ఏడు దశాబ్దాలకు పైగా భారత పార్లమెంటరీ వ్యవస్థను అక్కున చేర్చుకున్న ఈ భవనం చరిత్ర పుటలకే పరిమితం కానుంది. ఇంతకాలం ఎంతో మంది జాతీయ నేతలు హాడావుడి చేసిన ఆ భవనం ముగిసిన అధ్యాయం లాంటిది కానుంది. 2023లో ఆ భవనం స్థానాన్ని కొత్త బిల్డింగ్ ఆక్రమించుకోనుంది. ఇంతకీ భవనం గురించి తెలుసా..?
బ్రిటీష్ కాలం నాటి బంగ్లా…
బ్రిటీష్ పాలకులు నిర్మించిన భారత పార్లమెంట్ భవన్ ను Edwin Lutyens 1912, 13 సంవత్సరంలో డిజైన్ చేయగా 1921 నిర్మాణం ప్రారంభించి 1927లో పూర్తి చేశారు. 1927 జనవరి 19న సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మూడో సమావేశం నిర్మించిన ఈ భవనాన్ని పరిశ్రమలు, కార్మిక శాఖ ఇంఛార్జి, గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు భూపేంద్రనాథ్ మిత్ర లార్డ్ ఇర్విన్ వైస్రాయ్ ని లండన్ నుండి ఆహ్వనించి ఈ భవనాన్ని ప్రారంభించారు. మోరెనాలోని చౌసత్ దేవాలయం నమూనాలో ఈ భవానాన్ని నిర్మించినట్టుగా చెప్తున్నారు. భారత పార్లమెంటరీ వ్యవస్థ ప్రారభం అయిన తరువాత నుండి ఇప్పటి వరకు ఇందులోనే ఉభయ సభలు నడుస్తున్నాయి. సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కోసం ఉపయోగించిన భవనంలో ప్రస్తుతం లోకసభ, స్టేట్ కౌన్సిల్ నిర్వహించిన భవనంలో రాజ్యసభ, ఛాంబర్ ఆప్ ప్రిన్సెస్ సెషన్స్ కోసం నిర్మించిన చోట లైబ్రరీ నిర్వహిస్తున్నారు కొత్త పార్లమెంటు భవనం ప్రారంభమైన తర్వాత ఈ భవనాన్ని మ్యూజియం ఆఫ్ డెమోక్రసీగా మార్చాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి.
చివరి సమావేశాలు…
సుదీర్ఘ కాలం బ్రిటీష్ పాలకులకు, స్వతంత్ర్య భారతావనికి సేవలందించిన పార్లమెంట్ భవనంలో ఈ డిసెంబర్ లో జరగనున్న శీతాకాల సమావేశాలు చివరివి కానున్నాయి. డిసెంబర్ మొదటి వారంలో జరగనున్న ఈ సమావేశాలు చివరి వరకూ కొనసాగుతాయని అధికారులు తెలిపారు. పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నిర్ణయం తరువాత ఏ తేది నుండి ఏ తేది వరకు సెషన్స్ నిర్వహిస్తారో ఫైనల్ కానుందని సమాచారం. ఈ శీతాకాల సమావేశాలు రూ.1,200 కోట్లకు పైగా అంచనా వ్యయంతో నిర్మిస్తున్న నూతన భవనంలో నిర్వహించాలన్న లక్ష్యంతో ముందుకు సాగినప్పటికీ కొన్ని నిర్మాణాలు ఇంకా పూర్తి కాకపోవడంతో పాత భవనంలోనే కొనసాగించాలని నిర్ణయించినట్టు అధికారవర్గాలు తెలిపాయి.
2023కి సిద్దం…
నూతన పార్లమెంట్ భవనాన్ని ఈ డిసెంబర్ లోనే ప్రారంభించాలన్న యోచనతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను కూడా ఆదేశించారు. తుది మెరుగులు దిద్దుకున్న తరువాత కొత్త పార్లమెంట్ భవనంలో 2023 బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. శతాబ్దానికి పైగా సేవలందించిన పాత పార్లమెంట్ భవనం నుండి కొత్త భవనంలోకి వచ్చే బడ్జెట్ సెషన్స్ కొనసాగించే విధంగా కార్యాచరణ రూపొందించిన అధికారులు ఇందుకు అనుగుణంగా పనులు చేపడుతున్నారు. లోకసభ, రాజ్యసభలతో పాటు ఇతరాత్ర భవనాలను ముస్తాబు చేసే విధంగా ముందుకు సాగుతున్నారు.
పాత భవనంలో వాటికి చెల్లు…
భారత పార్లమెంటరీ వ్యవస్థలో మరో కీలక ఘట్టానికి పాత భవనం వేదిక కానుంది. ఈ భవనంలో కాలం చెల్లిన చట్టాలకు చెల్లుచీటి పలకాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. భారత దేశంలో అమల్లో ఉన్న కొన్ని చట్టాలకు కాలం చెల్లిందని గుర్తించి వాటిని రద్దు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. 1500కు పైగా కాలం చెల్లిన పురాతన చట్టాలను కేంద్రం రద్దు చేయనుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు ఇప్పటికే ప్రకటించారు. ఏ భవనంలో అయితే చట్టాలు రూపు దిద్దుకున్నాయో అదే భవనంలో వాటికి చరమ గీతం పాడుతుండడం గమనార్హం. భవనం ప్రారంభించడమూ ఓ చరిత్ర అయితే అదే భవనంలో 1500 చట్టాలూ రద్దు అవుతుండడం పాత భవనం పేరిట ఉండే మరో రికార్డనే చెప్పాలి. చివరి సారి ఉభయ సభలకు సేవలందిస్తున్న ఈ భవనం మ్యూజియంగా మారనున్నందున రద్దయిన చట్టాల చరిత్రను తనలోనే ఒడిసిపట్టుకోనుంది.