తెలంగాణలో మరో ఎన్నికకు రంగం సిద్దమైంది. రాస్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. గురువారం కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలను ఎన్నికల జరగనుంది. ఒకటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కాగా.. మరొకటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక. హైదరాబాద్-రంగారెడ్డికి సంబంధించి స్థానిక సంస్ధల ఎమ్మెల్సీ ఎన్నిక ఆసక్తికరంగా మారింది.
హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానాన్ని గతంలో ఎంఐఎంకు టీఆర్ఎస్ కేటాయించగా.. ఈ సారి కూడా ఎంఐఎంకే ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. రాజకీయ అవసరాల కోసం ఆ స్థానాన్ని మజ్లిస్‌కే ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి మిత్రపక్షంగా ఎంఐఎం ఉంది. దీంతో ఆ పార్టీకే హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ పాలనతో గత తొమ్మిదేళ్లుగా టీఆర్ఎస్ కు ఎంఐఎం మద్దతు తెలుపుతూ వస్తోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా మజ్లిస్ మద్దతుతోనే టీఆర్ఎస్ గట్టెక్కగలిగింది.
ఈ క్రమంలో ఎమ్మెల్సీ సీటును ఎంఐఎంకే కేసీఆర్ అప్పగించారని అంటున్నారు. ఇటీవల మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కేసీఆర్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించడం వెనుక అసలు కారణం ఇదేనని అంటున్నారు. కొత్త సచివాలయం అద్బుతంగా నిర్మించారని కేసీఆర్ పై అసదుద్దీన్ ఓవైసీ ప్రశంసలు కురిపించారు. అయితే వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేస్తామని ఇటీవల ఎంఐఎం ప్రకటించింది. ఎంఐఎం ఎక్కువ స్ధానాల్లో పోటీ చేస్తే ముస్లిం ఓట్లు చీలిపోయే అవకాశముందని అంటున్నారు.
ముస్లిం ఓట్లు చీలిపోతే బీఆర్ఎస్ కు కూడా నష్టం కలిగే అవకాశముంది. అలాగే ఇటీవల అసెంబ్లీలో కేసీఆర్ ప్రభుత్వంపై అక్బరుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. పాతబస్తీకి మెట్రో ఏమైందని ప్రశ్నించారు. దీంతో అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు కేటీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు.దీంతో కేటీఆర్ వర్సెస్ అక్బరుద్దీన్ మధ్య మాటల యుద్దం చోటుచేసుకుంది. ఇలాంటి నేపథ్యంలో సచివాలయంపై అసదుద్దీన్ ఓవైసీ ప్రశంసించడం చర్చనీయాంశంగా మారింది.