అదానీ గ్రూపు-హిండెన్‌బర్గ్ వ్యవహారంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. అదానీ గ్రూప్‌లో తీవ్రమైన ఆర్థిక అవకతవకలు జరిగాయని అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ నివేదిక బయటపెట్టిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. సెబీ నిబంధనలలోని సెక్షన్ 19 ఉల్లంఘన జరిగిందా లేదా స్టాక్ ధరలలో ఏమైనా అవకతవకలు జరిగాయా అనే దానిపై దర్యాప్తు చేయాలని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈ వ్యవహారంపై రెండు నెలల్లో విచారణ జరిపి స్టేటస్ రిపోర్టు సమర్పించాలని సెబీని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. రెగ్యులేషన్ నిబంధనల ఉల్లంఘన ఉంటే కచ్చితంగా సెబీ విచారణ చేపట్టాలని తెలిపింది. అలాగే దీనికి సంబంధించిన విచారణ నిమిత్తం సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మాజీ న్యాయమూర్తులు జేపీ దేవదత్, ఓపీ భట్‌తోపాటు కేవీ కామత్, నందన్ నీలేకని, సోమశేఖర సుందరేశన్ ఉన్నారు.
అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంపై దర్యాప్తు కోరుతూ దాఖలైన నాలుగు పిటిషన్‌ల బ్యాచ్‌ను విచారించిన సుప్రీంకోర్టు గురువారం ప్యానెల్ ఏర్పాటుపై తన నిర్ణయాన్ని వెలువరించింది. ఈ పిటిషన్‌ను విచారిస్తున్న ధర్మాసనంలో సీజేఐ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు పీఎస్ నరసింహ, జేబీ పార్దీవాలా సభ్యులుగా ఉన్నారు.