దిశ దశ, భూపాలపల్లి:
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ లేనిపోని ప్రచారాలు చేస్తూ… కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజీ పటిష్టంగా ఉండడంతో పాటు కన్నెపల్లి పంప్ హౌజ్ నుండి నీటిని ఎగువ ప్రాంతానికి ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మేడిగడ్డ నుండి 9 లక్షల క్యూసెక్కుల నీరు దిగువ ప్రాంతానికి వెల్లిపోతోందని, ఈ నీటిని ఎత్తిపోసినట్టయితే ఎగువ ప్రాంతాల్లోని రిజర్వాయర్లు, ఇతర జలవనరులను నింపే అవకాశం ఉంటుందన్నారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బ్యారేజ్, కన్నెపల్లిల పంప్ హౌజులను బీఆర్ఎస్ఎల్పీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… ఎగువ ప్రాంతాల్లోని మధ్య, దిగువ మానేరు ప్రాజెక్టులతో పాటు, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన సాగర్, అన్నపూర్ణ ప్రాజెక్టులతో పాటు ఎస్సాఆర్ఎస్పీ, వరద కాలువలను సమృద్దిగా నింపే అవకాశం ఉందన్నారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా భూములు సస్యశామలం అవుతాయని, రోజుకు రెండు టీఎంసీల చొప్పను నీటిని ఎగువకు తరలించినట్టయితే నీటి కొరత ఉండదన్నారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో గ్రౌటింగ్ జరిగిందని ఇంజనీర్లు కూడా తెలిపారని, కన్నెపల్లి పంప్ హౌజులోని 17 మోటర్లు కూడా సిద్దంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే నీటిని ఎత్తిపోసే ప్రక్రియకు శ్రీకారం చుట్టకపోయినట్టయితే అసెంబ్లీ చివరి రోజున తాము కార్యరంగంలోకి దిగుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. 50 వేల మంది రైతులతో కలిసి తామే కన్నెపల్లి పంప్ హౌజ్ మోటార్లను ప్రారంభించి ఎగువ ప్రాంతానికి నీటిని ఎత్తిపోస్తామని వెల్లడించారు. కేసీఆర్ పై కోపంతో కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ విషయంలో దుష్ప్రచారం చేస్తోందని, కొట్టుకపోయిందని చెప్పిన మేడిగడ్డ బ్యారేజీ మేటిగడ్డై నిల్చుందని వ్యాఖ్యానించారు. లక్షలాది క్యూసెక్కుల నీరు వృథాగా పోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం శాడిజం ప్రదర్శిస్తోందని, ఒక్క స్విచ్ ఆన్ చేస్తే రిజర్వాయర్లు అన్ని నింపుకోవచ్చన్నారు. కాంగ్రెస్ పార్టీ వారికి రిజర్వాయర్లకు, బ్యారేజీలకు తేడా తెలియదని ఎద్దేవ చేసిన కేటీఆర్, ఈ అంశంపై అసెంబ్లీలో కూడా చర్చిస్తామని ప్రకటించారు.