మెగా జాబ్ మేళాలో అరుదైన దృశ్యం
పోలీసు అధికారుల చొరవ
దిశ దశ, కరీంనగర్:
చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు పెట్టడమే కాదు.. క్రమ శిక్షణతో కూడిన జీవితాన్ని కూడా అందిస్తామంటున్నారు కరీంనగర్ పోలీసులు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకుంటే సరిపోదని గమనించిన సీపీ సుబ్బారాయుడు వారి జీవితాలను గాడిలో పెట్టాలని భావించారు. మానసిక పరివర్తన చెందాలంటే వారికి ఏం కావాలో గుర్తించారు… ఇందుకు వారూ సమ్మతించారు. అంతే ఇప్పుడు వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపినట్టయింది.
థర్డ్ జెండర్లకు ఎంప్లాయిమెంట్…
కరీంనగర్ యువత ఉపాధి లేక నిరాశకు లోనవుతున్నారన్న విషయాన్ని గమనించిన కరీంనగర్ సీపీ మంగళవారం మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశారు. వివిధ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి ప్రత్యేకంగా రిక్రూట్ మెంట్ ప్రాసెస్ చేయడంపై దృష్టి సారించి మల్టినేషనల్ కంపెనీలు, ఈ కామర్స్ కంపెనీలు కూడా నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ముందుకు వచ్చాయి. అయితే సాధారణ యువతే కాకుండా ఈ మెగా జాబ్ మేళాలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. కరీంనగర్ కు చెందిన పలువురు థర్డ్ జెండర్స్ కు కూడా ఈ ఉపాధి అవకాశాలు కల్పించారు. సుమారు 10 మంది థర్డ్ జెండర్స్ కు అమెజాన్ కంపెనీ ప్యాకింగ్ వింగ్ లో ఉద్యోగావకాశాలు లభించాయి. ఈ మేరకు ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ చేతుల మీదుగా అపాయింట్ మెంట్ లెటర్స్ తీసుకున్నారు వీరంతా. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్ పర్సన్ కనుమల్ల విజయ, ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ బండ శ్రీనివాస్, కరీంనగర్ కలెక్టర్ ఆర్ వి కర్ణన్, సీపీ సుబ్బారాయుడు, అడిషనల్ డీసీపీలు శ్రీనివాస్, చంద్రమౌళి, ఏసీపీ తుల శ్రీనివాస్ లు పాల్గొన్నారు.
నాడు కేసులు…
ఇటీవల కరీంనగర్ సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్ లో గొడవకు కారణమయ్యారని, బలవంతంగా వసూళ్లకు పాల్పడుతున్నారని పెద్ద గొడవ జరిగింది. ఈ వ్యవహారంలో పోలీసులకు ఫిర్యాదు అందడంతో పలువురు థర్డ్ జెండర్స్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో కూడా ఇలాంటి గొడవలు జరిగినప్పటికీ వీరిపై కేసులు నమోదు చేసి, కౌన్సిలింగ్ నిర్వహించిన సందర్భాలూ ఉన్నాయి. అయితే ఈ సారి మాత్రం కాస్తా వైవిద్యంగా ఆలోచించిన కరీంనగర్ సీపీ సుబ్బారాయడు థర్డ్ జెండర్స్ కు ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు ఎదురవుతున్నాయని గమనించారు. వారికి దారి చూపినట్టయితే సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని గమనించి థర్డ్ జెండర్స్ కు ఉద్యోగాలు ఇప్పించేందుకు ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు.