అరుదైన కళకు అద్భుతమైన గౌరవం
దిశ దశ, కరీంనగర్:
సిల్వర్ పిలిగ్రీ… దేశంలోనే అత్యంత అరుదైన కళల్లో ఒకటి. ఈ కళను అందిపుచ్చుకున్న కరీంనగర్ బిడ్డలు తమలోని నైపుణ్యాన్ని ప్రంపంచం ముందు ప్రదర్శించే అవకాశాన్ని అందుకున్నారు. ఫిలిగ్రీ ద్వారా తమలోని కళను ప్రదర్శిస్తున్న కరీంనగర్ వాసుల చరిత ప్రంపంచానికి సుపరిచితమే. ఇప్పుడు కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ జి20 సమావేశాల్లోనూ తళుకుమనిపించనుంది. కరీంనగర్ కళాకారులు తమ నైపుణ్యానికి పదునుపెట్టి తయారుచేసిన బ్యాడ్జెస్ జి20 దేశాల ప్రతినిధులు అలంకరించుకోనున్నారు. కరీంనగర్ కళాకారులు తయారు చేసిన బ్యాడ్జిలు జి20 దేశాల ప్రతినిధుల కోటుకు అలంకారం కానున్నాయి. కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులు వెండితో తయారు చేసిన అశోక చక్రం బ్యాడ్జిలు 200 తయారు చేసి పంపించారు. తెలంగాణ హస్తకళల విభాగం ద్వారా తొలిసారి కరీంనగర్ ఫిలిగ్రీకి అరుదైన గౌరవం దక్కినట్టయింది. ఈ నెల 9, 10 తేదిలలో జరగనున్న జి20 సమ్మిట్ కు హజరయ్యే 20 దేశాల ప్రతినిధులకు కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ బ్యాడ్జెస్ తొడగనున్నారు.
అరుదైన కళ… అద్భుతమైన అవకాశం
అత్యంత అరుదైన కళల్లో ఒకటైన సిల్వర్ ఫిలిగ్రీ కళ దేశంలో చాలా తక్కువమంది అందిపుచ్చుకున్నారు. తెలంగాణాలోని కరీంనగర్ కు చెందిన వారితో పాటు ఒడిశాలోని కటక్ ప్రాంతానికి చెందిన వారు కూడా ఈ కళపై పట్టు సాధించారు. అయితే కరీంనగర్ కళాకారులు వారసత్వంగా వచ్చిన సిల్వర్ ఫిలిగ్రీ కళను నేటికీ పోషిస్తూ తమలోని కళానైపుణ్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. జీఐ కూడా పొందిన కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కాళాకారులు గతంలో హైదరాబాద్ కు ఇవాంకా ట్రంప్ వచ్చినప్పుడు స్టాల్ ఏర్పాటు చేసుకునే అవకాశం దక్కింది. కానీ ఈ సారి ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న జి20 సమ్మిట్ ప్రతినిధులకు అలంకారంగా మారబోతోంది. కరీంనగర్ కళాకారులు చేతిలో రూపు దిద్దుకున్న కళాత్మకతతో కూడిన బ్యాడ్జెస్ సమ్మిట్ కు హాజరయ్యే డెలిగేట్స్ అలంకరించుకోనున్నారు. అంతేకాకుండా న్యూ ఢిల్లీలో జరగనున్న సమ్మిట్ సందర్భంగా దేశంలోనే అరుదైన కళతో తయారు చేసిన కళాత్మకతతో కూడిన కళాఖండాలను ప్రదర్శించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్టాళ్లను ఏర్పాటు చేసింది. ఇందులో కూడా కరీంనగర్ కు చెందిన సిల్వర్ ఫిలిగ్రీ కళాకారుడు అశోక్ స్టాల్ ఏర్పాటు చేసుకునే అవకాశం దక్కింది. ఈ స్టాల్ లో కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాకారుల చేతిలో తయారు చేసిన అద్భుత కళాఖండాలు ప్రదర్శించనున్నారు. దీనివల్ల జి20 దేశాల్లో భారత్ లో ఉన్న అత్యంత అరుదైన కళకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కళల కాణాచిగా పేరుపడిన కరీంనగర్ వాసులు మరోసారి అంతర్జాతీయ సమాజం ముందు తమలోని కళాత్మకతను ప్రదర్శించే అవకాశం రావడం అద్భుతమని అంటున్నారు కరీంనగర్ వాసులు.