ఇంటిబాట పట్టిన విద్యార్థులు…
టీసీలు ఇవ్వాలంటూ దరఖాస్తులు…
దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం ఖాళీ అవుతోంది. ఇక్కడ చదువుకుంటున్న స్టూడెంట్స్ కొంతమంది ఇంటిబాట పట్టగా మరికొంత మంది టీసీలు ఇవ్వాలని అభ్యర్థిస్తూ దరఖాస్తు చేసుకున్నారు. సకల సౌకర్యాలు కల్పించాల్సిన ఈ విద్యాలయంలో తెల్లవారుజాము 2 గంటల నుండే తాము రోజువారి జీవితాన్ని ప్రారంభించాల్సిన దుస్థితి తయారైందంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆహారంలో పురుగులు…
ప్రభుత్వం ఎంతో సదాశయంతో ప్రారంభించిన కస్తూర్భా గాంధీ విద్యాలయాలు నేడు నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్ సప్తగిరి కాలనీలోని కస్తూర్భా విద్యాలయం స్టూడెంట్స్ తమ ఇంటి బాట పట్టారు. వారిని తీసుకెళ్లేందుకు పేరెంట్స్ కూడా అక్కడకు చేరుకున్నారంటే ఈ విద్యాలయంలో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో నిద్ర లేచి స్నానం చేయాల్సి ఉంటుందని, నాలుగు గంటలు దాటిందంటే నీటికి కటకట ఏర్పడుతుందని విద్యార్థులు వాపోతున్నారు. ఉదయం 4 గంటల తరువాత లేచిన స్టూడెంట్స్ కు నీరందదని దీంతో ఆ రోజు వారు స్నానం చేసే అవకాశం కూడా ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఆహారంలో పురుగులు వస్తున్నాయని, బోధకులకు వేరుగా భోజనాలు ఏర్పాటు చేసుకుంటున్నారని స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు. ఇక్కడ జాయిన్ అయిన విద్యార్థుల ఆలనా పాలనా సరిగా లేకపోవడంతో ఇప్పటికే కొంతమంది స్టూడెంట్స్ తమకు టీసీలు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నామని అవి ఇస్తే తాము వేరే చోటకు వెళ్లి చదువుకుంటామని వేడుకున్నామని వివరించారు. ఒకరిద్దరు స్టూడెంట్స్ శనివారం రాత్రి అక్కడి పరిస్థితులను తట్టుకోలేక కంపౌండ్ వాల్ దూకి మరీ ఇంటికి వెల్లిపోయారని కూడా ప్రచారం జరుగుతోంది. టీచింగ్ ఫ్యాకల్టీకి చెందిన కొంతమంది తరగతులు నిర్వహించాల్సిన సమయంలో వీడియో కాల్స్ మాట్లాడుకుంటూ టైంపాస్ చేస్తున్నారని కూడా ఆరోపణలు చేస్తున్నారు. కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థులు తిరిగి వెల్లిపోతున్న సమాచారం అందుకున్న విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన పేరెంట్స్ మాత్రం అక్కడ ఉంచేదే లేదని తేటతెల్లం చేసి తమ పిల్లల లగేజీతో సహా తీసుకెళ్లడం గమనార్హం.
పొన్నం ఫైర్…
సప్తగిరి కాలనీ కస్తూర్భా విద్యాలయంలో స్టూడెంట్స్ ఇళ్లకు తిరిగి వెళ్లిపోతున్నారన్న సమాచారం అందుకున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అక్కడకు చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తన హయాంలో ఎంతో సదుద్దేశ్యంతో ఈ విద్యాలయాన్ని ఏర్పాటు చేశానని, ఇప్పుడు దాని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థులను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తే నేడు ఆ లక్ష్యానికి గండికొడ్తున్నారని పొన్నం మండి పడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తయారైందని ఆరోపించారు.