ఢిల్లీ వెళ్లేముందు కేసీఆర్‌తో మాట్లాడిన కవిత

ఢిల్లీ వెళ్లే ముందు తండ్రి కేసీఆర్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత్ ఫోన్‌లో మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ నోటీసులు పంపిన నేపథ్యంలో కూతురికి కేసీఆర్‌ ధైర్యం చెప్పారు. ఆందోళనపడాల్సిన అవసరం లేదని, బీజేపీ అకృత్యాలపై న్యాయపరంగా పోరాడదామని కేసీఆర్ పేర్కొన్నారు. పార్టీ అన్ని విధాలుగా ఉంటుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. నీ కార్యక్రమం నువ్వు కొనసాగించు అని కవితకు సూచించారు.

కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు పంపించడం హాట్ టాపిక్‌గా మారింది. మార్చి 9న విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులో పేర్కొంది. దీనిపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ నెల 10న ఢిల్లీలో జంతర్ ‌మంతర్‌ వద్ద ధర్నా, ఇతర కార్యక్రమాలతో బిజీ షెడ్యూల్‌ ఉన్నందున విచారణకు హాజరు కాలేనని, ఈనెల 15న హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని ఈడీని కవిత కోరారు. కానీ, ఈడీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆమె ఢిల్లీ బయలుదేరారు.

నిజానికి ఎమ్మెల్సీ కవిత గురువారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. కానీ ఒకరోజు ముందే ఢిల్లీకి వెళ్తుండడంతో ఈడీ విచారణ కోసమే వెళ్తున్నారా? అనే చర్చ మొదలైంది. అయితే కవితకు ఈడీ నోటీసులు పంపడాన్ని బీఆర్‌ఎస్‌ నేతలు తీవ్రంగా ఖండించారు. మహిళా దినోత్సవం రోజే సీఎం కేసీఆర్ కుమార్తెకు నోటీసులు పంపడం కేంద్రం దుర్మార్గపు చర్య అని మంత్రులు మండిపడ్డారు. బీజేపీకి రోజులు దగ్గరపడ్డాయని, ప్రజలు తగిన బుద్ది చెబుతారని ధ్వజమెత్తారు.

మరోవైపు బీఆర్ఎస్ నేతల విమర్శలను బీజేపీ నేతలు తిప్పికొట్టారు. దర్యాప్తు సంస్థలతో తమ పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. కవిత వల్ల తెలంగాణ సమాజం తలదించుకునే పరిస్థితి వచ్చిందని కౌంటర్ ఇచ్చారు. లిక్కర్ స్కామ్ నిందితులు తనకు తెలుసు అని కవిత గతంలోనే చెప్పారని పేర్కొన్నారు. ఈడీ విచారణకు కవిత హాజరు కావాల్సిందేనని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. ఇంత వరకు కేసీఆర్‌, కేటీఆర్‌ ఎందుకు స్పందించలేదు అని బండి సంజయ్ ప్రశ్నించారు.

You cannot copy content of this page