బరిలో నిలిచెదెక్కడి నుండో..?
కరీంనగర్ కాషాయ దళంలోకి ఎంట్రీ ఇచ్చిన ఆ నాయకుడు స్పీడ్ గా సమీకరణాలు చేయడం ఆరంభించారు. దూకుడు మీదున్న బీజేపీ తరుపున పోటీ చేసి చట్ట సభలోకి అడుగు పెట్టేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఓ వైపున ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ జీ హాజరయ్యే కార్యక్రమాల్లో కనిపిస్తూ మరో వైపున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో మంతనాలు జరుపుతుండడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.
ఎవరా నేత.. ?
హైదరాబాద్, కరీంనగర్ లలో కేబుల్ బిజినెస్ చేస్తూ ఓ కేబుల్ ఛానెల్ తో పాటు పలు వ్యాపారాల్లో స్థిరపడ్డ కొత్త జైపాల్ రెడ్డి ఇప్పుడు కరీంనగర్ కమలనాథుల్లో ప్రధాన చర్చకు కేంద్ర బిందువుగా మారారు. గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లికి చెందిన ఆయన సింగిల్ విండ్ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు వివిధ పార్టీల నాయకులతో సంబంధాలు ఉన్నాయి. 2018 ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచిన కొత్త జైపాల్ రెడ్డి ఈ సారి కాషాయం వైపు చూస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో వేరే అభ్యర్థులకు మద్దతు ఇచ్చిన ఆయన ఈ సారి మాత్రం తానే రంగంలోకి దిగుతున్నట్టుగా స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తో సన్నిహిత సంబధాలు ఉండడంతో పాటు ఆరెస్సెస్ అనుబంధ పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. ఇటీవల కాలంలో ఆరెస్సెస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ జీ భగవత్ తో తరుచూ కనిపిస్తుండడంతో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆయన గురించే చర్చ జరుగుతోంది. ఈ సారి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న లక్ష్యంతోనే పావులు కదుపుతున్నారని అంటున్నారు.
ఎక్కడి నుండో…?
అయితే కరీంనగర్ నుండి కొత్త జైపాల్ రెడ్డి పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకున్నప్పటికీ అధిష్టానంతో పాటు ఆరెస్సెస్ చీఫ్ ఆశీస్సులు అందుకునే పనిలో నిమగ్నం అయిన ఆయనకు ఎక్కడి నుండి అవకాశం ఇస్తారోనన్న డిస్కషన్ సాగుతోంది. జాతీయ పార్టీ నిర్ణయమే ఫైనల్ కావడంతో కరీంనగర్ నుండి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ని నిలబడాలని ఆదేశిస్తే కొత్తకు వేరే సెగ్మెంట్ అప్పగించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జైపాల్ రెడ్డి పర్సనల్ ఇమేజ్ ఏయే నియోజకవర్గాల్లో ఉంటుంది..? ఎక్కడెక్కడ ఆయన సేవలు వినియోగించుకోవచ్చు, ఎక్కడి నుండి ఆయనకు అవకాశం ఇస్తే గెలుస్తారు అన్న విషయాలపై బీజేపీ అధిష్టానం ఆరా తీయనున్నట్టు సమాచారం. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అండదండలు మాత్రం కొత్తకే ఉంటాయని, ఆరెస్సెస్ చీఫ్ నుండి కూడా క్లియరెన్స్ ఉన్నందున వచ్చే ఎన్నికల్లో మాత్రం కొత్త జైపాల్ రెడ్డికి టికెట్ ఖాయం అన్న అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి.