విదేశాల్లో ఉన్న నిందితుల కోసం లుక్ ఔట్ నోటీసులకు రంగం సిద్దం..?

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ పోలీసు కమిషనరేట్ పరిధిలో నమోదవుతున్న నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులు ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు. భూముల దురాక్రమణలకు పాల్పడిన వారిపై ఫిర్యాదులు వస్తుండడంతో కరీంనగర్ పోలీసులు కేసులు నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. మూడు రోజుల క్రితం కొత్తపల్లి పోలీసులు ఓ కేసులో పరారీలో ఉన్న నిందితుల కోసం వేట మొదలు పెట్టినట్టుగా తెలుస్తోంది. 12 మందిపై కేసు నమోదు కాగా ఇందులో మునిసిపల్ ఆర్ఐ జంకె శ్రీకాంత్, బిల్ కలెక్టర్ కొత్తపల్లి రాజు, మొహ్మద్ ఫిరోజ్ ఖాన్, కాంపెల్లి రామాంజనేయులులను అరెస్ట్ చేయగా మిగతా వారు పరారీలో ఉన్నారు. ఈ కేసులో ఏ3గా ఉన్న కొత్త జైపాల్ రెడ్డి విదేశాల్లో ఉన్నడని గుర్తించిన పోలీసులు అతని కోసం లుక్ ఔట్ సర్క్యూలర్ జారీ చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు అవసరమైన కసరత్తులు చేస్తున్నట్టుగా సమాచారం. ఇండియాలో అడుగుపెట్టగానే ఆయనను  అదుపులోకి తీసుకునేందుకు వీలుగా లుక్ ఔట్ సర్క్యూలర్ జారీ చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే మిగతా నిందితుల్లో కూడ ఎవరైనా విదేశాల్లో ఉన్నారా అన్న విషయాలను తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నం అయినట్టుగా తెలుస్తోంది.

అట్రాసిటీ కేసుల దందా…

మరోవైపు ఈ కేసులో అరెస్ట్ అయిన కాంపెల్లి రామాంజనేయులు పలువురిపై అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేశారని, భూ దందాలకు సంబంధించిన వ్యవహారాల్లో తలదూర్చి ఆయనచే దరఖాస్తులు ఇప్పించే సంస్కృతి కూడా కొనసాగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కులం పేరుతో దూషించారని అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేసేందుకు  అగ్రవర్ణాలకు చెందిన వారు అస్త్రంగా వాడుకున్నారన్న చర్చ సాగుతోంది. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో రామంజనేయులతో పాటు మరి కొందరు కూడా కులంపేరుతో దూషించారన్న ఫిర్యాదులు ఇవ్వడం వాటి ఆధారంగా అప్పటి పోలీసు అధికారులు పిలిపించడం పరిపాటిగా మారిపోయిందని స్థానికులు అంటున్నారు. అణగారిన వర్గాల వారిని కాపాడేందుకు అమలు చేస్తున్న ఈ చట్టాన్ని అసలైన బాధితుల కోసం వినియోగించకుండా బ్లాక్ మెయిల్ కోసం వాడుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమిషనరేట్ తో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సరిహధ్దు పోలీస్ స్టేషన్లలో ఇచ్చిన అట్రాసిటీ కేసుల దరఖాస్తులు, నమోదయిన కేసులను లోతుగా అధ్యయనం చేస్తే చట్టాన్ని దుర్వినియోగం చేసిన ప్రబుద్దుల గురించి బట్టబయలు అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అక్రమ దందాల కోసం అట్రాసిటీ కేసులు నమోదు చేయించేందుకు కొంతమంది దళితులను అడ్డుగా పెట్టుకుని బెదిరింపులకు పాల్పడిన ఘనులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఒకే వ్యక్తి అట్రాసిటీ చట్టం ప్రకారం తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేసిన సందర్భాలు ఉన్నందున వాటి గురించి వివిధ కోణాల్లో ఆరా తీస్తే బడాబాబుల భాగోతం బయట పడుతుందని కరీంనగర్ వాసులు అంటున్నారు.

You cannot copy content of this page