సొగసు చూడతరమా..? వన్నె తెస్తుందన్న వారధి పరిస్థితి ఇలా…

దిశ దశ, కరీంనగర్:

వీకెండ్స్ మస్తీ పేరిట హంగామా చేశారక్కడ… కరీంనగరానికే తల మానికంగా నిలుస్తోందన్న ప్రచారం చేశారు… పర్యాటక శోభకు కేరాఫ్ అడ్రస్ అన్న రీతిలో వ్యవహరించారు… వందల కోట్లు వెచ్చించి నిర్మించిన ఆ వారధి అటు పర్యాటకులు, ఇటు వాహనాదారుల సహనానికి పరీక్ష పెడుతోంది. చేసిన ఆర్భాటాల కంటే చేతల్లో చూపించిన తీరే శాశ్వతంగా ముద్ర వేసుకుంటుంది. కానీ ముణ్నాళ్ల ముచ్చటగా మారిన ఆ టూరిజం ప్లేస్ ఇప్పుడు బోసిపోయి కనిపిస్తోంది.

తీగల వంతెన తీరిలా…

కరీంనగర్ సమీపంలోని మానేరు వంతెనపై నిర్మించిన తీగల వంతెన దేశంలోనే అరుదైన నిర్మాణాల్లో ఒకటి. అతి తక్కువ ప్రాంతాల్లో మాత్రమే నిర్మించిన కేబుల్ బ్రిడ్జి ప్రారంభం చేసిన కొత్తలో చేసిన హంగామా రాష్ట్ర వ్యాప్తంగా హెలెట్ గా నిలిచింది. వీకెండ్ మస్తీ పేరిట టూరిస్టులను ఆకట్టుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. వాహనాల రాకపోకలను నియంత్రించి మరీ ఈ వంతెనపై కల్చరల్ యాక్టివిటీస్ చేపట్టారు. దీంతో కరీంనగర్ సరికొత్త శోభను సంతరించుకుందన్న సంబరంలో తేలియాడారు ఇక్కడి ప్రజలు. కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే ఉన్నదన్న రీతిలో ఫ్లడ్ లైట్ల కాంతులతో రంగుల ప్రపంచామే చూపించారక్కడ. అయితే అనతి కాలంలోనే ఈ వంతెనకు కొన్ని ప్రాంతాల్లో పగుళ్లు తేలడంతో ఆరోపణలు పర్వం కొనసాగింది. వంతెన కోసం నిర్మించి అప్రోచ్ రోడ్డు కుంగుబాటుకు గురైంది తప్ప వంతెనకు ఏమీ కాలేదంటూ ఎదురు దాడికి దిగారు. సోషల్ మీడియా వేదికగా అధికారుల సంతకాలు లేకుండానే వారి పేరిట ప్రకటనలను కూడా వైరల్ చేశారు. ఈ క్రమంలో అంతా బాగానే ఉంది కానీ ప్రతిపక్ష పార్టీల నాయకులు కావాలనే ప్రచారం చేస్తున్నారన్న వాదనలు కూడా వినిపించారు. పలు మార్లు ఈ వంతెన సమీపంలో నిర్మాణాల డొల్లతనం వెలుగులోకి రావడంతో అటువైపు కన్నెత్తి చూసేవారే లేకుండా పోయారు. అప్రోచ్ రోడ్డు కుంగుబాటుకు గురైందని వాదనలు తెరపైకి తెచ్చిన తరువాత అందుకు దిద్దుబాటు చర్యలు తీసుకున్నారా లేదా అన్న విషయాన్ని కూడా పట్టించుకున్న వారు లేకుండా పోయారు. వాస్తవంగా వంతెనల నిర్మాణంలో భాగంగా చేపట్టే అప్రోచ్ రోడ్డు వేసినప్పుడు పటిష్టమైన చర్యలు తీసుకోవల్సి ఉంటుంది. బ్రిడ్జికి ఇరువైపులా వేసే ఈ అప్రోచ్ రోడ్డు వల్లే కనెక్టివిటీ యథావిధిగా ఉంటుంది. ఇందు కోసం ఉపయోగించే గ్రావెల్ కానీ మట్టి కాని వేసినప్పుడు భవిష్యత్తులో కుంగుబాటుకు గురి కాకుండా రోలింగ్ చేయడంతో పాటు ఏళ్ల పాటు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. వరద నీటి ప్రవాహం కారణంగా బ్రిడ్జికి ఇరువైపులా వేసిన అప్రోచ్ రోడ్డు కొట్టుకపోయినట్టయితే వంతెన నిర్మాణంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. అంతేకాకుండా వరద ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో అప్రోచ్ రోడ్డు కొట్టుకపోయినట్టయితే వాహనాదారులు అందులో చిక్కుకపోయి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి వంతెన సామర్థ్యానికి తగ్గట్టుగా, మట్టితో నింపే అప్రోచ్ రోడ్డు నిర్మాణం విషయంలోనూ ఇంజనీరింగ్ అధికారులు నిబంధనల విషయంలో కాంప్రమైజ్ కాకుండా వ్యవహరిస్తారన్న వాదనలు కూడా లేకపోలేదు.

ఇప్పుడిలా…

అయితే తీగల వంతెన విషయంలో వాదనలు ఎలా ఉన్నప్పటికీ వాస్తవిక పరిస్థితులు మాత్రం నిర్మాణ సమయంలో చేసిన తప్పిదాలు కళ్లకు కట్టినట్టుగా సాక్షాత్కరిస్తున్నాయి. కొంతకాలానికే ఈ వంతెన వద్ద ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైట్ల కాంతులు కనుమరుగయ్యాయి. రాత్రి వేళల్లో తిమిరంతో సమరం చేస్తూ ఈ ప్రాంతం మీదుగా రాకపోకలు నిర్వహించాల్సిన పరిస్థితి తయారైంది. సంబంధిత విభాగానికి చెందిన యంత్రాంగం మెయింటనెన్స్ చేయడంలో విఫలం అయిందో లేక ఇక్కడ ఏర్పాటు చేసిన లైటింగ్ వ్యవస్థ ఫెయిల్ అయిందో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం తీగల వంతెన వద్ద మాత్రం చిమ్మ చీకట్లు అలుముకున్న తీరు వాహనాదారులను విస్మయపరుస్తోంది. ఇకపోతే వంతెన కోసం వేసిన కాంక్రీట్ స్లాబ్ గుంతలమయం కావడం గమనార్హం. ఈ వంతెనపై కొంత కాలం వన్ వే మరి కొంత కాలం టూ వే విధానాన్ని అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారీ వాహనాల రాకపోకలకు అనువుగా ఉండే విధంగా నిర్మించిన తీగల వంతెన స్లాబ్ ఏరియా అంతా కూడా గతుకుల రోడ్డును మరిపిస్తుండడం ఆశ్యర్యపరుస్తోంది. ఈ ప్రాంతంలో పలు మార్లు బీటీ రోడ్డు వేసిన కూడా కొద్ది రోజులకే వాహనదారుల సహనానికి సవాల్ విసురుతోంది. తరుచూ హాట్ మిక్సింగ్ ప్లాంట్లో సిద్దం చేసిన తారు రోడ్డు వేస్తున్నా కూడా ఫలితం లేకుండా పోతోంది. ఒకప్పుడు కరీంనగరానికే వన్నె తెస్తుందనుకున్న ఈ వారది నిర్మాణం విషయంలో ఏ జరిగిందో ఏమో కానీ కళా విహీనంగా తయారు కావడం మాత్రం విస్మయ పరుస్తోంది.

You cannot copy content of this page