గుజరాత్‌లో మోర్బీ వంతెన కూలిన ఘటనపై సిట్ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ బ్రిడ్జి గతేడాది అక్టోబర్ 30న కూలిపోయి సుమారు 135 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, గుజరాత్ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం చేపట్టిన విచారణలో బ్రిడ్జి కూలడానికి ముందే చాలా లోపాలు ఉన్నాయని వెల్లడించింది. .
మోర్బీ వంతెనకు ఉన్న మొత్తం 49 వంతెన తీగల్లో 22 తీగలు తుప్పు పట్టి ముందే తెగిపోయినట్లు సిట్ వెల్లడించింది. పాత ఇనుప కడ్డీలను కొత్త వాటితో వెల్డింగ్ చేయడంతో బ్రిడ్జి కూలిపోయినట్లు సిట్ గుర్తించింది. నదికి ఎగువన ఉన్న ప్రధాన తీగ తెగిపోవడంతో ఈ ఘటన జరిగిందని పేర్కొంది. వంతెన మరమ్మత్తులు, నిర్వహణలో అనేక లోపాలు జరిగినట్లు గుర్తించినట్లు సిట్ తన నివేదికలో పేర్కొంది.
1887లో మచ్చు నదిపై బ్రిటీష్ వారు నిర్మించిన ఈ బ్రిడ్జిలో రెండు ప్రధాన తీగలు ఉన్నాయి. ఈ రెండు కేబుల్స్‌లో నదికి ఎగువ వైపు ఉన్న కేబుల్ తెగిపోవడం వల్లే ప్రమాదం జరిగింది. వంతెన ప్రధాన కేబుళ్లు.. ఏడు ఉప తీగలు, అందులో ప్రతి తీగ మళ్లీ ఏడు ఉక్కువైర్లను కలిగి ఉన్నాయి. ఇలా మొత్తం 49 వైర్లతో కేబుల్‌ను రూపొందించారు. అయితే, కేబుల్‌లోని 22 వైర్లు అప్పటికే తుప్పు పట్టి ఉన్నాయి. ప్రమాదానికి ముందే అవి తెగిపోయి ఉండొచ్చు. మిగిలిన 27 వైర్లు ప్రమాద సమయంలో ధ్వంసమయ్యాయి. అలాగే బ్రిడ్జి పునరుద్ధరణలో భాగంగా పాత సస్పెండర్లను కొత్త వాటితో వెల్డింగ్ చేశారు. ఈ రకమైన వంతెనల్లో ఒకటే సస్పెండర్‌ను వినియోగించాలి అని సిట్ తన నివేదికలో పేర్కొంది.
దాదాపు 143 ఏళ్ల నాటి సస్పెన్షన్ బ్రిడ్జి ఆధునీకరణ పనులను గుజరాత్ ప్రభుత్వం ఒరెవా గ్రూప్‌నకు అప్పగించింది. బ్రిడ్జి ఆధునీకరణ పనులు పూర్తయ్యాయని, పర్యాటకుల కోసం తిరిగి ప్రారంభించవచ్చని ఒరెవా గ్రూప్ చైర్మన్ జైకుష్ పటేల్ గతేడాది అక్టోబర్ 24న ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి భద్రతా పరమైన అనుమతులు లేకుండా నిర్వహణ సంస్థ పర్యాటకులను బ్రిడ్జిపైకి అనుమతించింది. ఈ క్రమంలో అదే నెల 30న తీగల వంతెన కుప్పకూలడంతో 135 మంది మృతి చెందారు. 100మందికి పైగా గాయపడ్డారు.