దిశ దశ, కరీంనగర్:
అది కరీంనగర్ నడి బొడ్డున ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రి… భారీ బందోబస్తుతో పాటు ప్రత్యేకంగా బారిగేట్లు ఏర్పాటు చేశారక్కడ… కరీంనగర్, పెద్దపల్లి ప్రధాన రహదారితో పాటు హస్పిటల్ జోన్ కావడంతో వాహనాల రాకపోకలతో ఆ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. అంతలోనే ఓ కాన్వాయ్ రాగానే పోలీసులు అంతా కూడా అలెర్ట్ అయ్యారు. ఓ వాహానాన్ని మాత్రం హస్పిటల్ సెల్లార్ లోకి పంపించారు. హస్పిటల్ చుట్టూ మద్యాహ్నం మూడు గంటల వరకు బందోబస్తు చేపట్టారు.
మాజీ డీసీపీ రాకతో…
రిటైర్డ్ డీసీపీ రాధాకృష్ణ ఆసుపత్రికి వచ్చిన సందర్భంగా పకడ్భందీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితునిగా ఉన్న మాజీ డీసీపీ రాధాకృష్ణ జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. తన తల్లి సరోజిని దేవి(98) అనారోగ్యం బాధపడుతుండడంతో ఆమెను స్థానిక సాగర్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. మార్చి 12న అనారోగ్యం బారిన పడడంతో సాగర్ ఆసుపత్రి ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రాంకియాసిస్ వ్యాధితో బాధపడుతున్న సరోజనమ్మను చూసేందుకు అనుమతి ఇవ్వాలని రాధాకృష్ణ కోర్టు అనుమతి కోరారు. దీంతో ఆదివారం 11 గంటల నుండి 3 గంటల వరకు కరీంనగర్ సాగర్ ఆసుపత్రికి వెల్లి ఆయన తల్లి సరోజనమ్మను చూసేందుకు అనుమతించింది కోర్టు. జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న ఖైదీ కావడంతో రాధాకృష్ణకు ఎస్కార్ట్, పాయిలెట్ వాహనాలను ఏర్పాటు చేసి మరీ కరీంనగర్ కు తరలించారు. తల్లితో దాదాపు నాలుగు గంటల పాటు ఆసుపత్రిలో గడిపిన రాధా కిషన్ రావును కోర్టు ఇచ్చిన సమయం ముగియడంతో తిరిగి హైదరాబాద్ చంచల్ గూడ జైలుకు తరలించారు.
ఓడలు బండ్లు…
నిన్న మొన్నటి వరకు ఓఎస్డీగా పనిచేసిన రాధా కిషన్ రావు చుట్టూ రక్షణ వలయం అధికారికంగా ఉండేది. దాదాపు మూడున్నర సంవత్సరాల క్రితం రిటైర్ అయిన రాధా కిషన్ రావు స్పెషల్ ఆఫీసర్ గా నియమిస్తూ ఆయనకు ప్రభుత్వం ఎక్స్ టెన్షన్ ఇచ్చింది. గత సంవత్సరం పీరియడ్ ముగియడంతో మళ్లీ ఎక్స్ టెన్షన్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆధేశాలు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాధాకిషన్ రావుపై ఈసీఐకి ఫిర్యాదులు వెల్లడంతో ఆయనను విధుల నుండి తప్పించారు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడగానే రాధాకిషన్ రావు తన బాద్యతలకు రాజీనామా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా ఆయనకు అధికారికంగా ఏర్పాటు చేసిన రక్షణ వలయంలోనే ఉన్నారు. కానీ ఎన్నికల తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంపై విచారణ చేయిస్తుండడంతో ఆయన కూడా ఓ నిందితుడయ్యారు. ఎన్నికలకు ముందు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన కేసు విచారణలో పలువురు పోలీసు అధికారులను అరెస్ట్ చేయగా అందులో మాజీ డీసీపీ రాధా కిషన్ రావు ఒకరు. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆరు నెలల క్రితం వరకు కూడా పోలీసు అధికారిగా ఆయనకు రక్షణ కల్పిస్తే ఇఫ్పుడు మాత్రం నిందితునిగా రక్షణ కల్పించాల్సి వచ్చింది. ఆరు నెలల కాలంలోనే ఓడలు బండ్లుగా… బండ్లుగా మారినట్టుగా రాధాకిషన్ రావు పరిస్థితి మారిపోయింది. దీంతో ఆయన కోర్టు అనుమతి తీసుకుని, రక్షణ వలయం నడుమ కన్న తల్లిని చూసేందుకు రావల్సి వచ్చింది.
ఆయనే…
అయితే రాధాకిషన్ రావును తరలించేందుకు ఏర్పాటు చేసిన బందోబస్తు, వాహనాల ఏర్పాటు కోసం అవసరమైన ఖర్చులు ఆయనే భరించాలని కోర్టు ఆదేశించింది. ఇందుకు అయ్యే రూ. 18 వేలు ఆయన్నే చెల్లించాలని ఆదేశించడంతో తల్లిని చూసేందుకు రాధాకిషన్ రావు ఈ మేరకు డబ్బలు చెల్లించినట్టుగా అధికార వర్గాలు తెలిపాయి.