ఇంటి నంబర్ ఉంటే లీగల్ అయినట్టేనా..? కొమ్ముభూమయ్యను అరెస్ట్ చేసిన పోలీసులు

దిశ దశ, కరీంనగర్:

పాత తేదిల్లో కొత్త ఇంటి నంబర్ల దందాకు తెరలేపారా..? విలీన గ్రామాల్లో సరికొత్త నేరాలకు పాల్పడే సంస్కృతిని ప్రారంభించారా.? పెద్దల అండదండలు ఉంటే అమాయకులను నిట్టనిలువునా ముంచేయొచ్చన్న ధీమాతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారా..? అంటే అవుననే అనిపిస్తోంది తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటనను గమనిస్తే. కరీంనగర్ రూరల్ పోలీసులు నిందితులపై కఠినంగా వ్యవహరించడంతో మరో కొత్త కోణ: వెలుగులోకి వచ్చింది.

‘కొమ్ము’ రంకెలు…

ఆరెపల్లి శివార్లలో చొప్పదండి మండలం రాగంపేటకు చెందిన దీటి మధు అనే వ్యక్తి 91 గజాల స్థలాన్ని 2013లో కొనుగోలు చేసుకున్నారు. సర్వే నెంబర్ 311లోని ప్లాట్ నంబర్ 5లో కొన్న ఈ స్థలాన్ని కరీంనగర్ కు చెందిన నల్లవెల్లి రాజు అనే వ్యక్తి విక్రయించాడు. దీటి మధు ఈ స్థలాన్ని తన భార్య ఎండల సరిత పేరిట మార్చుకుని ఇంటి నిర్మాణం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు మునిసిపల్ నుండి 4-63/A/A/2/A/1 ఇంటి నంబర్ ను కూడా పొందాడు. ఈ క్రమంలో గుంజ లక్ష్మణ్ అనే వ్యక్తి మధు కట్టుకుంటున్న ఇంట్లోకి చొరబడి దీటి మధు వేసుకున్న ఇంటి నంబర్ ను తీసేశాడు. అనంతరం 1-42/6/E/4/A/1 అనే ఇంటి నంబర్ ప్లేట్ ను తగలించాడు. ఈ ఇంటి స్థలం తనదని మధే అక్రమం చేశాడన్న రీతిలో వ్యవహరించి తనకు మున్సిపాలిటీ వారు ఇంటి నంబర్ కూడా ఇచ్చారని వెంటనే ఇంటిని ఖాలీ చేయకపోతే చంపేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చాడు గుంజ లక్ష్మణ్. తనకు మాజీ ఎంపీటీసీ కొమ్ము భూమయ్య విక్రయించాడని వెంటనే మధు కుటుంబ సభ్యులంతా ఆ ఇంటిని వదిలి వెళ్లాలని లేనట్టయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించాడు. దీంతో బాధితుడు కరీంనగర్ రూరల్ పోలీసులను ఆశ్రయించగా ఇన్స్ పెక్టర్ ప్రదీప్ క్రైం నంబర్ 69/2024లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దీటి మధు కొనుగోలు చేసుకుని నిర్మించుకుంటున్న ఇంటిని కబ్జా చేయాలన్న దురుద్దేశమైన కుట్రతో మాజీ ఎంపీటీసీ కొమ్ము భూమయ్య, గుంజ లక్ష్మణ్ దురక్రామణకు పాల్పడ్డారని పోలీసుల విచారణలో తేలింది.

ఫోర్జరీ సంతకాలు…

కబ్జాలకు పాల్పడేందుకు లీగల్ గా తమకే హక్కు ఉందని బెదిరింపులకు గురి చేసేందుకు కొమ్ము భూమయ్య ఏకంగా ఫోర్జరీ సంతకాలు కూడా చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. సర్పంచ్, పంచాయితీ కార్యదర్శుల సంతకాలు ఫోర్జరీ చేసి ఇంటి పర్మిషన్ తీసుకున్నట్టుగా క్రియేట్ చేసి దీటి మదు కష్టపడి కట్టుకున్న ఇంటిని దురక్రమణ చేసేందుకు ప్రయత్నించారు. గుంజ లక్ష్మణ్ కూడా కొమ్ము భూమయ్య చేస్తున్న కుట్రలతకు వెన్నుదన్నుగా నిలుస్తూ దౌర్జన్యాలకు పాల్పడినట్టుగా పోలీసుల విచారణలే తేలింది. దీంతో నిందితులపై క్రైం నంబర్ 69/2024లో సెక్షన్ 420, 465,467,471,447,427,506,120-b r/w 34 ఐపీసీలో కేసు నమోదు చేశారు. వీరిని గురువారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చగా 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది కరీంనగర్ కోర్టు.

నాలుగేళ్లవుతున్నా…

పంచాయితీలు బల్దియాలో విలీనం అయి నాలుగేండ్లు అవుతన్నా… ఇంటి అనుమతులు పంచాయితీల పేరిట క్రియేట్ అవుతుండడం వెనక కారణాలు ఏంటన్నదే మిస్టరీగా మారింది. ఒక వేళ పంచాయితీగా ఉన్నప్పడు ఇంటి నిర్మాణానికి సంబంధించిన పర్మిషన్ తీసుకున్నా రెండేళ్లలోగానే ఇంటిని నిర్మించుకోవల్సి ఉంటుంది. లేనట్టయితే పంచాయితీ అనుమతి తీసుకోవల్సి ఉంటుంది. ఒక వేళ మునిసిపల్ లో విలీనం అయితే సదరు పంచాయితీ నుండి తీసుకున్న అనుమతి పత్రాలను బల్దియాలో ఇచ్చి రెండేళ్ల వరకూ పొడగించుకునే అవకాశం ఉంది. కానీ ఆరెపల్లిలో దీటి మధు నిర్మించుకుంటున్న ఇంటిని ఆక్రమించుకునేందుకు కొమ్ము భూమయ్య, గుంజ లక్ష్మణ్ లు నకిలీ డాక్యూమెంట్లు క్రియేట్ చేసి ఇప్పుడు కబ్జా చేయడం కూడా తప్పిదమే అవుతుంది. నిభందనల ప్రకారం కూడా ఆ పర్మిషన్ చెల్లే అవకాశం కూడా లేదని తెలుస్తోంది. అయినా వీరు ధైర్యంగా ఫేక్ డాక్యూమెంట్లు క్రియేట్ చేసి, ఫోర్జరీ సంతకాలు పెట్టి ఇంటి నంబర్లు కూడా క్రియేట్ చేసుకున్న తీరే విస్మయానికి గురి చేస్తోంది. పంచాయితీ పర్మిషన్లు ఇచ్చిందన్న బూచి చూపించి కబ్జాలకు పాల్పడవచ్చన్న ఆలోచనతో వీరు వ్యవహరించారంటే వెన్నుదన్నుగా ఎవరో బడా బాబులు ఉంటే తప్ప సాహసించే అవకాశం లేదన్న అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి. కొమ్ము భూమయ్యకు కొమ్ము కాయడం వల్లే ఏకంగా సర్కారు యంత్రాంగం సంతకాలనే ఫోర్జరీ చేసి ఉంటాడన్న చర్చ కరీంనగర్ లో సాగుతోంది. ఏది ఏమైనా కరీంనగర్ కమిషనరేట్ అభిషేక్ మహంతి అక్రమార్కుల భరతం పట్టేందుకు వ్యవహరిస్తున్న తీరు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇంతకాలం సివిల్ మ్యాటర్ అన్న సమాధానం ఇచ్చిన పోలీసులే నేడు క్రిమినల్ చర్యలకు పాల్పడ్డారంటూ నిందితులను వేటాడుతున్న తీరు మాత్రం కరీంనగర్ వాసులను సంతోషంలో ముంచెత్తుతోంది.

You cannot copy content of this page