హై కోర్టులో ‘బండి’ పిటిషన్ పై విచారణ
ధర్మపురి కౌంటింగ్ పత్రాల సేకరణ
పోలీసుల ముందు హాజరు కానున్న ‘ఈటల’
దిశ దశ, హైదరాబాద్:
రాష్ట్రంలో సోమవారం అత్యంత కీలకమైన పరిణామాలు నెలకొననున్నాయి. రెండు పరిణామాలు హై కోర్టులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ క్వాష్ పిటిషన్ పై విచారణ జరగనుంది. హైకోర్టు ఆదేశాలతో జగిత్యాల జిల్లా ధర్మపురి ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించిన రికార్డులు సేకరించనున్నారు అధికారులు. మరో వైపున కమలాపూర్ పేపర్ లీకేజీ వ్యవహారంలో వరంగల్ కమిషనరేట్ పోలీసుల ముందు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరు కానున్నారు.
క్వాష్ పిటిషన్…
కమలాపూర్ హిందీ పేపర్ బయటకు వచ్చిన వ్యవహారానికి సంబంధించి కుట్ర కేసులో ఎ1గా ఉన్న బండి సంజయ్ వేసిన క్వాష్ పిటిషన్ పై నేడు హై కోర్టులో విచారణ జరగనుంది. సీనియర్ న్యాయవాది రాంచందర్ రావు ఈ నెల 6న క్వాష్ పిటిషన్ దాఖల చేయగా సోమవారం మద్యాహ్నం 3.30 గంటలకు విచారణ చేపట్టనుంది. ఇందుకు సంబంధించి హైకోర్టు ఇప్పటికే పీపీకి నోటీసులు జారీ చేసింది. అయితే సంజయ్ కు పేపర్ బయటకు వచ్చిన విషయానికి సంబంధంలేదని, ఆయనకు వాట్సప్ లో పోస్ట్ అయిన సమయంతో పాటు ఇతరాత్ర ఆధారాలతో కోర్టులో వాదనలు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుట్ర కేసుతో పాటు పోలీసులు పెట్టిన వివిధ సెక్షన్లకు సంబంధించిన ఏ కేసు కూడా బండి సంజయ్ కి వర్తించదని కోర్టుకు విన్నవించేందుకు ఎన్ రాంచందర్ రావు నేతృత్వంలోని లీగల్ టీమ్ కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం.
హన్మకొండకు ‘ఈటల’
పేపర్ లీకేజీ వ్యవహారంలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సోమవారం హన్మకొండ డీసీపీ కార్యాలయంలో హాజరు కానున్నారు. ఈ నెల 7నే హాజరు కావాలని కమలాపూర్ ఎస్ హెచ్ ఓ నోటీసులు జారీ చేసినప్పటికీ తాను 10వ తేదిన హాజరవుతానని ఈటల వరంగల్ కమిషనరేట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ రోజు ఈటల హన్మకొండ డీసీపీ ఆఫీసులో అటెండ్ అయి పేపర్ లీకేజీకి సంబంధించిన విషయంలో వాంగ్మూలంతో పాటు పోలీసులు అడిగిన అధారాలు సమర్పించే అవకాశాలు ఉన్నాయి. అయితే తనకు పోలీసులు ఇచ్చిన నోటీసులపై ఈటల ఇప్పటికే ఘాటుగా స్పందించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై కేసు నమోదు చేసి తనకు నోటీసులు ఇవ్వడం వల్ల భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన ఈటల కార్యకర్తల్లో ఆందోళన కల్గించే ప్రయత్నం చేస్తున్నారని మండి పడ్డారు. చట్టంపై ఉన్న గౌరవంతో తాను పోలీసుల ముందు హాజరవుతానని అయితే ప్రేమకు వంగుతాను కానీ బెదిరిస్తే నాలుగు ఎక్కువ దబాయిస్తానని వెల్లడించారు.
జగిత్యాల కౌంటింగ్ సెంటర్ ఓపెన్
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈవీఎం కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో ఓపెన్ చేయనున్నారు. ధర్మపురి కౌంటింగ్ విషయంలో గోల్ మాల్ జరిగిందని, కౌంటింగ్ కు, పోలింగ్ ఓట్లకు తేడా ఉందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హై కోర్టును ఆశ్రయించారు. హై కోర్టు ఆదేశాల మేరకు సోమవారం ఈవీఎం కేంద్రాన్ని తెరిచి డాక్యూమెంట్లను సేకరించి హై కోర్టుకు సమర్పించేందుకు జగిత్యాల జిల్లా అధికార యంత్రాంగం సిద్దపడుతోంది. ఇందులో ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన 258 ఈవీఎంల వివరాలను సేకరించి హౌ కోర్టుకు పంపించనున్నారు. ఇందులో పోలైన ఓట్లు, కౌంటింగ్ చేసిన ఓట్లకు సంబంధించిన వివరాలను క్లియర్ గా రాసి ఉంచే 17సి డాక్యూమెంట్లు తీసి హై కోర్టుకు సమర్పించనున్నారు. ఎలక్షన్ పిటిషన్ విచారణలో ఉన్న నేపథ్యంలో ధర్మపురికి సంబంధించిన ఈవీఎంలు, ఇతరాత్రా రికార్డులను ప్రత్యేకంగా ఓ గదిలో భద్రపర్చిన అధికారులు దాదాపు ఐదేళ్ల తరువాత నేడు ఓపెన్ చేసేందుకు సమాయత్తం అవుతున్నారు.
హరీష్ కు అనుమతి
పదో తరగతి హిందీ పేపర్ మాల్ ప్రాక్టీస్ కింద నమోదయిన కేసులో పేపర్ బయటకు ఇచ్చాడన్న కారణంతో ఐదేళ్ల పాటు డిబార్ కు గురైన హరీష్ ను సోమవారం పరీక్షకు అధికారులు అనుమతించారు. హై కోర్టు ఆదేశాలతో హరీష్ ను అనుమతించిన విద్యాశాఖ అధికారులు, డిబార్ కారణంగా హాజరు కానీ పరీక్షలను సప్లిమెంటరీ ఎగ్జామ్స్ లో అనుమతిస్తామని తెలిపారు.