దిశ దశ, న్యూ ఢిల్లీ:
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు ఇచ్చిన సమన్లపై శుక్రవారం విచారణ జరగనుంది. ఈ కేసులో తనకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని సుప్రీం కోర్టును గతంలోనే ఎమ్మెల్సీ కవిత ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తనపై బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. ఈ కేసు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనం విచారించనుంది. మరో వైపున ఈడీ కవితను విచారణకు రావాలని మరోసారి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. నోటీసులు అందుకున్న తరువత కవిత మీడియాతో మాట్లాడుతూ… అవి ఈడీ నోటీసులు కావు… మోడీ నోటీసులు అంటు ఘాటుగా స్పందించారు. నోటీసులను పార్టీ లీగల్ టీమ్ కు పంపించామని న్యాయ నిపుణుల వాటిని పరిశీలించిన తరువాత వారి సూచనల మేరకు నడుచుకునే ఆలోచనలో ఉన్నట్టు ప్రకటించారు.
అప్రూవర్ గా మారలేదు: పిళ్లై న్యాయవాదులు
మరో వైపున లిక్కర్ స్కాంలో నిందితునిగా ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లై అప్రూవర్ గా మారలేదని ఆయన తరుపు న్యాయవాదులు చెప్తున్నారు. నిరాధారమైన తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 164 ప్రకారం రామచంద్ర పిళ్లై ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదంటూ కొట్టిపడేశారు. తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.