ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇద్దదూ ఒకరినొకరిని సపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలను కలుపుకుని మోదీ ప్రభుత్వంపై ఇద్దరూ కలిసి పోరాటం చేస్తున్నారు. దేశ రాజకీయాల్లో అడుగుపెట్టాలనుకున్న సమయంలో ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ యేతర పార్టీల అధినేతలను కేసీఆర్ కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్‌తో పలుమార్లు భేటీ అయ్యారు.
అలాగే ఇటీవల ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు కూడా కేజ్రీవాల్‌ను కేసీఆర్ ఆహ్వానించారు. అనంతరం కేజ్రీవాల్ చేతుల మీదుగా కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఆప్ నేతలతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాత్ర గురించి సీబీఐ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ కాగా.. కవితపై కూడా సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. అలాగే పలుమార్లు ఆమెను ప్రశ్నించింది.
కేజ్రీవాల్, కేసీఆర్ ఒక్కటేనని అందరూ అనుకున్న సమయంలో ఓ పరిణామం చర్చకు దారి తీసింది. ఆప్ నేతలను బీఆర్ఎస్‌లో చేర్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్ర ఆప్ వైస్ ప్రెసిడెంట్ హరి భాపు రాథోడ్ తాజాగా ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. మహారాష్ట్రలో ఆప్ కీలక నేత కారెక్కడం ఆసక్తికరంగా మారింది. కేజ్రీవాల్, కేసీఆర్ లు కలిసి బీజేపీపై పోరాడుతుండటం, ఇద్దరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్న తరుణంలో ఆప్ నేతలను కేసీఆర్ బీఆర్ఎస్ లో చేర్చుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
ఒకవైపు కేజ్రీవాల్‌తో మంచిగా ఉంటూనే.. ఆయనకు వెనక నుంచి కేసీఆర్ వెన్నుపోటు పొడుస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మహారాష్ట్రలో బీఆర్ఎస్ విస్తరణకు అడుగులు వేస్తోన్న కేసీఆర్.. ఆప్ లోని కీలక నేతలను తన పార్టీలో చేర్చుకుంటున్నారు. కానీ ఆప్ వర్గాలు మాత్రం దీనిపై నోరు మెదపడం లేదు. దీంతో కేజ్రీవాల్ నే కావాలని తన పార్టీ నేతలను కేసీఆర్ పార్టీలోకి పంపిస్తున్నారా అనే చరచ్ కూడా జరుగుతోంది.