కరీంనగర్ సెషన్స్ కోర్టు తీర్పు
దిశ దశ, హుజురాబాద్:
భార్య, కూతురును హత్య చేసిన నిందితునికి జీవిత ఖైదిగా శిక్ష విధించడంతో పాటు రూ. 2500 జరిమానా విధిస్తూ కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి ప్రతిమ బుధవారం తీర్పు ఇచ్చారు. కేసు పూర్వాపరాల్లోకి వెల్తే… కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హుజురాబాద్ పట్టణం ప్రతాపవాడలో కొక్కిస వెంకటేష్ అలియాస్ వెంకన్న అలియాస్ వెంకటనర్సు (55) 2021 జనవరి 21న అతని భార్య రమ, కూతురు అమని (24) తలలపై ఇనుప పైపుతో కొట్టి చంపాడు. వెంకటేష్ మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలం రాజంపేటకు చెందిన వాడు కాగా కొంతకాలంగా హుజురాబాద్ పట్టణంలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 20 ఏళ్ల క్రితం మొదటి వివాహం చేసుకున్న నిందితుడు ఆమెతో విడిపోయిన తరువాత రమను వివాహం చేసుకున్నాడు. హత్య జరిగిన సమాచారం అందుకున్న వీఆర్వో గూడెపు రవిందర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో క్రైం నంబర్ 32/2021 u/s 498-A, 302 IPCలో కేసు నమోదు చేశారు. హుజురాబాద్ ఏసీపీ సుందరగిరి శ్రీనివాస రావు, స్టేషన్ హౌజ్ ఆఫీసర్ జి తిరుమల్ లు కేసు దర్యాప్తు చేసి పోలీసుల ముందు లొంగిపోయిన నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసుపై సమగ్రంగా దర్యాప్తు చేసిన పోలీసులు 2021 నవంబర్ 27న కేసు కోర్టులో ఛార్జి షీటు దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ తరుపున అడిషనల్ పీపీలు వి వెంకటేశ్వర్లు, జూలూరి శ్రీరాములు కోర్టులో వాదనలు వినిపించారు. వాద ప్రతివాదనలు విన్న కరీంనగర్ ప్రిన్సిపల్ జిల్లా జడ్జి వెంకటేష్ కు జీవిత ఖైదుగా శిక్ష విధించడంతో పాటు రూ. 2500 జరిమానా విధించారు.