మేయర్ సునీల్ రావు తీరుపై చర్చ
దిశ దశ, కరీంనగర్:
నగర ప్రథమ పౌరుడిగా బాధ్యతల్లో ఉన్నప్పుడు చట్టాలకు అనుగుణంగా నడుచుకోవలసి ఉంటుంది. 25 రోజులకు మించి విదేశాలకు వెల్లినట్టయితే అధికారులకు సమాచారం చేరవేసి బాధ్యతలు మరోకరికి అప్పగించాలని నిబంధనలు చెప్తున్నాయి. కానీ సెలవు పెట్టకుండా విదేశాలకు వెల్లిపోయిన ఆ మేయర్ చర్యలపై ఇంటా బయటా చర్చ సాగుతోంది. అయితే తాజాగా ఆయన విడుదల చేసిన ఓ వీడియోపై మరో కొత్త ఆలోచనలకు తెరలేపారు. జరిగిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో మరో తప్పులో కాలేస్తున్నారన్న అపవాదును కూడా మూటగట్టుకుంటున్నారు.
మేయర్ సునీల్ రావు తీరు…
కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు విదేశాలకు వెళ్తున్నప్పుడు నిబంధనలు పాటించ లేదని స్వపక్ష, విపక్ష పార్టీల నాయకులు మండిపడుతున్నారు. ఆగస్టు 23న డల్లాస్ కు వెల్లేందుకు టికెట్ బుక్ చేసుకున్నఆయన తిరుగు ప్రయాణానికి సంబంధించిన టికెట్ కూడా తీసుకున్నారు. మొదట సెప్టెంబర్ 24న రిటర్న్ టికెట్ బుక్ చేసుకున్నట్టుగా ఆయనపై ఆరోపణలు చేస్తున్న వారు ఫైట్ టికెట్లను కూడా మీడియాకు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప అధికారులకు ఫిర్యాదు చేయగా, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గుంజపడుగ హరిప్రసాద్ మేయర్ వ్యవహరాన్ని తప్పు పట్టారు. మరో వైపున కాంగ్రెస్ పార్టీకి చెందిన మెండు శ్రీలత కూడా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. నిబందనల ప్రకారం 15 రోజులకు మించి అందుబాటులో లేనట్టయితే డిప్యూటీ మేయర్ కు బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుందని వీరు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సునీల్ రావుకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నోటీసులు జారీ చేయడంతో ఆయన 6వ తేదిన తిరుగు ప్రయాణం అవుతున్నట్టుగా టికెట్ పంపించారు. 15 రోజులకు ముందే తాను స్వస్థలానికి చేరుకుంటున్నానని చెప్పకనే చెప్పారు సునీల్ రావు. ఈ సందర్భంగా సునీల్ రావు విడుదల చేసిన ఓ వీడియో సరికొత్త చర్చకు దారి తీస్తోంది. తాను 14 రోజుల పాటు అందుబాటులో ఉండనని అమెరికా వెల్తున్నానని మునిసిపల్ కమిషనర్ తో పాటు అందరికీ సమాచారం ఇచ్చానని చెప్తున్నారు. మునిసిపల్ చట్ట ప్రకారమే తాను రెండు వారాలకే టూర్ షెడ్యూల్ రూపొందించుకున్నానని పేర్కొన్నారు.
ఆ టికెట్ ఎక్కడిది మరి..?
మొదట సునీల్ రావు సెప్టెంబర్ 24న రిటర్న్ టికెట్ బుక్ చేసుకున్నప్పటికీ కరీంనగర్ అంతటా రచ్చ మొదలు కావడంతో సెప్టెంబర్ 6న తిరుగు ప్రయాణం అయ్యేందుకు నిర్ణయించుకున్నారని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. మునిసిపల్ చట్టం ప్రకారం నడుచుకోలేదని బీఆర్ఎస్ పార్టీ నాయకులే ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో సునీల్ రావు కౌంటర్ అటాక్ చేస్తూ ప్రకటన విడుదల చేయడం సంచనలంగా మారింది. నిబంధనల ప్రకారం ఆయన వ్యవహరించినట్టయితే ఆయన పేరిట మొదట సెప్టెంబర్ 24న రిటర్న్ టికెట్ ఎలా బుక్ అయిందని ప్రశ్నిస్తున్నారు. తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో సునీల్ రావు ఆరోపణలకు దిగుతున్నారన్న వాదనలు కూడా తెరపైకి వచ్చాయి.
పార్టీలో వర్గపోరు…
సునీల్ రావు అమెరికా టూర్ ఎఫెక్ట్ బీఆర్ఎస్ పార్టీపై తీవ్రంగా పడుంతోంది. ఓ వైపున బీసీ మహిళ అయినందుకే ఇంచార్జి బాద్యతలు అప్పగించుకుండా విదేశాలకు వెల్లారని సొంత పార్టీ నాయకులు కూడా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ మేయర్ స్వరూప, నగర పార్టీ అధ్యక్షుడు చల్ల హరిశంకర్ కూడా మీడియా ముందు సునీల్ రావు తీరును తప్పు పట్టారు. ఈ నేపథ్యంలో సునీల్ రావు విడుదల చేసిన ప్రకనలో పదవి కాంక్షతోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని చల్ల హరిశంకర్ దంపతులపై ఆరోపణలు చేశారు. మీలా వెన్నుపోటు పొడిచే కార్యక్రమాలు తాను ఏనాడు చేయలేదంటు ఎదురుదాడికి దిగారు సునీల్ రావు. అయితే తాజాగా చల్ల హరింకర్ కూడా మీడియాతో మాట్లాడుతూ పదవి కాంక్ష ఎవరికి ఉందో అందరికీ తెలుసని, తాను నమ్ముకున్న నాయకుడి వెంటే ఉన్నాను కానీ పార్టీలు మాత్రం మారలేదని సునీల్ రావు ఆరోపణలను తప్పుపట్టారు. పార్టీలు ఫిరాయించిన సంస్కృతిని కూడా ఎత్తి చూపుతూ ఆయన చేసిన వ్యాఖ్యాలు ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి.
అప్పుడెందుకు రిటర్న్ టికెట్: మెండు చంద్ర శేఖర్..
నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించడమే కాకుండా మేయర్ సునీల్ రావు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు మెండు చంద్ర శేఖర్ (మార్షల్) మండిపడుతున్నారు. మొదట సెప్టెంబర్ 24 రిటర్న్ బుక్ చేసుకుని, కలెక్టర్ నోటీసు ఇవ్వగానే ఈ నెల 6న మరో టికెట్ బుక్ చేసుకుని తాను మునిసిపల్ చట్టానికి లోబడే వ్యవహరించానని ప్రకటించడం సరికాదన్నారు. మునిసిపల్ కమిషనర్ కు సమాచారం ఇచ్చానని మేయర్ చెప్తున్నందున ఈ విషయంపై కమిషనర్ కూడా బల్దియా పాలకవర్గానికి, కరీంనగర్ ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని మార్షల్ కోరారు. 30 ఏళ్లుగా రాజకీయాల్లో వివిద పదవుల్లో ఉన్నానని చెప్తున్న సునీల్ రావు మునిసిపల్ చట్టంపై అవగాహన లేనట్టుగా మొదట నెల రోజులకు రిటర్న్ బుక్ చేసుకుని ఇప్పుడు ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.