Kaleshwaram project: కాళేశ్వరంపై అధ్యయన కమిటీ..? మంత్రి ప్రతిపాదనపై సర్వత్రా చర్చ..?

దిశ దశ, హైదరాబాద్:

అవినీతి ప్రవాహంలో కొట్టుకపోయిందన్న ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కాళేశ్వరంపై కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటోందన్న ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ బృందాల ద్వారా రికార్డుల పరిశీలన తుదిదశకు చేరుకున్న తరుణంలో మరో కొత్త ప్రతిపాదన తెరపైకి రావడం సంచలనంగా మారింది. విజిలెన్స ఎన్ ఫోర్స్ మెంట్ డీజీ రాజీవ్ రతన్ కూడా క్షేత్ర స్థాయిలో పర్యటించి మేడిగడ్డను పరిశీలించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు అంశాలను గుర్తించిన విజిలెన్స్ అధికారులు ఒక్క మేడిగడ్డ బ్యారేజీ విషయంలోనే పలు లోపాలను ఎత్తి చూపింది. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను తయారు చేసే పనిలో నిమగ్నం అయిన విజిలెన్స్ అధికారులు అన్ని రికార్డులను పరిశీలిస్తూ నిపుణులతో సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. బ్యారేజీ నిర్మాణాలకు సంబంధించిన విషయంలోనే మూడు సార్లు రీ డిజైన్ చేశారన్న విషయంతో పాటు మెటిరియల్ క్వాలిటీతో పాటు పలు టెక్నికల్ అంశాలపై కూడా రిపోర్టు సిద్దం చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే వెలుగులోకి వచ్చిన విషయాలను గమనించిన అధికారులు తలలు పట్టుకుంటున్నారన్న ప్రచారం సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర మంత్రివర్గ సభ్యుడు ఒకరు కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకరావడం సరికొత్త చర్చకు దారి తీస్తోంది. విజిలెన్స్ రిపోర్టులు కాకుండా కాళేశ్వరంపై మరో అధ్యయన కమిటీ వేయాలన్న ప్రతిపాదనను తెరపైకి తీసుకరావడం సంచలనంగా మారుతోంది. ఈ కమిటీలో కాళేశ్వరం నిర్మించినప్పుడు కీలకంగా వ్యవహరించిన ఓ అధికారిని కూడా సభ్యునిగా చేర్చాలని కూడా సదరు మంత్రి ప్రతిపాదనలు చేసినట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో వెలుగులోకి వచ్చిన తప్పిదాలను ఎత్తి చూపేందుకు ఇప్పుడు అధ్యయన కమిటీ వేయాల్సిన అవసరమే లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ సమయంలో కీలకంగా వ్యవహరించిన ఉన్నతాధికారికి ఈ అధ్యయన కమిటీలో సభ్యునిగా బాధ్యతలు ఇవ్వాలన్న ప్రతిపాదనపై కూడా విస్మయం వ్యక్తం అవుతోంది. థర్డ్ పార్టీ ద్వారా విచారణ చేయించాల్సిన ఈ విషయంలో పాతవారికి ప్రాతినిథ్యం కల్పించాలని చేస్తున్న సూచనలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైపే వెలేత్తి చూపే అవకాశం లేకపోలేదు.

రివైజ్డ్ ఎస్టిమేట్లు కామన్..?

అయితే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రివైజ్డ్ ఎస్టిమేట్లు తయారు కావడం వాటిని చకాచకా ఆమోదించడం కూడా జరిగిందన్న విషయం కూడా వెలుగులోకి వచ్చినట్టుగా సమాచారం. చాలా వరకు కూడా సంబంధిత పనులు పూర్తయిన తరువాత రివైజ్డ్ ఎస్టిమేట్లను తయారు చేయడం కాంట్రాక్టర్లకు అనుగుణంగా టెక్నికల్ అప్రూవల్ చేయడం వంటి చర్యలు కూడా జరిగాయని విచారణలో వెల్లడైనట్టుగా తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన సుమారు 2 వేల పనులు రివైజ్డ్ ఎస్టిమేట్లు జరిగి ఉంటాయని ప్రాథమికంగా నిర్థారించినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా కొన్ని కాంట్రాక్టు కంపెనీలు కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికార వర్గాలు బంధుప్రీతిని కూడా ప్రదర్శించాయని, వారికి కూడా కాంట్రాక్టులు ఇప్పించుకున్నారన్న విషయం కూడా గుర్తించినట్టుగా తెలుస్తోంది. మంత్రి కొత్తగా తీసుకొచ్చిన అధ్యయన కమిటీ ప్రతిపాదన అందులో కాళేశ్వరం అధికారికి ప్రాధాన్యత ఉండాలన్న ప్రతిపాదనను అమలు చేసినట్టయితే చాలా విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు లేవన్న అబిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

కాంగ్రెస్ సెల్ఫ్ గోల్…

కాళేశ్వరం అవినీతి, అక్రమాలపై పదే పదే విమర్శలు చేస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చి కాలయాపన చర్యలకు పూనకుంటే మాత్రం తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబడక తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. విచారణ విషయంలో కట్టుబడి ఉన్నామన్న చర్యలతో ఇప్పటి వరకు తెలంగాణ సమాజాన్ని నమ్మించేందుకు చర్యలు తీసుకున్నప్పటికీ…అధ్యయన కమిటీ కొత్తగా ఏర్పాటు చేయాలని, అందులో కాళేశ్వరం నిర్మాణ సమయంలో పనిచేసిన ఉన్నతాధికారి ప్రాతినిథ్యం ఉండాలన్న ప్రతిపాదనను అమలు చేస్తే మాత్రం ఆ పార్టీ ప్రజా క్షేత్రంలో ఒడిదొడుకులు ఎదుర్కొక తప్పదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

సీబీ‘ఐ’

కాళేశ్వరం అవినీతి, అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం సీబీఐని రంగంలోకి దింపేందుకు సిద్దంగా ఉన్నట్టుగా స్పష్టం అవుతోంది. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణను కోరినట్టయితే దర్యాప్తు చేసేందుకు కేంద్రం సిద్దంగా ఉందని ప్రకటించారు. అంతేకాకుండా హై కోర్టులో కూడా సీబీఐ కాళేశ్వరంపై విచారించేందుకు సిద్దంగా ఉన్నాం కానీ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉందన్న విషయాన్ని పిటిషన్ ద్వారా వెల్లడించింది. అయితే కాళేశ్వరం విషయంలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుని చరిత్ర తిరగరాయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అదే పంథాతో ముందుకు సాగితేనే ప్రజల్లో సానుకూలత వ్యక్తం అవుతుంది కానీ కొత్త కొత్త కమిటీలను తెరపైకి తీసుకొస్తే మాత్రం ఫెయిల్యూర్ కాక తప్పదన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. ఇలాంటి నిర్ణయాలు వచ్చే లోకసభ ఎన్నికలపై తీవ్రంగా పడే అవకాశం ఉంటుందని, కాళేశ్వరం విషయంలో యూ టర్న్ తీసుకున్నారన్న అపవాదును కాంగ్రెస్ పార్టీ ముటగట్టుకోకతప్పదన్న వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇదే అంశాన్ని అనుకూలంగా మల్చుకుని ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్ పార్టీ తీరును ఎండగట్టే ప్రమాదం కూడా లేకపోలేదు. కాళేశ్వరం అవినీతిపై కఠినంగా వ్యవహరిస్తామని ఇచ్చిన మాట ప్రకారం నడుచుకోకపోతే మాత్రం ఆ పార్టీ చావుదెబ్బ తినడం ఖాయం అంటున్నారు చాలామంది.

You cannot copy content of this page