ఆపరేషన్ మిడ్ నైట్… అనామకులను కేంద్రాలకు తరలింపు… జులాయి బాబులపై కొరడా…

దిశ దశ, కరీంనగర్:

ఫుట్ పాత్, బస్ స్టేషన్లలో సెద తీరుతున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించే పనిలో నిమగ్నం అయ్యారు కరీంనగర్ పోలీసులు. అర్థరాత్రి స్పెషల్ ఆపరేషన్ చేసి వీరిని స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న కేంద్రాలకు తరలించారు. రాత్రి వేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు మాత్రమే నిర్వహించి చేతులు దులుపుకోకుండా అనామకులను అక్కున చేర్చుకునే బాధ్యతలు కూడా తమ భుజాలపై వేసుకున్నారు వన్ టౌన్ పోలీసులు. సీఐ బిళ్ళ కోటేశ్వర్, ఎస్సైలు రాజన్న, భాస్కర్ రెడ్డిలతో పాటు పోలీసు యంత్రాంగం ఈ స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. శుక్రవారం అర్థరాత్రి ఆర్టీసీ బస్ స్టేషన్ తో పాటు పరిసర ప్రాంతాల్లో నిద్రిస్తున్న వారిని లేపి స్థానిక వృద్దాశ్రమానికి పంపించారు. వీరిలో కొంతమంది బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న వారూ కూడా ఉన్నారు. తాము ఎక్కడికి వెళ్లమని భీష్మించుకున్న వారిని ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహించి వృధ్దాశ్రమానికి తరలించేందుకు పోలీసులు చొరవ తీసుకున్నారు. ప్రధానంగా రద్దీ ప్రాంతాల్లో అనామకుల వేషంలో దొంగలు కూడా రంగంలోకి తమ హస్తలాఘవాన్ని ప్రదర్శించే ప్రమాదం ఉంటుందని గమనించిన పోలీసులు ఈ స్పెషల్ ఆపరేషన్ చేపట్టినట్టుగా తెలుస్తోంది. దీనివల్ల నేరాల కట్టడి కావడంతో పాటు రోడ్ల పక్కన, ఆర్టీసీ బస్ స్టేషన్ తో పాటు ఇతర రద్దీ ప్రాంతాల్లో అలనా పాలనా లేకుండా జీవనం సాగిస్తున్న వారికి ఓ నీడ కల్పించినట్టు అవుతుందని భావించామని వన్ టౌన్ సీఐ బిళ్ల కోటేశ్వర్ అన్నారు.

ఫ్రీ బెగ్గింగ్ జోన్స్..

అర్థరాత్రి స్పెషల్ పోలీసులు చేపట్టిన ఈ ఆపరేషన్ వల్ల బిక్షాటన చేసే వారి సంఖ్య కూడా తగ్గే అవకాశాలు లేకపోలేదు. నగరంలో విపరీతంగా పెరిగిపోయిన బిక్షగాళ్లను కూడా అనాథ, వృద్దాశ్రమాలకు తరలించినట్టయితే వారి జీవితాలకు భరోసా కల్పించినట్టు అవుతుంది. అంతేకాకుండా ప్రీ బెగ్గింగ్ జోన్ గా కరీంనగర్ మారే అవకాశం ఉంది. గోదావరి పుష్కరాల సమయంలో ధర్మపురి పుష్కర ఘాట్లు, ఆలయ పరిసర ప్రాంతాల్లో బిక్షాటన చేసే వారిని నియంత్రించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. బిక్షాటన చేసే విధానానికి స్వస్తి పలికించేందుకు ప్రత్యేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారిస్తున్నాయి. కరీంనగర్ పోలీసులు వినూత్నంగా చేపట్టిన ఈ ఆపరేషన్ ద్వారా బిక్షాటన చేసే వారిని పునరావస కేంద్రాలకు తరలించడం, వారికి ఉపాధి మార్గాలు కల్పించడం వంటి చర్యలు తీసుకున్నట్టయితే రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంది. హైదరాబాద్ సిటీ పోలీసు అధికారులు కూడా ట్రాన్స్ జెండర్లను ట్రాఫిక్ నియంత్రణ ద్వారా ఉపాధి కల్పించే విధానానికి శ్రీకారం చుట్టారు. దీనివల్ల వారికి ఉపాధి కల్పించినట్టు కాగా బిక్షాటనతో జీవనం సాగించే విధానానికి స్వస్తి వారిచే స్వస్తి పలికించినట్టు అవుతుందని అధికారులు భావించారు. ఇలాంటి చొరవ జిల్లాల్లో కూడా తీసుకున్నట్టయితే సత్ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

జులాయిలపై కొరడా…

మరోవైపున ప్రధాన కేంద్రాల్లో అర్థారాత్రి జులాయిగా తిరుగుతున్న వారిపై కూడా వన్ టౌన్ పోలీసులు కఠినంగా వ్యవహరించారు. నగరంలోని బస్ స్టేషన్, గీతా భవన్, ఎన్టీఆర్ చౌరస్తా, తీగల వంతెన, శనివారం మార్కెట్ తో పాటు పలు ప్రాంతాల్లో గస్తీ చేసిన పోలీసులు అర్థరాత్రి జులాయిగా తిరుగుతున్న వారిని గుర్తించారు. ఒక్క శుక్రవారం అర్థరాత్రి 23  బైకులు, 2 ఆటోలు, ఒక కారు సీజ్ చేశామని వన్ టౌన్ సీఐ బిళ్ల కోటేశ్వర్ తెలిపారు.

You cannot copy content of this page