దిశ దశ, వరంగల్:
ఖమ్మం జిల్లా సరిహద్దులకు చేరుకుంటున్న రేషన్ బియ్యం దర్జాగా ఆసిఫాబాద్ జిల్లా రెబ్బనకు చేరుకుంటున్నాయి… అక్కడి నుండి మహారాష్ట్రలోని గోందియాకు తరలివెల్తున్నాయి. నిత్యకృత్యంగా సాగుతున్న పీడీఎస్ రేషన్ బియ్యం అక్రమ రవాణా తీరు తొర్రూRAర్ సీఐ జగదీష్ ను ఏసీబీ పట్టుకోవడంతో మరోసారి వెలుగులోకి వచ్చింది.
ఏసీబీ ట్రాప్ కేసు తరువాత…
రెండు రోజుల క్రితం మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ సీఐ జగదీష్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన తరువాత కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత సంవత్సరం అక్టోబర్ 2న తొర్రూర్ సర్కిల్ పరిధిలోని దందాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఖమ్మం జిల్లా నుండి అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం లారీని పట్టుకున్నారు. అయితే ఈ లారీ ఏపీకి చెందిన వ్యక్తిది కాగా, డ్రైవర్, క్లీనర్ కూడా అక్కడికి చెందిన వారే కావడం గమనార్హం. ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు వ్యాపారులు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనకు చెందిన మరో వ్యాపారి కలిసి రేషన్ బియ్యం అక్రమ సరఫరా చేస్తున్నట్టుగా వెల్లడైంది. ఎన్టీఆర్ కృష్ణ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన వారు బియ్యం స్మగ్లింగ్ కోసం ఖమ్మం వరకూ వచ్చి లోడ్ చేయించుకుని బయలుదేరినట్టుగా పోలీసుల విచారణలో తేలింది.
అక్కడివా..?
అయితే ఏపీకి చెందిన వారు ఈ బియ్యం దందాలో చేతులు కలిపిన తీరు చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా లారీలు ఉన్నప్పటికీ జగ్గయ్యపేట నుండి లారీని, డ్రైవర్, క్లీనర్ ను రప్పించుకోవడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటోనన్నదే మిస్టరీగా మారింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రేషన్ బియ్యం దందాపై కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో పోర్టులో ద్వారా ఇతర దేశాలకు పంపించే పరిస్థితి లేకపోవడంతో సరిహద్దు జిల్లాల నుండి పెద్ద ఎత్తున రేషన్ బియ్యం ఖమ్మం జిల్లాకు వచ్చి చేరుతున్నాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వివిధ మార్గాల గుండా ఖమ్మం జిల్లాకు చేరుకున్న తరువాత వాటిని ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనకు చెందిన వ్యాపారి కిరణ్ ద్వారా మహారాష్ట్రకు తరలిస్తున్నట్టుగా పోలీసులు విచారణలో తేలింది.
ఒక్క ట్రిప్పుకు…
అయితే దంతాలపల్లి పోలీసులు రేషన్ బియ్యం పట్టుకున్న తరువాత డ్రైవర్, క్లీనర్ లను పోలీసులు విచారించినప్పుడు సంచలన విషయాలు తెలిశాయి. ఒక్క లారీ లోడు బియ్యాన్ని రెబ్బన వ్యాపారి చెప్పిన చోట దింపినట్టయితే డ్రైవర్ కు రూ. 20 వేలు, క్లీనర్ కు రూ. 10 వేలు ముట్టచెప్తున్నారు వ్యాపారులు. ఎక్కువ డబ్బు వస్తుందన్న ఆశతోనే బియ్యం అక్రమంగా రవాణా చేసేందుకు ఒప్పుకున్నామని పోలీసులకు వాంగ్మూలం కూడా ఇవ్వడం గమనార్హం.
రేట్ సెట్ కాక రూట్ మార్చి…
అయితే అక్టోబర్ 2న దంతాలపల్లి పోలీసులు రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని పట్టుకున్న తరువాత ఈ కేసు దర్యాప్తులో తొర్రూర్ సీఐ జగదీష్ జోక్యం చేసుకున్నారు. గతంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని తూర్పు ప్రాంతంలో పనిచేశారు. రెబ్బన వ్యాపారి కిరణ్ పీడీఎస్ రైస్ దందా కొనసాగించేవాడన్న విషయం సీఐ నోటీసులు ఉండడంతో అతన్ని అరెస్ట్ చేయకుండా నోటీసు ఇచ్చి పంపించేందుకు రూ. 5 లక్షలు డిమాండ్ చేశాడు సీఐ. ఇద్దరి మధ్య జరిగిన చర్చలతో రూ. 4 లక్షలకు డీల్ సెట్ కాగా… అందులో రూ. 2లక్షలు అప్పటికప్పుడు కిరణ్ సీఐ జగదీష్ కు అప్పగించాడు. మిగతా డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య తర్జన, భర్జనలు జరగుతుండేవని తెలుస్తోంది. దీంతో తొర్రూరు మీదుగా బియ్యం రవాణా చేయడం నిలిపివేసి… భద్రాచలం, మణుగురు, ఏటూరునాగారం, కాటారం, మంథని, గోదావరిఖని మీదుగా రెబ్బనకు బియ్యం తరలించడం మొదలుపెట్టాడు కిరణ్, సీఐ జగదీష్ కు మిగతా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని భావించిన కిరణ్ ఏకంగా రూట్ మార్చేసి బియ్యాన్ని తన ఇలాకాకు తరలించుకోవడం మొదలు పెట్టాడు. అయితే రేషన్ బియ్యం తరలిస్తున్న సమాచారం అందుకున్న మంథని పోలీసులు ఎక్లాస్ పూర్ అటవీ శాఖ చెక్ పోస్టు వద్ద వాహనాన్ని సీజ్ చేశారు. ఈ ఘటనలో పలువురిపై కేసు నమోదు చేసిన మంథని పోలీసులు వాహనంలో ఉన్న వారిని విచారించగా ఈ బియ్యం రెబ్బెనకు చెందిన కిరణ్ భాగస్వామ్యం ఉందని, లారీ కూడా అతనిదేనని పోలీసుల విచారణలో తేలింది.
రెబ్బెన నుండి…
రెబ్బెన పరిసర ప్రాంతాలకు చేరుకుంటున్న ఈ బియ్యం మహారాష్ట్రలోని బల్లార్ష, రాజూరాల మీదుగా గోందియాకు తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. రెబ్బన పరిసర ప్రాంతాలకు చేరుకున్న ఈ రేషన్ బియ్యాన్ని ప్యాకింగ్ చేసి బిల్లులు క్రియేట్ చేసి దర్జాగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.