ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం..?

దిశ దశ, హైదరాబాద్:

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకోబోతున్నట్టుగా సమాచారం. ఈ వ్యవహారానికి అంతటికీ ప్రధాన కారణమైన రిటైర్డ్ పోలీసు ఆఫీసర్ ఇండియాకు రానున్నట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ప్ఱభాకర్ రావు ఒకటి రెండు రోజుల్లో హైదరాబాద్ చేరుకునే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం. ఈ కేసు నమోదుకు ముందే అమెరికా వెళ్లిన ప్రభాకర్ రావు ప్రోద్భలంతోనే ట్యాపింగులకు పాల్పడినట్టుగా ఇప్పటి వరకు జరిగిన విచారణలో తేలింది. అరెస్ట్ అయిన పోలీసు అధికారుల కన్ఫెషన్ రిపోర్ట్ ఆధారంగా ప్రభాకర్ రావుతో పాటు ఐ న్యూస్ ఛానెల్ ఎండీ శ్రవణ్ కుమార్ రావులకు లుక్ ఔట్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరిలో ప్రభాకర్ రావు స్వస్థలానికి రానున్న నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ టీమ్ ప్రభాకర్ రావును విచారించే అవకాశం ఉంది. ఎల్ఓసి ఇచ్చిన తరువాత ప్రభాకార్ రావు రాష్ట్ర స్థాయి క్యాడర్ లో ఉన్న ఓ పోలీసు అధికారితో వాట్సప్ కాల్ లో మాట్లాడినట్టుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తాను జూన్, జులై మాసాల్లో వస్తానని కూడా చెప్పినట్టుగా కూడా పోలీసు వర్గాల సమాచారం. అయితే అనూహ్యంగా ఆయన ఇండియాకు వస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతేకాకుండా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన చికిత్స కోసం వెళ్లానని కూడా వెల్లడిచినట్టుగా తెలుస్తోంది. చికిత్స పూర్తి కావడంతో ప్రభాకర్ రావు తిరుగు ప్రయాణం అవుతున్నారా లేక… ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిజాలు నిగ్గు తేల్చడానికి వస్తున్నారా అనేది తెలియరావడం లేదు. ఎస్ఐబీ చీఫ్ గా బాధ్యతలు నిర్వర్తించిన ప్రభాకర్ రావు ఆధేశాల మేరకే రాజకీయ నేతలు, సిని, వ్యాపార ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టుగా అరెస్ట్ అయిన అధికారులు వివరించారు. వీరి కన్ఫెషన్ ఆధారంగా ప్రభాకర్ రావును విచారించి క్లారిఫై చేసుకోవడంతో పాటు ఈ తతంగానికి మూలకారకులు ఎవరన్నది కూడా తెలుసుకోనున్నారు. దీంతో ఎస్ఐబీ ఆఫీసు కేంద్రంగా సాగిన ట్యాపింగ్ వ్యవహారం అంతా ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

You cannot copy content of this page