ఇద్దరు చిన్నారులతో సహా తండ్రిని కాపాడిన పోలీసులు
దిశ దశ, కరీంనగర్:
కుటుంబంలో నెలకొన్న వివాదాల కారణంగా ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్యకు పాల్పడేందుకు వెల్లిన వ్యక్తిని పోలీసులు కాపాడారు. పసి హృదయాలను కూడా తనతో పాటు తీసుకెళ్లి చనిపోవాలని భావించిన అతన్ని క్షేమంగా తీసుకొచ్చారు. కరీంనగర్ 2 టౌన్ సీఐ సృజన్ రెడ్డి కథనం ప్రకారం… కరీంనగర్ విద్యానగర్ లో నివాసం ఉంటున్న దశరథ్ మంగళవారం ఉదయం తన ఇద్దరు బిడ్డలను వెంటబెట్టుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ఇంటినుండి వెళ్లిపోయాడు. ఈ విషయం తెలిసిన అత్తింటి వారు కరీంనగర్ టూ టౌన్ పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దశరథ్ కాంటాక్ట్ నంబర్ ద్వారా అతని మొబైల్ ట్రాక్ చేసిన పోలీసులు ఆచూకి కోసం గాలించారు. బ్లూకోట్ 6 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్ కృష్ణ రంగంలోకి దిగి దశరథ్ ను కరీంనగర్ కోతిరాంపూర్ లోని ఓ పెట్రోల్ బంక్ వద్ద గుర్తించారు. అతన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన తరువాత సీఐ సృజన్ రెడ్డి బాధితుడికి కౌన్సెలింగ్ నిర్వహించారు. అతని కుటుంబ సభ్యులను కూడా స్టేషన్ లో ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబంలో కలహాలకు తావివ్వకుండా జాగ్రత్త పడాలని సూచించారు. అభిప్రాయ బేధాలు వచ్చినప్పుడు బలవన్మరణమే దిక్కని భావించకూడదని వాటిని అధిగమించేందుకు చొరవ తీసుకోవాలని సీఐ హితవు పలికారు. అభం, శుభం తెలియని చిన్నారులను సైతం తనతో పాటు తీసుకెళ్లి సూసైడ్ చేసుకోవాలనుకోవడం సరైన నిర్ణయం కాదన్నారు.
పోలీసుల చొరవ…
మంగళవారం ఉదయం పోలీసులు చొరవ తీసుకోనట్టయితే అమాయకులైన చిన్నారులు ఇద్దరు కూడా విగతజీవులుగా మారిపోయే వారు. కుటుంబలో ఎదురైన సమస్యను పరిష్కరించుకునేందుకు చొరవ తీసుకోకుండా ఆత్మహత్యే శరణ్యంగా భావించిన దశరథ్ క్షణికావేశం వల్ల చిన్నారులిద్దరి ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోయేవి. బాధిత కుటుంబం నుండి సమాచారం అందుకోగానే వారిని కాపాడేందుకు చొరవ తీసుకోవడంతో అమాయకులైన ఇద్దరు చిన్నారులతో పాటు తండ్రిని కూడా సేఫ్ చేశారు కరీంనగర్ టూ టౌన్ పోలీసులు.