జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర…

జడ్పీ ఛైర్మన్ గా, ఎమ్మెల్యేగా ఎనలేని సేవలు

నేడు కేతిరి సాయిరెడ్డి విగ్రాహావిష్కరణ

దిశ దశ, హుజురాబాద్:

యువతను సన్మార్గంలో నడిపించాలన్న తపన ఉన్నా ఆచరించే వారు చాలా అరుదుగా ఉంటారు. అందివచ్చిన పదవితో అక్కున చేర్చుకోవల్సింది ప్రజలనే అన్న విధానంతో ముందుకు సాగిన వారిలో ఈయన ఒక్కరు. ఆదర్శవంతమైన జీవన విధానంతో ముందుకు సాగాలని చేతల్లో చూపించిన నేత… ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చెరగని ముద్ర వేసిన కేతిరి సాయిరెడ్డి విగ్రహావిష్కరణ సందర్భంగా ఆయన గురించి…

1991లో రాజీవ్ గాంధీ హత్యకు 9 రోజుల ముందు గోదావరిఖని సభలో పాల్గొన్న కేతిరి సాయిరెడ్డి

రిజర్వూ బ్యాంక్ టూ పాలిటిక్స్..!

హుజురాబాద్ సమీపంలోని జూపాకలో 1945 జనవరి 15న జన్మించిన కేతిరి సాయిరెడ్డి 4వ తరగతి వరకు చెల్పూరులో, 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు హన్మకొండలో విద్యాభ్యాసం చేశారు. ఇక్కడి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసుకున్న ఆయన ఉస్మానియా యూనివర్శిటీలో పొలిటికల్ సైన్స్ ఎంఏ పూర్తి చేశారు. వరంగల్ సబ్ కలెక్టర్ ఆఫీసులో అప్పర్ గ్రేడ్ క్లర్క్ (యూడీసీ)గా పని చేసిన సాయిరెడ్డి ఆ తరువాత అకౌంటెంట్ జనరల్ (ఏజీ) ఆఫీసులో సీనియర్ ఆడిటర్ గా పనిచేస్తున్న సమయంలోనే ఉస్మానియా నైట్ కాలేజీలో ఎల్ఎల్ఎబీ పూర్తి చేసి అడ్వకేట్ గా కూడా ప్రాక్టీసు చేశారు. రిజర్వూ బ్యాంకులో కూడా ఉద్యోగం చేసిన ఆయన 1969లో మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో ఏర్పడిన తెలంగాణ ప్రజా సమితిలో చేరి తొలి దశ జరిగిన స్వరాష్ట్ర ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. ఉద్యమ ప్రస్థానంలో తమ ఆకాంక్షలకు అనుగుణంగా స్వరాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వినిపించిన సాయిరెడ్డి ఆరు నెలల పాటు జైలు జీవితం కూడా గడిపారు. 1970లో జూపాక సర్పంచ్ గా ఏకగీవ్రంగా ఎన్నికైన ఆయన రెండు సార్లు హుజురాబాద్ సమితి అధ్యక్షులుగా, ఒక సారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 1982-1983 ప్రాంతంలో జడ్పీ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 1989లో హుజురాబాద్ నుండి పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టాలని భావించినా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచి చట్ట సభకు ప్రాతినిథ్యం వహించారు.

జైలుకెళ్లడానికి కారణం..?

స్వరాష్ట్ర కల సాకారం కావాలన్న తపన 1969 ఉద్యమ ప్రస్థానంలో ఆ నాటి యువతరం కీలక భూమిక పోషించింది. హుజురాబాద్ లో అడ్వకేట్ గా ప్రాక్టీసు చేస్తున్న కేతిరి సాయిరెడ్డి నేతృత్వంలో సహాయ నిరాకారణ కూడా జరిగింది. అదే సమయంలో స్థానిక కోర్టుకు ఆంధ్రా ప్రాంతానికి చెందిన మెజిస్ట్రేట్ బదిలీపై రాగా ఆయన ఇంటికి సరఫరా చేసే పాలు, కూరగాయలు, పని మనుషులు వెళ్లకుండా స్థానిక ఉద్యమకారులు అడ్డుకున్నారు. దీంతో యువ న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్న కేతిరి సాయిరెడ్డే ఇందుకు కారకులని భావించి పీడీ యాక్టు పెట్టి జైలుకు తరలించారు.

సాహితీ అభిమాని..!

హన్మకొండలో చదువుతున్న కాలంలో వరవరరావు, కన్వీనర్ గా వ్యవహరిస్తున్న వరంగల్ మిత్ర మండలి సభ్యులతో ఉన్న సాన్నిహిత్యంతో సాయిరెడ్డి సాహితీ ప్రపంచంతోనూ అనుభందం పెనవేసుకున్నారు. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో ప్రముఖ రచయితలు గంటా రాంరెడ్డి, అంపశయ్య నవీన్, ఎంవి తిరుపతయ్య లాంటి వారితో ఆయనకు పరిచయాలు ఉండేవి. 1973లో హుజురాబాద్ జనసాహితి సాహిత్య సంస్థను ప్రారంభించారు. నరెడ్ల శ్రీనివాస్, ఆవునూరి సమ్మయ్యలతో పాటు మరికొంతమంది నిర్వహించే ఈ సంస్థ నేటికీ కూడా కొనసాగుతోంది. విరసం నేత వరవరరావుకు సాయిరెడ్డికి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా జరుగుతుండేవని సీనియర్ జర్నలిస్టు ఆవునూరి సమ్మయ్య వివరించారు. ఈ సందర్భంగా పుస్తకావిష్కరణ కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొనేవారని, ఎంవి తిరుపతయ్య రచించిన జీవన సమరం నవల ఆవిష్కరణ సభకు తనను కూడా తీసుకెళ్లారని వివరించారు. 1982 పుండి 1989 వరకు కొనసాగిన హుజురాబాద్ ఫిల్మ్ సొసైటీకి చీఫ్ ప్యాట్రన్ గా కూడా సాయిరెడ్డి సేవలందించారు.

వైవిద్యమైన జీవన విధానం..!

ఎదిగిన కొద్ది ఒదగాలన్న నానుడికి అచ్చుగుద్దినట్టు సరితూగే నేతల్లో కేతిరి సాయిరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. జిల్లా పరిషత్ ఛైర్మన్ గా ఉన్న సమయంలో సాయిరెడ్డి పాలనాదక్షుడిగా తనదైన ముద్ర వేసుకున్నారనే చెప్పాలి. మారుమూల ప్రాంతాల్లోనూ పర్యటిస్తూ పాఠాశాలలను తనిఖీ చేసేవారు. జడ్పీ ఛైర్మన్ గా ఆయన అందించిన సేవలు ఆనాటి యువతరానికి స్పూర్తిగా నిలిచాయి. అలాగే నిరుద్యోగ యువతకు కూడా బాసటగా నిలిచిన ఆయన జిల్లా పరిషత్ ఛైర్మన్ గా ఉన్నప్పుడు టీచర్ల నియామక ప్రక్రియపై ప్రత్యేకంగా శ్రద్ద వహించారు. దీనివల్ల భావి పౌరులకు విద్యాబుద్దులు అందించే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం చేసేవారు. జర్నలిస్టులంటే కూడా అభిమానాన్ని పంచే సాయిరెడ్డి జడ్పీలో ప్రత్యేకంగా ఓ గదిని ప్రత్యేకంగా కెటాయించడం విశేషం. పాలిటిక్స్ లో అయినా అడ్మినిస్ట్రేషన్ లో అయినా ఆయన వైవిద్యమైన సాధరణ జీవన విధానాన్ని కొనసాగించి ఆదర్శప్రాయంగా నిలిచారు కేతిరి సాయిరెడ్డి.

1983లో మహదేవపూర్ లో సుభాష్ యూత్ క్లబ్ ప్రారంభోత్సవం చేస్తూ….

నేడు విగ్రహావిష్కరణ

2021 ఏప్రిల్ 23న అనారోగ్యంతో మృత్యువాత పడిన కేతిరి సాయిరెడ్డిని స్మరించుకుంటూ మంగళవారం హుజురాబాద్ లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు అభిమానులు, కుటుంబ సభ్యులు. విలువలతో కూడిన జీవన విధానంతో ముందుకు సాగిన కేతిరి సాయిరెడ్డి ఆదర్శంతమైన జీవితం స్పూర్తిగా తీసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది.

You cannot copy content of this page