రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకునే ఆలోచనలో కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ఉన్నట్లు తెలుస్తోంది. చత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో సోనియా గాంధీ మాట్లాడారు. మనోహ్మన్ సింగ్ నాయకత్వంలో 2004, 2009లో తమ పార్టీ విజయం సాధించడం తనకు ఎనలేని సంతృప్తిని ఇచ్చినట్లు వ్యాఖ్యానించారు. భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ ముగుస్తుందని వ్యాఖ్యానించారు. ఆ యాత్ర తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, కాంగ్రెస్‌కు అదే టర్నింగ్ పాయింట్ అవుతుందని సోనియా గాంధీ తెలిపారు.
కాంగ్రెస్ పార్టీకి, దేశానికి ఇది సవాళ్లతో కూడుకున్న సమయం అని సోనియా గాంధీ తెలిపారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్‌లు దేశంలో అన్ని సంస్థల్ని నిర్వీర్యం చేస్తున్నాయని ఆరోపించారు. కొంత మంది వ్యాపారవేత్తలకు మద్దతు ఇవ్వడం వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నట్లు చెప్పుకొచ్చారు. దేశ ప్రజలు సామరస్యం, సహనం, సమానత్వం కోసం ఎదురుచూస్తున్నారని.. భారత్ జోడో యాత్రగా రుజువైనట్లు సోనియా తెలిపారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ నేతలకు సోనియా గాంధీ పిలుపునిచ్చారు. మనమంతా క్రమశిక్షణలో పనిచేద్దామన్నారు. గతంలో ఎన్నో ఎన్నికల్లో పార్టీ గెలిచిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకుందామని పిలుపునిచ్చారు.