బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ రాక్షస సమితి…

కేసీఆర్ అంటే ఖాసీం చంద్రశేఖర రజ్వీ

దేశ్ కీ నేత… దిన్ బర్ పీతా…..

రాహుల్ ఓ గజినీ…..

లోకసభలో బీజేపీ ఎంపీ బండి సంజయ్

దిశ దశ, న్యూ ఢిల్లీ:

యే కాంగీ, బెంగాల్ దీదీ, ఢిల్లీ కేజ్రీ, బీహార్ జేడీ, ఔర్ తెలంగాణ కేడీ మోడీని ఏమీ చేయలేరు… తెలంగాణ ఇచ్చిన పార్లమెంట్ పవిత్ర దేవాలయం…శిరస్సు వంచి నమస్కరిస్తున్నా… సుష్మాస్వరాజ్ కు నా సెల్యూట్… కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. గురువారం లోకసభలో కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మాట్లాడిన బండి సంజయ్ ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. చీమల పుట్టలో పాములా కేసీఆర్ కుటుంబం చేరారంటూ, కేంద్రం పుష్కలంగా నిధులిచ్చినా, సహకరించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. రైతు సగటు ఆదాయంకంటే కేసీఆర్ కుటుంబ ఆదాయం వందల రెట్ల ఎట్లా పెరిగాయని ప్రశ్నించిన బండి సంజయ్ 24 గంటల పాటు తెలంగాణలో కరెంటు ఇస్తున్నట్టు రుజువు చేయాలని నిజమైతే నేను ముందు రాజీనామా చేస్తానని ఇదుగో నా రాజీనామా అంటూ బీఆర్ఎస్ ఎంపీలకు బండి సవాల్ విసిరారు. లేనట్టయితే బీఆర్ఎస్ ఎంపీలు రాజీనామా చేస్తారా, లేదంటే పార్లమెంటు సాక్షిగా అబద్దాలు చెప్పామని ముక్కు నేలకు రాయాలంటూ బండి సంజయ్ డిమాండ్ చేశారు. మణిపూర్ కు పీఎం వెళ్లలేదని అడిగే నైతిక అర్హత మీకు లేదని, కాంగ్రెస్ గల్లీలో లేదు.. ఢిల్లీలో లేదని, ఉప ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. పార్లమెంట్ లో భరతమాతను హత్య చేశారంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. ‘‘ఆయన ఎప్పుడేం చేస్తడో ఆయనకే తెలియదు, ఒకసారి కన్ను కొడతడు.. ఒకసారి కౌగిలించకుంటడు.. ఇంకోసారి ఫ్లైయింగ్ కిస్ ఇస్తడు.. గజినీ లెక్క తయారయ్యాడంటూ దుయ్యబట్టారు. ఇట్లాంటాయనతో కలిసి అవకాశవాద కూటమి అవిశ్వాసం తీర్మానాన్ని ప్రవేశపెట్టడం చూస్తుంటే నాకు నవ్వొస్తుందంటూ ఎద్దేవా చేశారు. భరతమాత జోలికొస్తే కన్ను పీకే ఆదర్శనేత నరేంద్రమోదీ’’ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. మోడీ నాయత్వంలో ఎన్డీయే ప్రభుత్వం శక్తివంతమైన దేశంగా మారుతోందన్నారు. నీళ్లు-నిధులు-నియామకాలు అన్న నినాదంతో సాధించుకున్న తెలంగాణను సాకారం చేసిన దేవాలయమిదని, ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ వల్ల రాష్ట్రంలో 1400 మంది యువకులు బలయ్యారని, జై తెలంగాణా అంటూ రివాల్వర్ తో కాల్చుకున్నారన్నని, ట్రైన్ కు ఎదురుగా పోయి ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఇదే సభా వేదికగా తెలంగాణ బిల్లు పెడతారా, మేం వచ్చాక రాష్ట్రం ఇవ్వమంటారా? అంటూ సుష్మా స్వరాజ్ నిలదీస్తే అప్పటి ప్రభుత్వం నూతన రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని చూడటానికి మీరు బతికి ఉండాలని అప్పీల్ చేస్తే యువతకు భరోసా ఇచ్చిన మహా నాయకురాలని, చిన్న రాష్ట్రాలకు బీజేపీ మొదటి నుండి అనుకూలంగా ఉందని, తెలంగాణకు అనుకూలంగా కాకినాడ తీర్మానం చేసిన పార్టీ బీజేపీ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. అవినీతి యూపీఏ ఐఎన్డీఐఏగా ఎట్లా మారిందో, బీఆర్ఎస్ పార్టీ భ్రష్టాచార్ రాక్షస సమితిగా తయారైందంటు బండి సంజయ్ ఆరోపించారు. ఆ పార్టీ లీడర్ పేరు ఖాసీం చంద్రశేఖర్ రజ్వీ అంటూ దుయ్యబట్టారు. రాత్ బర్ పీతా… దిన్ బర్ సోతా… కిస్ సే బీ నహీ మిల్ తా… యే హై దేశ్ కీ నేత అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అధికారంలోకి రాకముందుతో పోలిస్తే 2018 నాటికి ఖాసీం రజ్వీ కొడుకు ఆస్తులు 400 రెట్లు పెరిగాయి, ఆయన భార్య ఆస్తులు 18వందల శాతం పెరిగాయన్నారు. తెలంగాణ రైతుల సగటు ఆదాయం 1 లక్షా 12 వేల 836 రూపాయలుంటే. కేసీఆర్ వ్యవసాయ ఆదాయం కోటి రూపాయలయిందని ఆరోపణలు గుప్పించారు. కేటీఆర్ ఆదాయం 59 లక్షల 85 వేలు అంటే రైతుల కంటే 5 వేల శాతం అధికమని, ఆయన కోడలు ఆదాయం 2 వేల శాతం అధికమని మండిపడ్డారు. కేంద్రం పుష్కలంగా నిధులిచ్చినా, దారి మళ్లించారని, 9 ఏళ్లలో రూ.5 లక్షల కోట్లకుపైగా నిధులు కెటాయించడంతో పాటు రూ.9 లక్షల 60 వేల కోట్ల అప్పులిచ్చిందన్నారు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ప్రజలకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తున్న ఘనత మోడిదేనని, టాయిలెట్లకు నిధులిస్తే దోచుకున్నారని, రూ.4 వేల కోట్ల అంచనాలతో రూపొందించిన భగీరథను 40 వేల కోట్లకు పెంచి దోచుకున్నారని ఆరోపణలు గుప్పించారు. ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇస్తున్న ఘనత మోడిదేనని, ఉచితంగా రేషన్ అందిస్తుంటే వాటిని అమ్ముకుంటున్న దొంగలు బీఆర్ఎస్ నేతలంటూ ఆరోపించారు.
మణిపూర్ సరే తెలంగాణ సీఎం చేస్తున్నదేమిటో చెప్పాలన్నారు. తెలంగాణలో ఎంత పెద్ద దుర్ఘటన జరిగినా సీఎం ఎందుకు వెళ్లడం లేదో చెప్పాలని, రైతులు చనిపోయినా, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా వెళ్లరు కానీ మణిపూర్ అల్లర్ల గురించి మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. తెలంగాణాలో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, భూ కబ్జాల సంగతేంటన్నారు. దేశంలో సనాతన సంప్రాదాయంతో హిందూ సంఘటిత శక్తిని ఏకం చేసే క్రమశిక్షణ కలిగిన సంస్థ ఆర్ఎస్ఎస్.. ‘‘నమస్తే సదావత్సలే మాత్రుభూమే.. త్వయా హిందు భూమే సుఖం వర్ధితోహమ్… మహామజ్గలే పుణ్యభూమే త్వదర్థే… పతత్వేష కాయే నమస్తే నమస్తే’’ అంటూ భారత మాతను తలచి కొలిచి ఆరాధించే గొప్ప సంస్థ ఆర్ఎస్ఎస్ అన్నారు. అంత గొప్ప సంఘాన్ని నిక్కర్ లిక్కర్ అంటూ అవమానించే కాంగ్రెస్ కు పుట్టగతులుండవంటూ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నయని, గల్లీలో కుస్తీ పడుతున్నట్లు యాక్షన్ చేస్తూ ఢిల్లీలో దోస్తీ చేస్తూ మోడిగారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతన్నాయన్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు ఓటేసినట్లేనని, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కవల పిల్లలని వ్యాఖ్యానించారు. దేశంలో అయినా రాష్ట్రంలో అయినా డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే అభివృద్ది సాధ్యమంటూ బండి సజయ్ వ్యాఖ్యానించారు.

You cannot copy content of this page