బీజేపీ వైపు చూస్తున్న బీఆర్ఎస్ నాయకుడు

ఎన్నికల వేళ మరో కుదుపు…

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ లో అధికార పార్టీకి మరో ఝలక్ తగలక తప్పేలా లేదు. ఉమ్మడి జిల్లాలో సీనియర్ నేతగా ఎదిగిన వాసాల రమేష్ గులాభి పార్టీకి బైబై చెప్పాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే తన సన్నిహితులతో కూడా పార్టీ మారే అంశం గురించి చర్చించిన ఆయన ఒకటి రెండు రోజుల్లో పార్టీ ఫిరాయించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. బీజేపీ పార్టీలో చేరేందుకు వాసాల అండ్ టీమ్ సమీకరణాలు నెరుపుతున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.

సీనియర్ నేతగా…

టీడీపీలో సీనియర్ నేతగా ఎదిగిన వాసాల రమేష్ సర్పంచ్గ గా, ఎంపీపీగా, ఎసీడీపీ సభ్యులుగా పలు బాధ్యతలు చేపట్టారు. అలాగే కొత్తపల్లి చేనేత సహకార సంఘం అధ్యక్షునిగా కూడా పనిచేశారు. అంతే కాకుండా టీడీపీలో వివిధ హోదాల్లో సేవలందించిన ఆయన గులాభి జెండా కప్పుకున్నారు. అయితే ఇటీవల కాలంలో పార్టీలో ప్రాధాన్యత లేకపోవడంతో వేదనకు గురవుతున్నారు. ఒకప్పుడు కీలక పదవుల్లో వెలుగు వెలిగి క్రియాశీలక రాజకీయాలు నెరిపిన నాయకుల్లో ఒకరిగా ఎదిగిన తనకు బీఆర్ఎస్ పార్టీ మాత్రం తగిన గుర్తింప ఇవ్వడం లేదన్న అభిప్రాయంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికల సమయంలో అటు పార్టీ వ్యవహరాలు… ఇటు ఓటర్టను అనుకూలంగా మల్చేందుకు అవసరమైన వ్యూహాలు రచించడంతో పాటు పోలింగ్ వ్యవహరాలను చక్కబెట్టడంలో కూడా కీలక పాత్ర పోషించారన్న పేరుంది. దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో ఉన్న తన పట్ల వివక్ష తీవ్రంగా పెరిగిపోయిందన్న మనోవేదనకు గురవుతున్న వాసాల రమేష్ ను కనీసం ఎన్నికల సమయంలో కూడా స్థానిక నాయకత్వం గుర్తించడం లేదన్న చర్చ ఆయన అనుచరుల్లో కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకోవడమే మంచిదన్న అభిప్రాయంతో ఉన్న వాసాల పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. మరో ఐదు రోజుల్లో పోలింగ్ కొనసాగనున్న నేపథ్యంలో సీనియర్ నాయకుడు అయిన వాసాల రమేష్ లాంటి వ్యక్తులు ఇతర పార్టీల వైపు అడుగులు వేస్తుండడంతో బీఆర్ఎస్ పార్టీపై ప్రభావం పడే అవకాశాలు ఉంటాయన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

You cannot copy content of this page