దిశ దశ, పెద్దపల్లి:
పెద్దపల్లి లోకసభ అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు బీఆర్ఎస్ అధిష్టానం కూడా సూత్రప్రాయంగా కొప్పుల అభ్యర్థిత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వచ్చే లోకసభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను పోటీ చేయించాలన్న లక్ష్యంతో ఉన్న అధినేత కేసీఆర్ మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తున్నట్టుగా సమాచారం. ఇందులో భాగంగానే పెద్దపల్లి అభ్యర్థిని మార్చాలన్న యోచనతో వచ్చినట్టుగా తెలుస్తోంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నుండి ఓటమి చవి చూసిన కొప్పుల ఈశ్వర్ ను బరిలో నిలిపినట్టయితే అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. రామగుండంలో సీనియర్ లీడర్ గా మంచి గుర్తింపు ఉండడం, మంత్రిగా పెద్దపల్లి జిల్లాకు ప్రాతినిథ్యం వహించడంతో పాటు సింగరేణి విస్తరించిన సెగ్మెంట్లు కూడా ఈ నియోజకవర్గం పరిధిలో ఉండడం కూడా లాభిస్తుందని ఆశిస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. గత లోకసభ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేలుగా ఓటమి చవి చూసిన అభ్యర్థులను బరిలో నిలిపి విజయం సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఇదే విధానాన్ని లోకసభ ఎన్నికల విషయంలోనూ అమలు చేసినట్టయితే సఫలం అవుతామన్న ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు ఉన్నట్టుగా సమాచారం.
సిట్టింగ్ ఔటేనా..?
అయితే అనూహ్య పరిణామాలతో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచి పార్లమెంటులోకి అడుగుపెట్టిన వెకంటేష్ నేతను ఈ సారి పార్టీ పక్కనపెట్టాలన్న యోచనలో ఉన్నట్టు స్పష్టం అవుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన వెంకటేష్ నేతను బాల్క సుమన్, కొప్పుల ఈశ్వర్, పుట్ట మధులు అధిష్టానాన్ని మెప్పించి మరీ వెంకటేష్ నేతకు బీఆర్ఎస్ టికెట్ ఇప్పించారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుండి టికెట్ ఆశించిన వివేక్ వెంకటస్వామిని పక్కన పెట్టేయడంలో పావులు కదిపిన పలువురు ఎమ్మెల్యేలు వెంకటేష్ నేతను గెలిపించే బాధ్యతను కూడా తమ భుజాలపై వేసుకుని సఫలం అయ్యారు. అయితే తాజాగా మారిన సమీకరణాల నేపథ్యంలో వెంకటేష్ నేతకు కాకుండా కొప్పులకు టికెట్ ఇవ్వాలన్న యోచనలో అధిష్టానం ఉండడం గమనార్హం.
’బాల్క‘ను కాదని…
అయితే లోకసభ ఎన్నికల్లో టికెట్ అభ్యర్థించాలని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా భావించినట్టుగా ప్రచారం జరిగింది. ఈ మేరకు అధినేత కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ల ముందు ప్రతిపాదనలు పెట్టాలని యోచించినప్పటికీ అధిష్టానం మాత్రం పోటీ చేయకూడదని ఆయనకు సూచించినట్టుగా తెలుస్తోంది. ఈ సారి కొప్పుల ఈశ్వర్ కు అవకాశం ఇవ్వాలని, ఆయనను గెలిపించుకోవాలని కూడా చెప్పినట్టు సమాచారం.