకు కూడా ప్రత్యేకంగా అవకాశం ఇవ్వాలని తెల్ల రేషన్ కార్డు ప్రామాణికత వల్ల తాము లాభోక్తులుగా ఎంపిక కాలేకపోతున్నామని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాగా ఉమ్మడి రాష్ట్రంలోని జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా వెసులుబాటు కల్పించారు. ఇందులో భాగంగా జర్నలిస్టులకు ప్రత్యేకంగా వైట్ రేషన్ కార్డులు ఇవ్వాలని, వారందరికీ ఆరోగ్య శ్రీ కార్డులు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో అప్పుడు రాష్ట్రంలోని చాలామంది జర్నలిస్టులకు ఆరోగ్య శ్రీ కార్డుతో పాటు వైట్ రేషన్ కార్డు అందుకునే అవకాశం దక్కింది. ఇదే విధంగా కరీంనగర్ జర్నలిస్టులకు ప్లాట్లు కెటాయించే విషయంలో నిబంధనల్లో కొన్ని సడలింపులు చేశారని భావించారు. కానీ తుది జాబితాలో అసలు జర్నలిజంతో ఏ మాత్రం సంబంధం లేని వారికి ప్లాట్లు కెటాయించిన తీరుతో తమకు తీరని అన్యాయం జరిగిందని రిపోర్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ సమన్యాయం పాటించాలని భావించినప్పుడు సీక్రెట్ లిస్టు ఎందుకు తయారు చేశారని, అందులో రిపోర్టర్లుగా పనిచేయని వారికి ఎలా ఇచ్చారన్న ప్రశ్న ఉత్పన్నం అయింది. దీని నుండి తప్పించుకునేందుకు బీపీఎల్ కోటాలో ప్లాట్లు కెటాయించారన్న ప్రచారం చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని కరీంనగర్ జర్నలిస్ట్ సమాజానికి అర్థం అయిపోయింది.
బీపీఎల్ కోటా అయితే…
బీపీఎల్ కోటాలో ప్లాట్ల కెటాయింపు ప్రక్రియ కొనసాగితే జర్నలిస్టులకు నివేశనా స్థలాలు కెటాయిస్తున్నామని ఎందుకు ప్రచారం చేశారు..? కొంతమంది జర్నలిస్టు నాయకుల సమక్షంలో జాబితా ఎందుకు సిద్దం చేయాల్సి వచ్చింది..? అసైన్ మెంట్ కమిటీ ఛైర్మన్ గా ఉండే సిట్టింగ్ ఎమ్మెల్యే, కన్వీనర్ గా వ్యవహరించే ఆర్డీఓలతో పాటు కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించాల్సి ఉంటుందన్న విషయం గుర్తెరగాలి. అంతేకాకుండా బీపీఎల్ కోటాలో ప్లాట్ల కెటాయింపునకు ముందే నోటిఫికేషన్ విడుదల చేసి ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో డిస్ ప్లే చేయాల్సి ఉంటుంది. తమకు లబ్ది చేకూర్చాలని దరఖాస్తు చేసుకున్న వారి జాబితాను తయారు చేసి అర్హులైన వారిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఈ జాబితాలోనూ లబ్దిదారుల ఆదాయం, స్థిరాస్థుల వివరాలు, ఐటీ చెల్లిస్తున్నారా..? ప్రైవేట్ సెక్టార్ లో పని చేస్తున్న వారయితే వారికి ఏడాదిగా వస్తున్న ఆదాయం వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని లబ్దిదారులను ఎంపిక చేయాల్సి ఉంటుందన్నది బహిరంగ రహస్యం. అంతేకాకుండా గ్రామ సభల ద్వారా లబ్దిదారులను ఎంపిక ప్రక్రియ కొనసాగించాల్సి ఉంటుందని కూడా తెలుస్తోంది. కరీంనగర్ జర్నలిస్టులకు ప్లాట్లు కెటాయించే విషయం కావడంతో నిబంధనల్లో కొంతమేర సడలింపులు ఇచ్చి భూములను అలాట్ చేసే విధానం అమలు చేశారని భావించారు. కానీ తుది జాబితా విడుదలైన తరువాత బీపీఎల్ కోటాలో నివేశనా స్థలాలు కెటాయించారని పేర్కొనడం విడ్డూరంగా ఉందని అంటున్నారు స్థానిక జర్నలిస్టులు. బీపీఎల్ కోటాలోనే లబ్దిదారుల ఎంపిక కొనసాగితే జాబితా కాలంలో మీడియా సంస్థల పేర్లు ఎందుకు చేర్చారోనన్నది కూడా అంతుచిక్కకుండా పోతోంది. దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారికి లబ్ది చేకూర్చడంలో భాగంగా ఈ చొరవ తీసుకున్నట్టయితే జర్నలిస్టుల కోటాలో ప్లాట్లు ఇప్పించామని ఢంకా బజాయించుకోవడం ఎందుకు..?
ఆబ్లికేషన్సేనా..?
కరీంనగర్ జర్నలిస్టులకు భూములు కెటాయించిన విషయంలో ఖచ్చితంగా కొంత మంది పెద్దల ఆబ్లిగేషన్స్ కే ప్రాధాన్యత ఇచ్చారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మచ్చుకు చూసుకున్నట్టయితే జాబితాలో 122, 123 సీరియల్ నంబర్లలో ఉన్న లబ్దిదారులు ఏనాడు వార్త సేకరణలో నిమగ్నం కాలేదన్నది ఓపెన్ సీక్రెట్. వీరిలో ఒకరు ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉపాధి పొందుతున్నారని తెలుస్తోంది. పెద్దపల్లి జిల్లాలో పని చేస్తున్న ప్రముఖ దినపత్రిక రిపోర్టర్ నాన్ లోకల్ వ్యక్తి అని అతని పేరును జాబితా నుండి తొలగించి అదే జిల్లాలో పని చేస్తున్న మరో పత్రిక ఇంఛార్జి భార్య పేరును ఇదే జాబితాలో చేర్చారన్న ఆరోపణలు ఉన్నాయి. మరో వైపున హైదరాబాద్ నగరంలో పని చేస్తున్న వారికి కూడా ఈ జాబితాలో లబ్దిదారులుగా చేర్చడానికి కారణం ఏంటన్నదే అంతు చిక్కకుండా పోతోంది. నిజంగానే బీపీఎల్ కోటాలో ఇచ్చినట్టయితే స్థానికత అంశం కూడా అత్యంత ప్రాధాన్యతత కూడుకున్నదన్న విషయం గమనించాలి. కరీంనగర్ జర్నలిస్టుల కుటుంబ సభ్యుల పేరిట అలాట్ చేసిన భూముల్లో చాలా మంది ఆధార్ కార్డుల్లో ఉన్న చిరునామా ఎక్కడ ఉంది..? నాన్ లోకల్ అయిన వారికి కరీంనగర్ లో ప్లాట్లు కెటాయించినట్టు అయితే రెవెన్యూ అధికారులు కూడా తప్పులో కాలేసినట్టు అవుతుంది. కానీ జర్నలిస్టులు కాబట్టే కొన్ని మినహాయింపులు ఇచ్చి నివేశనా స్థలాలు కెటాయించారన్న విషయాన్ని మర్చిపోవద్దు. జాబితా వెలుగులోకి రావడంతో జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో అప్పటికప్పుడు కొత్త విషయాలను వెలుగులోకి తీసుకవచ్చి జర్నలిస్టులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప తమ సంక్షేమం కోసం కాదన్న విషయం అందరికీ అర్థం అయిపోందన్నది వాస్తవం. తమ తప్పదాలను కప్పి పుచ్చుకునేందుకు లేని పోని అంశాలను తెరపైకి తీసుకవచ్చి తప్పుడు ప్రచారం మాని అసలైన జర్నలిస్టులకు న్యాయం జరిగే విధంగా చొరవ తీసుకోవలన్న డిమాండ్ వినిపిస్తోంది.
కమిటీ ఎందుకు..?
అసలు జర్నలిస్టులకు భూములు కెటాయించలేదని, బీపీఎల్ కోటాలో పట్టాలు ఇచ్చారని చెప్తున్న కొంతమంది హుటాహుటిన సమావేశాలు ఏర్పాటు చేయడం వెనక ఆంతర్యం ఏమిటీ..? వర్కింగ్ జర్నలిస్టులకు కాకుండా నాన్ వర్కింగ్ జర్నలిస్టులకు భూములు కెటాయించి తమ పొట్టగొట్టారన్న ఆవేదనను ఎలక్ట్రానిక్. ప్రింట్ మీడియా కెమెరా మెన్లు, స్థానిక రిపోర్టర్లు వ్యక్తం చేసిన తరువాత కమిటీ ఏర్పాటు చేసి పట్టాలను పునరుద్దరించేందుకు చొరవ తీసుకుంటామని, ఇందుకు ప్రత్యేకంగా కమిటీ వేస్తున్నామని ఎందుకు ప్రకటించారంటూ ప్రశ్నిస్తున్నారు స్థానిక జర్నలిస్టులు. జర్నలిస్టు కోటాలో ప్లాట్లు కెటాయించలేదన్న వాదనలు తెరపైకి తీసుకవచ్చిన తరువాత బీపీఎల్ కోటాలో తమకు న్యాయం జరగలేదని లబ్దిదారులే నేరుగా అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది కదా. కానీ జర్నలిస్టు నాయకులు ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శించి కమిటీ వేశారన్నది తమ సమాజానికి వివరించాల్సిన ఆవశ్యకత ఉందని కరీంనగర్ కలం యోధులు అంటున్నారు.