కేసీఆర్ జీ ఛలో పెద్దపల్లి…

దిశ దశ, పెద్దపల్లి:

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను పెద్దపల్లికి ఆహ్వానిస్తూ ఫ్లెక్సీలు వెలియడం కలకలం సృష్టిస్తోంది. పెద్దపల్లి నుండి సీఎం పోటీ చేయాలంటూ ప్రత్యక్ష్యమైన ఫ్లెక్సీలపై చర్చలు సాగుతున్నాయి. ప్రజా సంఘాల జేఏసీ నాయకుడు బొంకురి సురేందర్, అతని భార్య పెద్దపల్లి మున్సిపల్ 8వ వార్డు MIM కౌన్సిలర్ బొంకురి భాగ్యలక్ష్మిలు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రమైన పెద్దపల్లిలో కామారెడ్డి వద్దు పెద్దపల్లి ముద్దు అంటూ ముద్రించిన ప్లెక్సీలు ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచీ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పెద్దపల్లికి రావాలంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. రెండు రోజులుగా సీఎం పెద్దపల్లి నుండి పోటీ చేసే అవకాశాలు ఉన్నయంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడి నుండే పోటీ చేయాలని అభ్యర్థిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం గమనార్హం. ఉన్నట్టుండి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిని పెద్దపల్లి వైపు మరల్చడానికి కారణాలు ఏంటన్నదే అంతుచిక్కకుండా పోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వరస విజయాలతో ముందుకు సాగుతున్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరును తెరపైకి ఎందుకు తీసుకవస్తున్నారన్నదే మిస్టరీగా మారిపోయింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న దాసరి మనోహర్ రెడ్డిని కాదని ఏకంగా అధినేతను ఆహ్వానించడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటోనని బీఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. స్థానికంగా దాసరి అంటే గిట్టని వారు తమ పేరును తెరపైకి తీసుకవస్తే ఇక్కట్లు ఎదుర్కొంటామని, తమ ఫ్లెక్సీలు అయితే తొలగించే సాహసం చేస్తారు కానీ సీఎం పేరిట ఫ్లెక్సీలు కడితే ఎలా తీసేస్తారోనని ఆలోచించే కేసీఆర్ పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఉంటారోనన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇందుకోసం ఆగస్ట్ 12న భీమ్ గర్జన ర్యాలీ కూడా నిర్వహిస్తున్నామని కూడా అందులో పేర్కొనడం గమనార్హం. ఏది ఏమైనా పెద్దపల్లిలో సీఎం కేసీఆర్ ను పోటీ చేయాలని కోరుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మాత్రం హాట్ టాపిక్ గా మారాయి.

You cannot copy content of this page