దిశ దశ, కరీంనగర్:
రేకుర్తి శివార్లలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన భూములతో పాటు, ప్ఱభుత్వ భూములు కూడా దురాక్రామణలకు గురయ్యాయని వీటిపై చర్యలు తీసుకోవాలని ప్రజా దర్బార్ లో ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన దుర్గం మనోహర్ శుక్రవారం హైదరాబాద్ ప్రజా దర్బార్ లో చేసిన ఫిర్యాదు మేరకు గతంలో కబ్జాలకు సంబంధించిన విషయంలో ఎస్సారెస్పీ అధికారులు నోటీసులు జారీ చేసినా పట్టించుకోలేదన్నారు. ఎస్సారెస్పీ కెనాల్ డి94ను ఆనుకుని ఉన్న సర్వే నెంబర్ 52లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎనగందుల రవిందర్ గౌడ్ ఆక్రమించుకుని ఇంటిని నిర్మించుకున్నారని మనోహర్ ఆరోపించారు. ఈ భూమి విషయంలో మునిసిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఆకారపు నవీన్, రేకుర్తి విద్యుత్ లైన్ మెన్ ఆరెపల్లి రామయ్యలు కుమ్మక్కై ఎస్సారెస్పీ కెనాల్ భూమిలో దౌర్జన్యంగా ఇంటి నిర్మాణం చేశారని ఆ ఫిర్యాదులో వివరించారు. ఈ సమాచారం అందుకున్న ఎస్సారెస్పీ అధికారులు కూడా రంగంలోకి దిగి కొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. అయితే ఈ విషయంలో జోక్యం చేసుకున్న కార్పోరేటర్ మాధవి భర్త సుదగోని కృష్ణగౌడ్ అతని అనుచరులు ఎస్సారెస్సీ అధికారులపైనే ఆగ్రహం వ్యక్తం చేశారని దుర్గం మనోహర్ వివరించారు. ఈ విషయంపై ప్రత్యేక చొరవ తీసుకుని విచారణ జరపాలని ఆయన ఆ ఫిర్యాదులో కోరారు. మరోవైపున రేకుర్తి శివార్లలోని 55 సర్వే నెంబర్ లో గల ప్రభుత్వ భూమిలో కార్పోరేటర్ భర్త సుదగోని కృష్ణ గౌడ్, కొత్తపల్లి తహసీల్దార్ గా పని చేసిన చిల్ల శ్రీనివాస్ లు ఆక్రమించుకున్నారని దుర్గం మనోహర్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంటికి సంబంధించిన రుసుము చెల్లించినట్టుగా నకిలీ రశీదులను కూడా తయారు చేశారని, ఖాళీ స్థలంలో ఇంటి నెంబర్లను కూడా ఇప్పించారని మారుతి వివరించారు. ఈ ఆక్రమణలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఈ వినతి పత్రంలో కోరాడు.