దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ పోలీసు కమిషనర్ అభిషేక్ మహంతికి బహిరంగ లేఖ రాశారు కొత్త జైపాల్ రెడ్డి, గత కొద్ది నెలలుగా విదేశాల్లో ఉన్న ఆయన తనపై జరుగుతున్న ప్రచారంతో పాటు కేసులు నమోదు చేస్తున్న తీరుపై ఈ లేఖలో ప్రస్తావించారు. ఈఓడబ్లులో పని చేస్తున్న హుస్నాబాద్ లో పనిచేస్తున్న ఓ పోలీసు అధికారికి ఈఓడబ్లూలో పని చేస్తున్న మరో అధికారికి సాన్నిహిత్యం ఉందని, హుస్నాబాద్ అధికారి తనపై తప్పుడు సమాచారం ఇస్తున్నారంటూ కొత్త జైపాల్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు నమోదు చేసిన కేసుల్లో ప్రభుత్వ అధికార యంత్రాంగం భాగస్వామ్యం ఉన్నప్పటికీ ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదన్నారు. ఈఓడబ్లులో పనిచేస్తున్న అధికారులు చెప్పిందే నిజమని సీపీ నమ్ముతున్నారని జైపాల్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తనపై కక్ష్య కట్టి తప్పుడు కేసులు నమోదు చేసినట్టయితే తాను కోర్టుల్లో న్యాయ పోరాటం చేస్తానని వెల్లడించారు. అయితే తప్పుడు కేసుల్లో ఇరికించే ప్రయత్నం గతంలోనూ జరిగిందని, ఇప్పుడు కూడా అలాగే జరుగుతోందన్నారు. తనపై కేసు నమోదు కాకముందే విదేశాలకు వెల్తే… కేసు నమోదు అయిన విషయం తెలిసి విదేశాలకు వెళ్లానని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తాను ఎప్పుడు విదేశాలకు వెల్లింది అన్న విషయం పాస్ పోర్టులో కూడా ఉంటుందని క్రాస్ చెక్ చేసుకోవాలన్నారు. అలాగే తనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈఓడబ్లూలో పని చేస్తున్న అధికారులు కాకుండా ఇతర అధికారుల ద్వారా విచారణ జరిపించేందుకు నిజ నిర్దారణ కమిటీ వేయాలని కూడా జైపాల్ రెడ్డి కోరారు. సీపీ అభిషేక్ మహంతికి, మీడియా ప్రతినిధులకు పంపిస్తున్నట్టుగా రాసిన ఈ లేఖ పూర్తి పాఠం ఇదే…
తేది: 16-06-2024
బహిరంగ లేఖ
గౌరవ ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు,
నమస్కారం, నేను అనగా కొత్త జయపాల్ రెడ్డి S/o సత్యనారాయణ రెడ్డి R/o లక్ష్మిదేవిపల్లి గ్రామం, గంగాధర మండలం, కరీంనగర్ జిల్లా, భారతీయ పౌరుడనైనటువంటి నేను మీకు కరీంనగర్ కమీషనర్ గా కాకుండా, అభిషేక్ మహంతి IPS గారికి వ్యక్తిగతంగా వ్రాస్తునటువంటి బహిరంగ లేఖ ఏమనగా…
సార్, సంఘములో విద్య నేర్పించే గురువులు, వైద్యం చేసే డాక్టర్లు, ఏ ఆపద వచ్చిన కాపాడే పోలీసులు మరియు వీటికంటే చట్టాన్ని, న్యాయాన్ని కాపాడే న్యాయస్థానాలు, ఈ నాలుగు శాఖలు దైవంతో సమానం. కాని మీరు కరీంనగర్ జిల్లాకు కమీషనర్ గా భాద్యతలు చేపట్టినప్పటినుండి నేటి వరకు అనగా తేది.16-06-2024 వరకు 20% న్యాయం చేస్తే 80% అన్యాయం చేసారని నా వ్యక్తిగత అభిప్రాయం. మచ్చుకు కొన్ని ఉదాహరణలు మీకు వివరిస్తున్నాను. మీరు ఈ మద్యకాలంలో ఏర్పాటు చేసిన EOW (Economic Offence Wing) కు 1800 పిర్యాదులు వచ్చినాయని మీరే పత్రిక ముఖంగా చెప్పినారు. కానీ ప్రతి పిర్యాదు మీదగ్గరకే ఎందుకు వస్తునాయి? అట్టి పిర్యాదులు సంబందిత పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న SHO గార్ల దగ్గరకు ఎందుకు వెళ్ళటం లేదు? ఒక్కసారి మీరే ఆలోచించండి. స్థానిక వాస్తవిక పరిస్తితుల మీద అవగాహన ఉన్న SHO గారి దగ్గరకి పిర్యాదు చేసేవారు వెళ్లి పిర్యాదు చేస్తే వారు స్పందించకుంటే, తదుపరి ఆపై అధికారి దగ్గరకు వెళ్ళిన వారు కూడా స్పందించకుంటే, చివరి ప్రయత్నంగా మీ దగ్గరకు రావాల్సి ఉంటుంది. కానీ అలా కాకుండా కొందరు పిర్యాదు దారులు మీదగ్గరకే సరాసరి వచ్చి తప్పుడు పిర్యాదులు ఇస్తే కూడా మీరు చర్యలు తీసుకోమని మీ EOW లోని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. మీ EOW లోని క్రింది స్థాయి అధికారులు పూర్తి స్థాయిలో ఎంక్వయిరీ చేయకుండానే మీరు ఆదేశించారని, మీ మెప్పు కోసం ఎలాంటి ఎంక్వయిరీ చేయకుండానే కేసులు పెట్టడం జరుగుతుంది. మీ EOW టీం నుండి ఫోన్ కాల్ వచ్చిందంటేనే జిల్లా ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. మీ దృష్టిలో జిల్లా పరిదిలో ఉన్నSHO లు కూడా అసమర్డులని, అవినీతిపరులని, ప్రజలకు వారిపై నమ్మకం సన్నగిల్లిందని మీరు భావిస్తున్నట్లు నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. మీరు కమీషనర్ గా భాద్యతలు తీసుకున్న తరువాత మీరు కేవలం భూతగాధలు అనే విషయంపై ఫోకస్ చేసి కేవలం ముగ్గురు అధికారులతోనే పాలన సాగిస్తున్నారు. భూమాఫియా, భూకబ్జాలు నియంత్రించడం వరకే మీ భాద్యత. అట్టి భూమికి సంబందించిన అన్ని సమస్యలను చట్టాల ద్వారా న్యాయస్థానాలు పరిష్కరిస్తాయి. కానీ మీరు అభిషేక్ మహంతి గా మీ యొక్క వ్యక్తిగత పేరు ప్రతిష్టలు పెంచుకోవాలానే అజెండాతో ఈ అంశంపై చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ మరే ఇతర విషయాల మీద చూపటంలేదనేది లేదని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఒక్క విషయం నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను, ఒక్క భూతగాధ సృష్టించాలనుకుంటే అక్కడ పనిచేస్తున్నటువంటి స్థానిక డాక్యుమెంట్ రైటర్, సబ్-రిజిస్ట్రార్, రెవెన్యూ సిబ్బంది, స్థానిక పోలీస్ సిబ్బంది, మున్సిపల్ / SUDA సిబ్బంది మరియు స్థానిక ప్రజాప్రతినిదులు ఇలా అందరు కనీసం 90% సహకరిస్తేనే కానీ సాద్యం కాదు అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఇందులో మీరు భూతగాధలు సృష్టించడానికి సహకరించిన ఏఒక్క అధికారి పై చర్యలు చేపట్టి వారిపై కేసులు పెట్టి అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. అంటే వీరందరూ మీ దృష్టిలో సఛీలులేన మీ అంతరాత్మకే తెలియాలి? జిల్లాలో అనేక సమస్యలున్నాయి, అవి ఎమిటంటే డ్రగ్స్, గంజాయి, నకిలీ విత్తనాలు, నాసిరకం మేడిసిన్స్, ఫేక్ కరెన్సీ, విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని మోసాలు చేసేవారు, అధిక వడ్డీల అప్పుల భారంతో ఆత్మహత్యలకు భాద్యులైన వ్యక్తులు/ఫైనాన్స్ వారి పట్ల మీరు ఒక్క చర్య తీసుకున్న దాఖలాలు లేవని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. నా మీద కూడ ఒక FIR తేది.24-04-2024 రోజున చేసారని తెలిసింది. మీరు FIR చేయగానే నేను దుబాయ్ పారిపోయానని మీ డిపార్టుమెంటు లోని అధికారుల చేత జిల్లాలో ఒక వదంతు సృష్టించినారు. కాని నేను దుబాయ్ తేది.16-02-2024 రోజున చేరుకున్నాను. నా పాస్ పోర్ట్ లో కూడా అట్టి విషయం నమోదు అయిఉన్నది. మీరు FIR చేసిన తేది మీ వద్ద గల FIR లో నమోదై ఉన్నది. మీరు వ్యక్తిగతంగా కక్ష్య పెట్టుకొని కావాలని కొందరిమీద కేసులు పెట్టిస్తున్నరనేది నా యొక్క అభిప్రాయం. భూతగాధలకు సంబంధించి కేసులు పెట్టె విషయంలో మీకు మరియు మీ EOW టీంకు తప్ప సంబందిత పోలీస్ స్టేషన్ పరిధిలోని SHO కూడ తెలియటంలేదు. చివరి నిమిషంలో సంబందిత SHO కి కాపీ పంపి సంతకాలు పెట్టమని మీ EOW టీం అధికారులు ఆర్డర్ చేస్తున్నారు. ఈ విషయంలో అందరు SHO లు ఎంతో మనోవేదన చెందుతున్నారు. ఒక్క విషయం నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను, మీరు గతంలో 20 సంవత్సరాలకు క్రితం న్యాయస్థానాల్లో ఉన్న భూముల తగాదాలపై లోతుగా వెతికి సివిల్ కేసులను మరీ క్రిమినల్ కేసులుగా మార్చి కేసులు పెట్టి నిందితులను జైలుకు పంపించి, ఒక అడుగు ముందుకు వేసి భాదితులకు ఎటువంటి అనుమతులు లేకున్నా పోలీసు డిపార్టుమెంటు సహకారంతో నిర్మాణాలు చేపట్టిస్తూ, బాదితులకు న్యాయం చేస్తున్నటువంటి మీకు, గత 20 సంవత్సరాలనుండి మీ డిపార్టుమెంటు లో పని చేస్తున్న ఎ ఒక్క పోలీస్ అధికారి కూడా అవినీతికి పాల్పడిన దాఖలాలు మీకు కనిపించలేదా? మీరు, అవినీతి పాల్పడిన ఏఒక్క అధికారిని కూడా సస్పెండ్ చేసి అరెస్ట్ చేసి జైలు కు పంపించ లేకపోయారు? అదే విదంగా మీరు రాక ముందు మరియు మీరు వచ్చాక మీ కమిషనరేట్ పరిదిలో గల అన్ని పోలీస్ స్టేషన్ లలో కానుకలు తీసుకోకుండానే ఆయా పోలీస్ స్టేషన్లు నడుస్తున్నాయా? మీరు మీ ఆత్మ సాక్షిగా చెప్పండి? ఇప్పడు కూడా మీ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లు మీరు ఇచ్చే నిధుల ఆధారంగానే నడుస్తున్నయా? పోలీస్ స్టేషన్లలో ఒక్క రూపాయి కూడా వ్యాపారస్తులనుండి కానీ, ఇతర ఎ వ్యక్తులనుండి కానీ కానుకలు తీసుకోవటం లేదా? ఇటీవలి కాలంలో లింగా రావు అలియాస్ దుబాయ్ లింగా రావు అనే గ్రానైట్ వ్యాపారిపైన పైన Explosive Act క్రింద కేసు పెట్టి జైలుకు పంపించినారు. Explosive లైసెన్స్ పొందడానికై గతంలో పనిచేసిన పోలీస్ కమీషనర్ గారి అధ్వర్యంలో కరీంనగర్ జిల్లా గ్రానైట్ అసోసియేషన్ తరపున, కమీషనర్ గారి ఆదేశాలను అనుసరించి కరీంనగర్ లోని గ్రానైట్ క్వారీ ఓనర్స్ అందరు కూడా దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకొమ్మని చెప్పిన మీ డిపార్టుమెంటు వారే, కానీ నేటి వరకు ఎ ఒక్క గ్రానైట్ సంస్థకి కూడా Explosive లైసెన్స్ ఎందుకు జారి చేయలేదో, మీరే ఆలోచించుకోండి? నేరనియంత్రణ కొరకు, జిల్లా కరీంనగర్ జిల్లా అభివృద్ధి కోసమని కమీషనర్ గారు చందాలు కావాలని కోరితే, కరీంనగర్ గ్రానైట్ క్వారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు తమ వద్ద నిధులు లేకున్నా అప్పులు తెచ్చి CC కెమెరాల ఏర్పాటు కోసమై రూ.51 లక్షల చందాలు ఇవ్వటమైనది. అంతే కాకుండా ప్రతి గ్రానైట్ క్వారీ ఉన్న గ్రామాలలో వాటి అభివృధి కోసమై, అక్కడ ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ పుననిర్మాణం కోసమై మరియు అక్కడ CC కెమెరాల ఏర్పాటు కోసమై ప్రతి గ్రానైట్ క్వారీ ఓనర్ ఎంతో కొంత సహాయ సహకారాలు అందించినారు. ఇది నిజం కదా? గత దశాబ్దకాలంగా గ్రానైట్ క్వారీ పరిశ్రమలు నష్టాల పాలై ఆస్తులు అమ్ముకొని ఆర్టిక ఇబ్బందుల్లో కూరుకుపోయి ఉన్నా కూడా, సమాజంలో గౌరవంగా బ్రతుకుతూ, గ్రానైట్ అసోసియేషన్ లో డబ్బులు ఉన్నా లేకున్నా జిల్లా అభివృద్ధి కోసమని గౌరవ కల్లెక్టర్ గారు, గౌరవ పోలీస్ కమీషనర్ గారు మరియు గౌరవ రాజకీయ పార్టీల వారు(అన్ని పార్టీల వారు) ఇతర డిపార్టుమెంట్ల వారు జిల్లా అభివృద్ధి కోసమై నిధులు సహాయం అడిగితె ఎప్పుడు కూడా లేవు అనకుండా, అప్పులు తెచ్చి మరి అభివృద్ధి కోసమని నిధులు సమకూర్చారు. అందుకు కొన్ని ఉదాహరణలు మీరు కూర్చుంటున్నవంటి పోలీస్ కమిషనరేట్ పున:నిర్మాణం కోసం, ఒక కరీంనగర్ పట్టణంలోనే CC కెమెరాల ఏర్పాటు కోసం రూ.51 లక్షలు, పార్కులు అభివృద్ధి కోసం మరియు చమన్లు కట్టడం కోసం రూ.10 లక్షలు, హూద్ హుద్ తుఫాను భాదితులకోసం రూ.10 లక్షలు, మరియు అప్పటి మంత్రి గారి విన్నపం మేరకు పేద ప్రజలకు ఇండ్లు కట్టించడంకోసం CSR నిధుల క్రింద రూ.2 కోట్లు గ్రానైట్ క్వారీ ఓనర్స్ యజమానులు సమకుర్చినారు. కానీ మీరు అట్టి గ్రానైట్ పరిశ్రమను కనీసం మానవతా దృక్పదంతో కూడా చూడటంలేదని నా అభిప్రాయం. తమరి మీద వ్యక్తిగతంగా మీ క్రింది స్థాయి సిబ్బందిలో 90% అసంతృప్తితో ఉన్నారనే నిజాన్ని మీరు గ్రహించడం లేదు. నాకు పోలీస్ డిపార్టుమెంటులో కానిస్టేబుల్ స్థాయి నుండి కమీషనర్ గారి వరకు అందరిపైన ఎనలేని గౌరవం, నమ్మకం మరియు న్యాయస్థానం, న్యాయమూర్తులు అంటే దైవంతో సమానం. అందుకే మీరు ఇటివల కాలంలో నామీద తేది.24-04-2024 రోజున కొత్తపల్లి SHO లో పెట్టిన కేసు, ఇక ముందు కూడా మీరు వేరేవాళ్ళు చెప్పే మాటలు విని దురుద్దేశంతో కావాలనుకుని పెట్టాలనే కేసులన్నింటిని నేను చట్టబద్దంగా గౌరవ న్యాయస్థానాల ఆదేశాల మేరకు నడుచుకుంటాను. ఎందుకంటే నేను చట్టాని, న్యాయస్థానాన్ని గౌరవిస్తాను మరియు నేను ఎటువంటి తప్పు చేయలేదు, ఎవ్వరికి భయపడను. ఇంత బలంగా ఎందుకు చెబుతున్ననంటే మీరు వ్యక్తీ గతంగా ఆ కేసుపై SB ద్వారా గాని, ఇంటలిజెన్స్ ద్వారా గాని, లేదా ఒక కమిటి వేసి (EOW లోని అధికారులు కాకుండా) ఆ కేసుతో ప్రమేయమున్నటువంటి నిందితులను మరియు బాదితులను సరిగ్గా విచారించి, అటు నిందితులు గాని మరియు బాదితులు గాని కొత్త జయపాల్ రెడ్డి అనే నాకు సంబంధం ఉందని చెబితే, నేను ఏశిక్షకైనా సిద్దం. EOW టీంలోని అధికారులను ఎందుకు వద్దు అనగా EOW టీంలో పనిచేస్తున్న ఒక DSP స్థాయి అధికారి మరియు హుస్నాబాద్ లో పనిచేస్తున్న ఒక ACP స్థాయి అధికారి వీరు ఇద్దరు ప్రాణ స్నేహితులు. నాకు మరియు హుస్నాబాద్ లో ఉన్న ACP స్థాయి అధికారికి ఒక విషయంలో వ్యక్తిగత బేధాబిప్రాయలున్నాయి. కావున ఆ అధికారి సూచన మేరకే ఈ EOW టీంలో ఉన్న DSP స్థాయి అధికారి నాపై తప్పుడు కేసులు పెట్టినారు. ఇంకా కొన్ని తప్పుడు కేసులు పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి ఎన్ని తప్పుడు కేసులు, కుట్రలకు ప్రయత్నించిన నేను భయపడే ప్రసక్తేలేదు. ఎందుకంటే చట్టాలన్న, న్యాయస్థానలన్న, న్యాయముర్తులన్న పూర్తీ స్థాయి నమ్మకం ఉంది. వాటి ద్వారానే నేను నా నిర్దోషితత్వాని నిరుపించుకుంటాను. కానీ ఇక్కడ నాదొక చిన్న విన్నపం ఏమనగా, EOW టీంలో పని చేస్తున్న ముగ్గురు ఉన్నత స్థాయిఅధికారుల ఆస్తులపై విచారణ జరిపించాల్సింది. నేను గత 20 సంవత్సరాలనుండి ప్రజలలో ఉంటూ ప్రజా సేవ చేస్తూ ఇటుక ఇటుక పేరుస్తూ సంఘంలో నేను పెంచుకున్న పేరు ప్రతిష్టలు మీ మూలన గాల్లో కలిసిపోయాయి. నాకు జరిగిన అవమానాన్ని, అప్రతిష్టను నేను ఎప్పుడు మరచిపోను. గత ప్రభుత్వం 91/2 సంవత్సరాల కాలంలో నామీద మీలాంటి అధికారుల ద్వారా ఎన్నో తప్పుడు కేసులు, కుట్రలకు ప్రయత్నించి, కొన్ని తప్పుడు కేసులు పెట్టినారు. వాటిని నేను న్యాయస్థానాల ద్వారా నా నిర్దోషితత్వాని నిరుపించుకుంటాను. ఇప్పటికి కూడా నాయొక్క అభిమానుల మీద కానీ, నా మిత్రులు మీద కానీ, నా మిత్రమండలి సభ్యుల మీద కానీ, నాపై కోపం పెట్టుకొని వారిలో ఏఒక్కరి పైన కానీ తప్పుడు, దురుద్దేశంతో, అన్యాయంగా కేసులు పెట్టిన వ్యక్తులపై & కేసు పెట్టడానికి కారకులైన అధికారులపై న్యాయస్థానం ద్వారా చట్ట బద్దంగా, చట్టరిత్యా తగు చర్యలు తీసుకోవడానికి, న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి నేను ఎప్పుడు ముందుంటాను. గౌరవ అభిషేక్ మహంతి IPS గారు, మీగురించి పలు దినపత్రికలో, పలు ఎలక్ట్రానిక్ మీడియాలో మీరు హీరో అని, మీరు భూకబ్జదారుల భరతం పడతారని, ఉక్కుపాదం మోపుతారని వ్రాస్తే మీ స్పందన ఒక రకంగా ఉంటుంది. అలా కాకుండా మీనుండి కానీ, మీ EOW టీం కానీ తెలిసి, తెలియక లేదా కావాలని కానీ ఎవరిపైననైన, తప్పుడు కేసులు పెడితే, అట్టి విషయాన్నీ ఏదైనా ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఎత్తి చూపే ప్రయత్నం చేస్తే, అటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలపై కక్ష కట్టి నోటీసులు పంపిస్తారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలు 4th ఎస్టేట్, సమాజంలో ఎవరు తప్పు చేసినా, ఒప్పు చేసినా, మంచి చేసినా, చెడు చేసినా ఎత్తి చూపడమే వాటి ధర్మం. అలాంటి 4th ఎస్టేట్ ను కూడా మీరు నియంతలా పరిపాలిస్తూ ఒక రాచరిక వ్యవస్థలోని రాజులా కంట్రోల్ చేయాలనుకోవటం, మీరు చేస్తున్న అతి పెద్ద పొరపాటు. ఎందుకంటే ఇది తెలంగాణా, కమీషనర్ గారు, అందులో ఇది కరీంనగర్ జిల్లా, ఉద్యమాల పోరుగడ్డ, నిజాం నవాబులకే ఎదురు తిరిగిన నిజమైన పోరు బిడ్డలం మేము. నేను తప్పు చేయనంతవరకు ఎవరికీ భయపడేది లేదు, తల వంచేది లేదు, తల దించేది లేదు. ఈ బహిరంగ లేఖ ద్వారా మీతో ఇంకొన్ని విషయాలు చర్చించాలనుకుంటున్నాను. మీకు రాజకీయ నాయకులంటే చాల చులకన భావం అనే విషయం మీ డిపార్టుమెంటు నుండి మొదలుకొని సామాన్య ప్రజల వరకు కూడా తెలిసిన బహిరంగ రహస్యం. ఒక సర్పంచ్ గ, ఒక MPTC గ, ఒక ZPTC గ, ఒక MLA గ, ఒక MP గా పోటిచేయాలంటే డబ్బులు ఉన్న లేకున్న ఆరోగ్యం సహకరించిన సహకరింకపోయన తన కుటుంబంలో ఆర్థిక పరంగాగాని, మానసిక పరంగా గాని ఎన్ని ఇబ్బందులు ఉన్నా నిత్యం ప్రజలకు సేవ చేస్తూ వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తూ,24 గంటలు పని చేస్తూ ఉండే వాళ్ళే రాజకీయ నాయకులు. కానీ అదే మీకు ఒక సర్పంచ్ గారు అన్న, ఒక MPTC గారు అన్న, ఒక ZPTC గారు అన్న, ఒక MLA గారు అన్న, ఒక MP గారు అన్న, ఒక మంత్రి గారు అన్న చాలా చులకన భావం ఉందనేది కరీంనగర్ లోని ప్రతి రాజకీయ నాయకునికి తెలిసిన విషయమే. ఇది వాస్తవం అవునా కదా? అనేది మీరే మీ ఆత్మ సాక్షిగా ఆలోచించుకోండి. అందుకు సంబందించిన ఒక సంఘటన, ఇటివలి కాలంలో మీకు పాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు క్యాబినెట్ మంత్రులు ఎదో ఒక విషయం గురించి మీకు ఫోన్ చేస్తే వాళ్ళను కూడా మీరు అవమానపరినట్లు జిల్లాలో హాట్ టాపిక్. ఇక నా విషయానికస్తే, నామీద మీ దగ్గరకు పిర్యాదు వచ్చినపుడు కనీసం మీ డిపార్టుమెంటు లోని కానిస్టేబుల్ నుండి కూడా ఎంక్వయిరీ నిమిత్తమై ఒక ఫోన్ కాల్ కూడా రాలేదు. 24 x 7 అందుబాటులో ఉండే నా మొబైల్ ఫోన్ కి ఒక కాల్ కూడా చేయకుండా, నా తరపున వాదనలు వినకుండ, మీ EOW టీంలోని ఒక అధికారి నామీద పగ బట్టి FIR నమోదు చేసినాడు. మీ EOW టీంలోని అ ఒక అధికారి అలా చేయటానికి గల కారణాలు పైన వివరించడమైనది. గౌరవ అభిషేక్ మహంతి IPS గారు, మీరు నామీద వ్యక్తిగతంగా కక్ష్య పెట్టుకొని లేదా ఎవరి చెప్పుడు మాటలు విని కానీ తప్పుడు కేసులు పెట్టాలనుకుంటే నాకు కరీంనగర్ లో ఇల్లు, ఆఫీస్, గెస్ట్ హౌస్ లు, ఈ మూడు కూడా 24 X 7 తెరిచే ఉంటాయి. నేను ఇప్పుడు ఎలాగు ఇండియాలో లేను కనుక ఇదే సమయంలో మీరే డ్రగ్స్, తుపాకులు, బాంబులు, దొంగ నోట్లు నా ఇల్లు, ఆఫీస్, గెస్ట్ హౌస్ లలో పెట్టించి కూడా నాపై కేసు పెట్టగల పవర్ మీవద్ద ఉంది. ఈ విషయం మీకు ఎందుకు చేపుతున్ననంటే, గతంలో జరిగిన నాకు జరిగిన ఒక బాధకరమైన సంఘటనకు సంబందించిన వీడియో పుటేజిలు ఈ బహిరంగ లేఖ ద్వారా మీకు పంపిస్తున్నాను. కరీంనగర్ జిల్లాలోని 50 సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉన్నటువంటిది కరీంనగర్ రిక్రియేషన్ క్లబ్. ఈ క్లబ్ కు 50 సంవత్సరాల నుండి కూడా సంప్రదాయంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు చైర్మెన్ గా ఉంటారు, ఉంటున్నారు, కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఏర్పాటు కాకముందు గౌరవ SP గారు వైస్ చైర్మెన్ గా ఉండేవారు. పోలీస్ కమీషనర్ ఏర్పాటు అయిన తరువాత గౌరవ కమీషనర్ గారు వైస్ చైర్మెన్ గా ఉంటున్నారు. దీని సెక్రటరీని మరియు సభ్యులుగా ఎలక్షన్ ద్వారా కరీంనగర్ క్లబ్ లో సభ్యత్వం కల సభ్యులు ఎన్నుకుంటారు. ఇటీవల 26TH జనవరి, 2024 జెండా ఆవిష్కరణ కోసం సెక్రటరీ గారు మరియు సభ్యులు జెండా ఆవిష్కరణ కోసం గౌరవ జిల్లా కలెక్టర్ గారిని జెండా ఆవిష్కరణ కోసమని మరియు ప్రోటోకాల్ ప్రకారం వైస్ చైర్మెన్ అయినటువంటి గౌరవ CP గారిని గౌరవ అతిదిగా రమ్మని ప్రతి సంవత్సరం ఎలా ఆహ్వానిస్తారో అదేవిదంగా ఈ సంవత్సరం కూడా జెండా ఆవిష్కరణకు మిమల్ని ఆహ్వానించడానికి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఆహ్వానిస్తే, మీరు ఏమన్నారో ఒకసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. అ సంఘటనతో కూడా మీ మనస్తత్వాన్ని అర్ధం చేసుకోవచ్చు. అంతేకాకుండా గౌరవ సుప్రీమ్ కోర్ట్ ఆదేశాల ప్రకారం 13 కార్డ్స్ అడుకోవచ్చని ఉన్న మీరు పగ బట్టి మరుసటి రోజు ఉదయం క్లబ్ కి ఒక CI గారిని పంపించి క్లబ్ లో వినోదం కోసం ఆడే కార్డ్స్ గేమ్ ఆడితే అరెస్టు చేస్తామని అ CI గారు బెదిరించిన మాట వాస్తవం కదా? ఇలా ఎందుకు చేశారో మీ అంతరాత్మకే తెలియాలి. ఈ మద్య కాలంలో ఒక వార్త చానల్లో మీకు వ్యతిరేకంగా ఒక వార్త వస్తుందని తెలుసుకొని, అట్టి వార్త రాకుండా అదే CI గారి ద్వారా ఆ వార్త చానల్ వారిని బెదిరించిన మాట వాస్తవం కదా? తమరు ఒక విషయం గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే ఇప్పుడున్నటువంటి కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ విస్తీర్ణం గతంలో ఉన్న ఒక డిప్యూటీ సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ స్థాయి అధికారి విస్తీర్ణం కంటె తక్కువ. గతంలో లాగా జిల్లాలో నక్సల్స్ సమస్యలు కానీ మత కల్లోలాల సమస్యలు కూడా లేవు. ఇటువంటి సమయంలో తమరు జిల్లాలో ఉన్న సామాన్య ప్రజానికానికి అవసరమైన ముఖ్యమైన సమస్యలపై దృష్టి పెట్టకుండా కేవలం మీ వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడం కోసమే ఒకే ఒక భూ మాఫియా అనే అంశంపై అదికూడా అన్ని న్యాయస్థానాల్లో పెండింగ్ లో ఉన్న సివిల్ కేసులపై మాత్రమే దృష్టి సారించినారు. మీరు విదుల్లో జాయిన్ అయినప్పటినుండి నేటి వరకు అనగా తేది 15-06-2024 వరకు భూ మాఫియా కు సంబందించినవి కాకుండా వేరే ఎఒక్క కేసు అయినా బుక్ చేసినారా, చేయించినారా? ఇది ఎంత వరకు సమజసం, మీ అంతరాత్మకే తెలియాలి? నాకు అర్ధం కానీ విషయం ఏమిటంటే మీరు తప్పు త్రోవలో వెళ్తున్నారా? లేక మీ క్రింద పనిచేస్తున్న నలుగురు అధికారులు మిమ్మల్ని తప్పు త్రోవ పట్టిస్తున్నారా? నాకు తెలియటం లేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ సాదారణ ఎలక్షన్ లో ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా నిభందనల ప్రకారం ఎలక్షన్ కోడ్ సమయంలో ఆయుద అనుమతి ఉన్న ప్రైవేటు వ్యక్తులు నియమాల ప్రకారం ఎలక్షన్ కోడ్ ముగిసే వరకు వాళ్ళ ఆయుదాలను ఆయ సంబంధిత పోలీస్ స్టేషన్ లో విధిగా డిపాజిట్ చేయవలెను. అలాగే అందరు డిపాజిట్ చేసినారు. అలాగే ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే అనగా జూన్ 6th న ముగియటం జరిగింది. కానీ మీరు ఇప్పటికి కూడా ఆయుదాలు డిపాజిట్ చేసిన సామాన్య ప్రజానికానికి, మరియు ప్రస్తుత MLA లకు, మాజీ మంత్రి వర్యులకు, మాజీ కాబినెట్ ర్యాంక్ కలిగి ఉన్న మాజీ MLA లకు కూడా అట్టి ఆయుదాలు తిరిగి ఇవ్వటంలేదు. దీన్ని బట్టి మీరు మనస్తత్వం ఎంటో అర్దమవుతుంది. ఒక వ్యక్తీకి ప్రభుత్వం ఆయుదం ఇచ్చిందంటే, అతని ఏదైనా ఒక ప్రాణ హాని ఉందని, మీ డిపార్టుమెంటు వారు ఎంక్వయిరీ చేసి రిపోర్ట్ ఇస్తేనే, ప్రభుత్వం అట్టి వ్యక్తికీ ఆయుదం కలిగి ఉండటానికి అనుమతి ఇస్తుంది. అటువంటి వాటికీ కూడా ఎలక్షన్ కోడ్ ముగిసిన కూడా వారి ఆయుదాలు వారికీ తిరిగి ఎందుకు ఇవ్వటం లేదు? వారందరికి ఏమైనా ప్రాణా నష్టం గాని, ఆస్తి నష్టం గాని, ఇతరత్ర నష్టం గాని జరిగిన మీరు భాద్యత వహిస్తారా? ఈ విషయం మీరు పత్రిక ముఖంగా తెలియజేస్తారా? IPS ఆఫీసర్ అయిన మీరు కూడా ప్రభుత్వంలో ఒక బాగం మాత్రమే. మీరు ప్రజలకు రక్షణ కల్పించి అటు ప్రభుత్వానికి ఇటు మీ IPS వృత్తికి మంచి పేరు తేవలసిన మీరు కేవలం మీరు హీరో అనిపించుకోదనికే ఈలా చేస్తునట్లు నాకు అనిపిస్తుంది. సమాజంలో అత్యున్నత ప్రమాణాలు కలిగి ఉన్న IAS, IPS, IFS, IRS అధికారుల పట్ల ప్రజలకు, నాయకులకు, నాకు ఎనలేని గౌరవం. ఉదాహణకు మీ డిపార్టుమెంటు లోని కొందరు.. గౌరవ సురేంద్ర బాబు IPS గారు, సజ్జనార్ IPS గారు, ఉమేష్ చంద్ర IPS గారు, తరుణ్ జోషి IPS గారు, కమలహాసన్ రెడ్డి IPS గార్లు ఏవిదంగా సమర్థవంతంగా విధులు నిర్వర్తించి ప్రజల చేత, ప్రభుత్వం చేత మరియు మీ డిపార్టుమెంటు చేత మన్ననలు పొందారో మీరు ఆత్మ పరిశీలన చేసుకొమ్మని నా విన్నపం. మీరు వృత్తిపరంగా హుందాగా నడుచుకోవాలనేది నా అభిప్రాయం. కానీ మీరు కొందరి మీద పని కట్టుకొని కసి పెట్టుకొని, పగ పెట్టుకొని కేసులు ఎట్లా పెట్టాలలో చుస్తున్నారని నా కనిపిస్తుంది. నేను మీకు ఈ బహిరంగ లేఖ వ్రాసినందుకు గాను మీరు నామీద మీ క్రింది పనిచేస్తున్న నలుగురి అధికారుల ద్వారా ఇంకా కేసులు పెడుతారని తెలిసి కూడా ఈ బహిరంగ లేఖ వ్రాస్తున్నాను. పౌరుషాల తెలంగాణా గడ్డపై కరీంనగర్ జిల్లాలో పుట్టిన నేను ఎతప్పు చేయలేదు. చేయను. తప్పు చేయనప్పుడు నేను ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు. నా మనస్సును, నా ఆత్మ చంపుకొని బ్రతకలేను. దానికంటే చావటం మేలు నేను భావిస్తాను. నేను ఇప్పటివరకు భాద్యతగా చొప్పదండి నియోజకవర్గంలో కానీ కరీంనగర్ నియోజకవర్గంలో కానీ కనీసం 2,000 నుండి 3,000 మందికి వరకు అందులో సామాన్య ప్రజలకు, నన్ను నమ్ముకున్న కార్యకర్తలకు, నా అనుచరులకు, విద్య పరంగా గాని, వైద్య పరంగా గాని, కొందరి పేద ప్రజలకు ఇల్లు కట్టించడం గాని, కొందరు చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను అదుకోవటంలో గని నా వంతు సహాయం చేసానని నేను గర్వంగా చెప్పగలుగుతాను. గౌరవ భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారా మండల ప్రజా పరిషత్ అధ్యక్షునిపై అవిశ్వాస తీర్మానం పెట్టె హక్కు కలదు. నేను గతంలో 91/2 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చొప్పదండి నియోజకవర్గంలో ఉన్నటువంటి చొప్పదండి పట్టణ మండల ప్రజా పరిషత్ (MPP) అధ్యక్షుడైన శ్రీ గుర్రం భూమ రెడ్డి గారిపైన 41/2 సంవత్సరాల తరువాత చట్టబద్ధంగా అవిశ్వాస తీర్మానం పెట్టడానికై గౌరవ 16 MPTC లలో నా మద్దతుదారులైన గౌరవ 13 మంది MPTC ల ద్వారా గౌరవ RDO ద్వారా అక్టోబర్ 2018 సంవత్సరంలో నోటీసులు పంపించబడినది. అప్పడు అధికారంలో ఉన్న TRS మంది MPTC లు నాయొక్క మిత్రుడి గెస్ట్ హౌస్ లో క్యాంపుగా ఉంటె, అప్పటి అదికార TRS పార్టీ MLAలు,MPలు, మంత్రులందరూ కలిసి ఆ అవిశ్వాస తీర్మానం ఎలాగైనా విగిపోయేలా చేయాలనీ, అధికారాన్ని దుర్వినియోగంచేసి పోలిసుల ద్వారా క్యాంపులో ఉన్నటువంటి 13 మంది MPTC లలో ఒక MPTC భార్య ద్వారా అప్పుడు అధికారంలో ఉన్న TRS పార్టీలోని కొందరు పెద్ద మనుషులు డబ్బులకు మభ్యపెట్టి, నాపై ఒక తప్పుడు పిర్యాదు కేసు కొతపల్లి పోలీస్ స్టేషన్ చేయించినారు. అ పిర్యాదు ఏమనగా కొత్త జయపాల్ రెడ్డి అనే వ్యక్తీ ఆమె భర్తను మరియు ఇతర MPTC లను తీసుకెళ్ళి బెదిరించి వాళ్ళ సెల్ ఫోన్లు గుంజుకొని, కాలి బాండ్ పేపర్లు మరియు ప్రామిసరీ నోట్లు వ్రాయించుకొని అట్టి అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపాలని బెదిరించినాడని పిర్యాదు వ్రాయించి, అప్పటికప్పుడే అప్పటి SHO, స్వరూప్ రాజ్ గారు FIR No.332/2018 dt.01-11-2018 గా నమోదుచేసినారు. నేను ఎక్కడైతే 13 మంది MPTC లతో క్యాంపు వేసుకొని ఉన్నామో, అక్కడ అప్పటి అదికార TRS పార్టీ MLAలు పోలిసులచేత దాడి చేయిస్తే, అక్కడ ఉన్న 13 మంది MPTC లు ఎదురు తిరిగితే, అక్కడి నుండి పిర్యాదు చేసిన మహిళ యొక్క భర్తను బలవంతంగా ఎత్తుకెళ్ళారు. ఆనాటి కరీంనగర్ కొతపల్లి శివారులోని నాయొక్క మిత్రుడి గెస్ట్ హౌస్ ను నా గెస్ట్ హౌస్ అనుకోని కొతపల్లి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుల్ లు సివిల్ యునిఫాంలో వచ్చి వారే సెల్ ఫోన్లు, కాలి బాండ్ పేపర్లు మరియు ప్రామిసరీ నోట్లు తీసుకొచ్చి అ గెస్ట్ హౌస్ లో కల బెడ్ క్రింద పెట్టి మళ్ళి బెడ్ ను మూసేసి వెళ్లి, 5 నిమిషాల తరువాత మళ్ళీ వచ్చి ఆ బెడ్ క్రింద వాళ్ళే పెట్టినటువంటి సెల్ ఫోన్లు, కాలి బాండ్ పేపర్లు మరియు ప్రామిసరీ నోట్లను అక్కడినుండి స్వాధీన పరచుకున్నామని చూపించి నాపై తప్పుడు కేసు పెట్టినారు. కానీ అట్టి తప్పుడు సాక్ష్యం సృష్టించింది పొలీసులే అని రుజువు పరిచే సాక్ష్యం ఆ గెస్ట్ హౌస్ లో గల CC ఫుటేజిలో రికార్డు కాబడినది. దీనిని బట్టి గత 92 సంవత్సరాలుగా అదికార TRS పార్టీ నాయకులు నాపైన ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన అట్టి అవమానాలని, బాధల్ని భరిస్తూ వచ్చానే కాని పొలిసు వారు సృష్టించిన తప్పుడు సాక్ష్యాలు, వీడియోలా రూపంలో నా వద్ద ఉన్న కానీ పోలీసు డిపార్టుమెంటు పై నాకున్న గౌరవంతో వారికీ చెడ్డ పేరు రాకూడదని ఒకే ఒక్క ఉద్దేశంతో ఇన్ని రోజులు నా వద్ద వీడియోలా రూపంలో ఉన్న సాక్ష్యాలను బహిరంగ పరచలేదు. కానీ నేడు మీమూలంగా నేను చేయని తప్పుకు నన్ను దోషిగా చూస్తున్నందుకు బాధతో నా వద్ద ఉన్న పొలిసు వాళ్లు తప్పుగా సృష్టించిన సాక్ష్యాలను వీడియో రూపంలో బహిరంగ పరుస్తున్నాను. ఈలాంటి సాక్షాలు నా వద్ద అనేకం ఉన్నాయి. ఇప్పుడు మచ్చుకు ఒకటి మాత్రమే పంపిస్తున్నాను. అలాగే నా స్వంత గ్రామం లక్ష్మిదేవిపల్లి లో అప్పాల వీరయ్య అనే పేద రైతు VS కర్ర జగన్ మోహన్ రెడ్డి (TRS నాయకుడు) అనే ఒక అగ్ర కుల పెద్ద రైతు మద్య ఒక భూ సమస్య ఏర్పడింది. ఆ పేద రైతు భూమి కాజేయాలనే ప్రయత్నంలో, ఈ పెద్ద రైతు అక్కడి MRO గారితో కుమ్మకై, నిబందనలకు విరుద్ధంగా కోవిడ్-లాక్ డౌన్ సమయంలో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే, అట్టి భూమి వద్దకు ఇద్దరు గంగాధర, రామడుగు MRO గార్లు రావలసిఉండగా, కేవలం రామడుగు MRO గారు వచ్చి సర్వే చేయడానికి ప్రయత్నించగా, ఆ పేద రైతు నాకు ఫోన్ ద్వారా అట్టి విషయాన్నీ చెప్పగా, నేను కరీంనగర్ నుండి వెంటనే వెళ్లి అక్కడ ఉన్న రామడుగు MRO గారిని ఆ భూ సమస్య ప్రశ్నించగా, అదికార TRS పార్టీకి చెందిన నాయకులు, నేను రామడుగు MRO గారి విదులకు ఆటంకం కలిగించానని తప్పుడుగా నాపై రామడుగు MRO గారి చేత కేసు పెట్టించినారు. తిరిగి 6 నెలల తరువాత అదే రామడుగు MRO గారు న్యాయస్థానానికి వెళ్లి అది తప్పుగా పెట్టిన కేసు అని తెలిపి న్యాయస్థానం నుండి అట్టి కేసును ఉపసంహరించుకున్నాడు. దీనిని బట్టి కూడా అప్పటి అదికార TRS పార్టీ నాయకులు నాపైన ఎన్ని కుట్రలు చేసారో మీరు అర్ధం చేసుకోవచ్చు. ఇలా గత 10 సంవత్సరాలుగా నేను ప్రజల పక్షాన సమస్యల పరిష్కారానికి పోరాడితే నాపై గత అదికార పార్టీ నాయకులు, ప్రస్తుత అదికార పార్టీ నాయకులు పొలిసు అధికారులచేత నాపై కుట్రలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం మీరు కూడా అదే కుట్రలు చేస్తూన్నారని నేను భావిస్తున్నాను. అయినప్పటికీ నేను ఆత్మ విశ్వాసంతో ప్రజల పక్షాన వారి సమస్యల పరిష్కారానికై పోరాడుతూనే ఉంటాను. నేను ఎలాంటి తప్పు చేయలేదు, చెయ్యను, ఎవ్వరికి లొంగను, ఎవ్వరికీ భయపడను. నేను ఒక మంచి ఆలోచనతో నాకు జరిగిన నష్టాలను, కలిగిన కష్టాలను మీకు ఈ పైన బహిరంగ లేఖ ద్వారా ఆదారాలతో తెలియపర్చనైనది. మీరు మనస్పూర్తిగా ఒకసారి నాగురించి నిజా నిజాలు తెలుసుకుంటారని నా మనవి. మీకు వీలైతే మీరు పెట్టించిన, గతంలో నాపై ఉన్న అన్ని కేసుల మీద మళ్ళీ ఒక్కసారి నిజనిర్ధారణ కమిటి వేసి నిజా నిజాలు తెలుసుకోగలరని నాయొక్క మనవి.
ఇట్లు,
కొత్త జయపాల్ రెడ్డి,
చైర్మెన్ మైత్రి గ్రూప్,
S/o సత్యనారాయణ రెడ్డి R/o
లక్ష్మిదేవిపల్లి గ్రామం,
గంగాధర మండలం,
కరీంనగర్ జిల్లా,
మొబైల్ నంబర్ +91 98491 88880
MAIL ID: kothajaipal@yahoo.co.in