రాష్ట్రమంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు కేవలం తెలంగాణ నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి కూడా ట్విట్ చేస్తున్నారు. తమకు సాయం చేయాలని కోరుతూ మహారాష్ట్ర రైతులు ట్విట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మహారాష్ట్రలోని మేడిగడ్డ బ్యారేజ్ బాధితులు కొత్త పంథా ఎంచుకున్నారు. తమకు ఇచ్చే ఆర్థిక సాయం వెంటనే విడుదల చేయాలంటూ ట్విట్టర్ వేదికగా వేడుకుంటున్నారు. ఇప్పటి వరకు మహారాష్ట్ర నేతలకే తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ట్విట్ చేసిన మేడిగడ్డ బాధితులు ఇప్పుడు తెలంగాణ మంత్రి కేటీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నష్టపోయిన సిరొంచ తాలుకా రైతులకు ఇవ్వవలసిన రూ. 26 కోట్లు వెంటనే పంపించాలని ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వానికి రాసిందని, ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం మాత్రం డబ్బులు పంపించడం లేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ మెసేజ్ కు రెస్పాండ్ కావాలని కూడా కోరారు. కొత్తగా మేడిగడ్డ బాధిత రైతులు కేటీఆర్ కు ట్విట్టర్ ద్వారా వినతులు పంపుతుండడం చర్చకు దారితీస్తోంది.