దిశ దశ, సిద్దిపేట:
ప్లంబర్ పని కోసం వెల్లి దొంగతనం చేసేందుకు స్కెచ్ వేసి అడ్డంగా పట్టుబడ్డాడో ప్రబుద్దుడు. నీటి సరఫరాకు సంబందించిన సమస్యను సరి చేయాలని పిలిచినందుకు ఉపాధి కల్పించిన ఇంటికే ఎసరు పెట్టాడా ఘనుడు. పని కోసం వెల్లినప్పుడు ఆ ఇంట్లో విలువైన వస్తువులు ఎక్కడ ఉన్నాయో గమనించి చోరీ చేసుందుకు ప్లాన్ చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దర్జాగా పెంట్ హౌజ్ లాక్ పగలగొట్టి మరీ దొంగతనానికి పాల్పడ్డాడు. చోరీ జరిగిందన్న ఫిర్యాదు అందగానే రంగంలోకి దిగిన కొమురవెల్లి పోలీసులు 24 గంటల్లోనే చోరీ సొత్తును రికవరి చేశారు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని కొమురవెల్లికి చెందిన అంబడిపల్లి అర్చన ఇంట్లో శనివారం అర్థరాత్రి అగంతకులు చోరీకి పాల్పడ్డారు. ఆదివారం ఉదయం అర్చన స్థానిక పోలీసులకు పిర్యాదు చేయడంతో ఎస్సై చంద్ర మోహన్ ఆధ్వర్యంలో నిందితుల కోసం వేట మొదలైంది. వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు పెంట్ హౌజ్ లో ఉన్న విలువైన వస్తువుల గురించి అగంతకులకు ఎలా తెలిసిందన్న అనుమానంతో వివిధ కోణాల్లో ఆరా తీశారు. ఈ క్రమంలో సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించి ఆరా తీస్తూనే ఆ ఇంట్లో ప్లంబర్ పని చేసేందుకు మల్లేశం అనే వ్యక్తి ఇటీవల వచ్చాడని తెలుసుకున్న పోలీసులు అతని గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అర్చన ఇంట్లో దొంగతనానికి పాల్పడింది మేడిగుంట మల్లేశం (30) అని గుర్తించిన పోలీసులు అతన్ని సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లిలో అదుపులోకి తీసుకుని విచారించి చోరీ సొత్తుతో పాటు నగదును రికవరి చేశారు. నిందితుని నుండి 32 తులాల బంగారు ఆభరణాలు, 23 తులాల వెండి వస్తువులు, రూ. లక్షా 17 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు చేర్యాల సీఐ సత్యనారాయణ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. శనివారం అర్చన ఇంట్లో దొంగతనం జరిగిందన్న ఫిర్యాదు అందగానే రగంలోకి దిగిన కొమురవెల్లి పోలీసులు రంగంలోకి దిగి సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో నిందితున్ని, చోరీ జరిగిన సొత్తును, నగదును రికవరీ చేయడంలో సక్సెస్ అయ్యారన్నారు. కేవలం 24 గంటల్లోనే నిందితులను గుర్తించి చోరీ సొత్తును, నగదును రికవరీ చేసిన కొమురవెల్లి ఎస్సై చంద్ర మోహన్ తో పాటు పోలీసు సిబ్బందిని సీఐ ప్రత్యేకంగా అభినందించారు. విలువైన వస్తువుల విషయంలో యజమానులు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. సేఫ్టీ లాకర్లలో విలువైన బంగారు నగలను ఉంచినట్టయితే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవన్న విషయం గుర్తు పెట్టుకోవాలని సత్యనారాయణ రెడ్డి కోరారు.