ఓపెన్ బార్ పై పోలీసుల స్పెషల్ ఆపరేషన్…
దిశ దశ, కరీంనగర్:
అల్గునూరు ఎల్లమ్మ గుడి వద్ద నిర్వహిస్తున్న ఓపెన్ బార్ పై పోలీసులు కొరడా ఝులిపించడం మొదలు పెట్టారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడమే నేరమంటే… క్రయ విక్రయాలు కూడా జరుపుతున్నారన్న విషయం తెలిసిన కమిషనరేట్ పోలీసు అధికారులు వెంటనే కార్యరంగంలోకి దూకారు. రెండు రోజులుగా నిఘా కళ్లను అలెర్ట్ చేసిన పోలీసు అధికారులు స్పెషల్ టీమ్స్ ను రంగంలోకి దింపాయి. రోజు రాత్రి 11 గంటల నుండి తెల్ల వారు జాము వరకూ జాతరను తలపిస్తున్న ఈ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మద్యం విక్రయాలను కట్టడి చేసే పనిలో నిమగ్నం అయ్యారు పోలీసు అధికారులు. దీంతో రెండు రోజులుగా అల్గునూరు ఎల్లమ్మ గుడి వద్ద పోలీసులు మోహరించి డేగ కళ్లతో వాచ్ చేస్తున్నారు. రెండు రోజులుగా అర్థరాత్రి వేళల్లో సాగుతున్న ఈ వ్యవహారంపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. రెండు రోజులుగా పోలీసు బృందాలు చేపట్టిన దాడుల్లో కొన్ని కార్లు, బైకులను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించినట్టుగా తెలుస్తోంది. హైవే సమీపంలో సాగుతున్న ఓపెన్ బెల్ట్ షాపులో మద్యం తాగిన వారు తిరుగు ప్రయాణంలో ప్రమాదాల బారిన పడుతుండడంతో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని భావించిన పోలీసు అధికారులు ప్రత్యేకంగా పెట్రోలింగ్ టీమ్స్ ను రంగంలోకి దింపినట్టుగా తెలుస్తోంది. అయితే పోలీసులు దాడులు చేస్తున్న విషయాన్ని పసిగట్టిన బెల్ట్ షాపు వాలాలు రాత్రి 12 గంటల తరువాత అమ్మకాలు సాగిస్తున్నట్టుగా గుర్తించిన పోలీసులు శనివారం అర్థరాత్రి 12 గంటల తరువాత ఆపరేషన్ స్టార్ట్ చేశారు. మందు ప్రియులు, బెల్ట్ షాప్ వాలాలు పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నప్పటికీ కొన్ని వాహనాలను మాత్రం స్వాధీనం చేసుకున్నారు. ఓ వైపున మానేరు నది మరో వైపున శ్మశానం, ఓపెన్ ప్లేస్ ఉండడంతో ఇక్కడ గుమిగూడిన వారంతా చెల్లచెదరయి పోయారు. లేనట్టయితే మద్యం ప్రియులతో పాటు బెల్ట్ షాపు నిర్వహాకులు కూడా పట్టుబడే అవకాశాలు ఉండేవి. మరో వైపున కరీంనగర్ బైపాస్ రోడ్డులో కూడా అర్థరాత్రి దాటిన తరువాత రెండు హోటల్స్ నడుస్తుండడంతో మద్యం ప్రియులు ఆహారం కోసం అక్కడకు చేరుకుంటున్నారు, ఈ క్రమంలో మందుబాబుల మధ్య గొడవ జరగడంతో అక్కడ కూడా బందోబస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. అలాగే రాత్రి వేళల్లో హోటల్స్ క్లోజ్ చేయించాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. మద్యం మత్తులో గొడవ తార స్థాయికి చేరినట్టయితే హత్యలు చేసుకునే పరిస్థితికి కూడా చేరుకునే ప్రమాదం ఉంటుందని గమనించిన పోలీసు అధికారులు బందోబస్తు చర్యలు కట్టుదిట్టం చేస్తున్నారు.