karimnagar politics: అంతర్మథనంలో సెకండ్ క్యాడర్… కరీంనగర్ పాలిటిక్స్ తీరు…

దిశ దశ, కరీంనగర్:

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది కరీంనగర్ ద్వితీయ శ్రేణి నాయకుల్లో అయోమయం నెలకొంది. తమ నాయకులు ఇస్తున్న సంకేతాలతో తమ భవిష్యత్తు ఏమవుతోందోనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. సొంత పార్టీలో తమకు అవకాశం లేనట్టయితే ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుదామన్నా భయం భయంగానే ఉంది. తమ నాయకులు చెప్తున్న విషయాలు నిజమా కాదా అన్న విషయంపై స్పష్టత లేకుండా పోతోంది. దీంతో తాము వేరే పార్టీ వైపు అడుగులు వేసిన ఆ పార్టీ నాయకుడు, తమ పార్టీ నాయకుడు ఇద్దరు కూడా సన్నిహితంగా ఉన్నట్టయితే తమ పొలిటికల్ ఫ్యూచర్ డేంజర్ జోన్ లోకి చేరుతోందని కలవరపడుతున్నారు. ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నాయకుల మధ్య సమన్వయం ఉందా లేదా అన్న విషయం గురించి క్లారిటీ చేసుకునే అవకాశం కూడా లేకపోవడంతో పార్టీలు ఫిరాయించడానికి కూడా మీనామేషాలు లెక్కించాల్సిన పరిస్థితి తయారైంది సెకండ్ క్యాడర్ లీడర్లకు.

వాట్పప్ చాటింగ్…

ఓ పార్టీకి చెందిన నాయకుడు స్థానిక ప్రజా ప్రతినిధులతో వాట్సప్ ఛాటింగ్ చేస్తూ ఆ పార్టీ ముఖ్య నాయకుడు తాను ఒకటేనని, వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగాలోనన్న విషయంపై ఆలోచిస్తున్నామన్న రీతిలో వాట్సప్ ఛాటింగ్ చేస్తుండడంతో ద్వితీయ శ్రేణి నాయకులు ముందుకెళ్లలేక, వెనక్కి రాలేక కొట్టుమిట్టాడున్నారు. మరో వైపున ఓ జాతీయ పార్టీకి చెందిన ఫలనా నాయకునితో తనకున్న సాన్నిహిత్యం కారణంగా టికెట్లు కెటాయించే విషయంలో సమీకరణాలు చేసుకుంటామని కూడా తేల్చి చెప్తున్నట్టుగా సదరు పార్టీ నాయకుల మధ్య చర్చ జరుగుతోంది. నిజంగానే ఆ నాయకులతో తమ నేత మధ్య బంధం పెనవేసుకుని ఉన్నట్టయితే తమ భవిష్యత్తు ఏమవుతుందోనని భయంతో వెనకడుగు వేస్తున్నారు. ఇప్పటికే రెండు ప్రధాన పార్టీల నుండి ఫిరాయించిన స్థానిక ప్రజా ప్రతినిధులు గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటుండడంతో పార్టీలు మారిన తరువాత తమకు కూడా అలాంటి  పరిస్థితిలే ఎదురయితే రాజకీయ భవిష్యత్తు అంధకారంలోని నెట్టేసుకున్నట్టు అవుతోందని ఆలోచిస్తున్నారు. అయితే ఇప్పుడున్న పార్టీలో కొనసాగినా స్థానిక ఎన్నికల్లో తమకు అవకాశం ఉంటుందా, ప్రాధాన్యత కల్పిస్తారా అన్న విషయంపై తర్జనభర్జనలు పడుతున్నారు. దీంతో తామేం చేయాలి అన్నదే అంతు చిక్కకుండా పోతోందని, ప్రధాన పార్టీల ముఖ్య నాయకుల మధ్య కో ఆర్డినేషన్ ఈ స్థాయిలో ఉన్నట్టయితే పార్టీ బలహీనపడడం ఖాయమన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ఆశల పల్లకి అలా…

ఇకపోతే ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల సమయంలో అన్ని విషయాల్లో వెన్నుదన్నుగా నిలుస్తానని మాట ఇచ్చినప్పటికీ చేతల్లో మాత్రం చూపించలేదన్న ఆవేదన కూడా సదరు పార్టీ నాయకుల్లో వ్యక్తం అవుతోంది. అర్బన్, రూరల్ ఏరియాల్లోని లోకల్ ప్రజా ప్రతినిధులకు ఎన్నికల ఖర్చు పేరిట ఇంత మొత్తం ఇస్తామని మాట ఇచ్చినప్పటికీ ఫస్ట్ ఫేజ్ తో సరిపెట్టారని, ఆ తరువాత ఫండ్ రాకపోవడంతో తమ చేతి చమురు విదుల్చుకోవల్సి వచ్చిందని వాపోతున్నారు. అంతేకాకుండా క్యాడర్ లో వర్గాలను తయారు చేసి ఎవరికి వారిగా ఉంచుతూ తమ అవసరాలు తీర్చుకుంటున్న తమ నేత వల్ల ఎదిగే అవకాశాలయితే లేవన్న ఆందోళన కూడా వారిని వెంటాడుతోంది. దీంతో తాము ఎలా వ్యవహరిస్తే బావుంటుంది అన్నదే అంతుచిక్కడం లేదన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. ఒక వేళ పార్టీ మారాలనుకున్నా… ఆ పార్టీ నేత తమ పార్టీ నేతకు సన్నిహితుడని చెప్పుకుంటుండడంతో తాము ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లలో తెలియక తికమక పడుతున్నామని అంటున్నారు లోకల్ లీడర్స్.

You cannot copy content of this page