ది హిందూ రాహుల్… కరీంనగర్ అనుబంధం

దిశ దశ, హైదరాబాద్:

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశం పెట్టినప్పుడల్లా పేరు పెట్టి పిలిచే ది హిందూ రాహుల్ పదవి విరమణ చేస్తున్నారు. గురువారం నాటితో ఆయనకు హిందూ పత్రికతో ఉన్న ఉద్యోగానుబంధానికి తెరపడనుంది. సీఎం మీడియా సమావేశంలో రాహుల్ వేసే క్వశ్చన్స్ కు సీఎం సమాధానం చెప్తూ ఏదో ఒక మాట అనడంతో చాలా మందిలో ఆయనంటే క్రేజీ ఏర్పడింది. ది హిందూ పత్రికలో పనిచేసిన ఆయన ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి చదువుకున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఉద్యోగ ధర్మానికే పరిమితం అయ్యేందుకే ఎక్కవగా ప్రాధాన్యత ఇచ్చేవారు. ఓ సారి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తన కాన్వాయిని ఆపి తన వాహనంలో రావాలని పిలిచినా డ్యూటీ అయ్యాక వస్తానని సున్నితంగా తిరస్కరించాడని కూడా ప్రచారంలో ఉంది. అయితే తెలంగాణ ఆవిర్భావం తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ నోట పదే పదే రాహుల్ పేరు ప్రస్తావనకు రావడంతో ఆయన ఎవరూ అని తెలుసుకునేందుకు నెటిజన్లు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. కొంతకాలం గూగుల్ సెర్చ్ లో రాహుల్ గురించి వెతికిన వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉండడంతో ఆయన గూగుల్ ట్రెండింగ్ లో కూడా నిలిచారు. అయితే ఈ రాహుల్ ఉత్తర తెలంగాణాతోనూ అనుబంధం పెనవేసుకున్నారన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. మొదట కరీంనగర్ లో ఆ తరువాత వరంగల్ లో ది హిందూ స్టాఫ్ రిపోర్టర్ గా పని చేశారు. అనంతరం చెన్నై వెల్లి అక్కడి నుండి హైదరాబాద్ కు చేరుకున్నారు.

మంకమ్మతోటలో నివాసం..

కరీంనగర్ లోని మంకమ్మతోట గోపాల్ రావు బిల్డింగ్ లో ఆయన అద్దెకు ఉండేవారు. 1997 ప్రాంతంలో పని చేసిన ఆయన లెగ్ వర్క్ కే ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చే వారు. అటవీ ప్రాంతాలు, నక్సల్స్ కార్యకలాపాలు, ప్రజా ఉద్యమాల గురించి ప్రత్యేకంగా కవర్ చేసేందుకు ఆసక్తి చూపేవారు. 1997లో మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలుకా ప్రజలు పెద్ద ఎత్తున ఆందోలన చేశారు. ‘వికాస్ కరో న విభజన్ కరో’ అన్న నినాదంతో తాలుకాలోని వంద గ్రామాల ప్రజలు నిరసనలు చేపట్టారు. అప్పుడు కరీంనగర్ నుండి ప్రత్యేకంగా వచ్చిన రాహుల్ కాళేశ్వరం మీదుగా నాటు పడవలో గోదావరి నది దాటి నడుచుకుంటూ సిరొంచకు వెళ్లారు. అక్కడి ఉద్యమకారులతో ప్రత్యేకంగా మాట్లాడి అక్కడి ప్రజల డిమాండ్ ను జాతీయ స్థాయిలో వెలుగులోకి తీసుకొచ్చారు. సమాచార, రవాణా వ్యవస్థలకు దూరంగా ఉన్న సిరొంచ ప్రాంత ప్రజలు అక్కడి ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆందోళనలు చేపట్టిన సందర్భంగా దూది వార్ ఇంట్లో రాత్రి 11గంటల నిరసనలకు సంబంధించిన వీడియోలు పరిశీలించారు. అనంతరం అప్పటి కాంగ్రెస్ నాయకులు పీఆర్ తలాండి దంపతుల నుండి వివరాలు సేకరించి న్యూస్ కవర్ చేశారు. అలాగే 1998లో గోదావరి జలాలను వినియోగంలోకి తీసుకరావాలని బీజేపీ చేపట్టిన పాదయాత్ర కవరేజ్ కోసం ఇచ్ఛంపల్లికి వెళ్లారు. ఇదే సమయంలో అప్పటి కలెక్టర్ హీరాలాల్ సమారియా గిరిజనుల అభ్యున్నతి కోసం ప్రతి నెలా గిరిజన సదస్సులు నిర్వహించేవారు. గోదావరి పరివాహక ప్రాంత గిరిజనల కష్టాలను తెలుసుకునేందుకు తరుచూ ఆ ప్రాంతంలో పర్యటించారు. జగిత్యాల, సిరిసిల్ల ప్రాంతాల్లో కూడా టూర్లు వేస్తూ అక్కడి వార్తల కవరేజ్ కి ఎక్కవగా ప్రాధాన్యత ఇచ్చేవారు. ఫీల్డ్ లో తిరిగేందుకు ఎక్కువగా శ్రద్ద చూపే రాహుల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పర్యటలు చేశారు. వరంగల్ లో కొంతకాలం పనిచేసిన తరువాత ఈ ప్రాంతంతో అనుబంధం లేకుండా పోయింది. రెండున్నర దశాబ్దాల క్రితం రాహుల్ ఉత్తర తెలంగాణాలో జర్నలిస్టుగా తన ప్రస్థానాన్ని కొనసాగించి ప్రత్యేకతను చాటుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తరుచూ ఎందయా రాహుల్ అంటూ పిలవడంతో ఆయన పేరు తెరపైకి వచ్చింది. ఆయన ఈ రోజు రిటైర్ కాబోతున్నారన్న విషయంపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి నోట ఆ పేరు వినిపించదని కొందరు, ఆయన్ని సలహాదారినగా తీసుకోవాలని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

You cannot copy content of this page