నేపాలో లో వరస విమాన ప్రమాదాలు
నేపాల్ లో వరస విమాన ప్రమాదాలు ప్రయాణీకులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తరుచూ ఈ దేశంలో ఎయిర్ క్రాఫ్ట్ క్రాషెస్ జరుగుతుండడం అంతర్జాతీయంగా చర్చకు దారి తీస్తోంది. 2010 నుండి ఇప్పటి వరకు ఆ దేశంలో జరిగిన ప్రమాదాలే ఇందుకు ప్రధాన కారణమని చెప్పాలి. విమాన ప్రమాదాలు సాంకేతిక పరమైన ఇబ్బందులతో తలెత్తుతున్నాయా, యాధృచ్చికంగా జరుగుతున్నాయా అన్న విషయంపై తర్జన భర్జనలు సాగుతున్నాయి. ఒకే దేశంలో వరసగా జరుగుతున్న ఈ ప్రమాదాలతో అక్కడ మరణ మృదంగం పాడుతోంది. నేపాల్ దేశంలో సాగుతున్న యాక్సిడెంట్ల తీరుపై సునిశితమైన విచారణ జరిగితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా నేపాల్ ఎయిర్ క్రాఫ్ట్ క్రాషెస్ ఘటనలు అందరి దృష్టిని ఆ దేశం వైపు తిప్పుతున్నాయి.
ప్రమాదాల వివరాలివే…
2010 నుండి గత 12 ఏండ్లలో 11 విమాన ప్రమాదాలు జరగగా వందాలది మంది మృత్యువు ఒడిలో చేరిపోయినట్టు రికార్డులు చెప్తున్నాయి. 2010 ఆగస్టు 24న నేపాల్ రాజధాని ఖాట్మండు వద్ద అగ్ని ప్లేన్ కుప్పకూలగా ఇందులో అమెరికాకు చెందిన వారు నలుగురు, జపాన్, బ్రిటిషర్ దేశస్థుడు ఒకరు చొప్పున మరణించగా ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ లో మొత్తం 14 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రతికూల వాతావరణం కారణంగానే ఈ విమానం ప్రమాదానికి గురైందని అధికారులు ప్రకటించారు. 2010 డిసెంబర్ 15న తూర్పు నేపాల్‌లో విమానం కూలడంతో 22 మంది చనిపోయారు. ఈ ఫ్లైట్ లో భూటాన్ దేశానికి చెందిన యాత్రికులతో పాటు ఒక అమెరికన్ కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. 2011 సెప్టెంబర్ 25న ఎవరెస్ట్ శిఖరం సమీపంలో విహారయాత్ర కోసం 19 మందితో బయలుదేరిన విమానం నేపాల్ రాజధాని ఖాట్మండు సమీపంలోని కొండలపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని మొత్తం 19 మంది ప్రాణాలు కోల్పోయారు. 2012 మే 14న 21 మంది ప్రయాణికులతో వెళ్తున్న అగ్ని ఎరోప్లేన్ ఉత్తర నేపాల్‌లో అత్యంత ఎత్తయిన ప్రాంతమైన జామ్సన్ ఎయిర్‌పోర్టు సమీపంలో కుప్పకూలగా, ఈ ఘటనలో 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆరుగురు ప్రయాణీకులు ప్రాణాలతో బయటపడ్డారు.
2012 సెప్టెంబర్ 28న ఎవరెస్ట్ శిఖరాన్ని చూసేందుకు 19 మంది టూరిస్టులతో బయలుదేరిన విమానం నేపాల్ రాజధాని ఖాట్మండు శివార్లలో కాలిపోతూ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో బ్రిటిషర్స్ ఏడుగురు, చైనీయులు ఐదుగురితో సహా 19 మంది మృత్యువాతపడ్డారు. 2014 ఫిబ్రవరి 16న నేపాల్‌లోని అర్ఘఖంచి జిల్లాలో నేపాల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలడంతో 18 మంది చనిపోయారు. రెస్క్యూ సిబ్బంది గాలింపు చేపట్టినప్పుడు పర్వతాల్లో విమాన శకలాలు కనిపించాయి. 2016 ఫిబ్రవరి 24న తారా ఎయిర్ లైన్స్ నడిపించే ట్విన్ ఒట్టర్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యాగ్ది జిల్లాలో కూలిపోగా విమానంలోని 23 మంది చనిపోయారు. 2018 మార్చి 12న బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుండి బయలుదేరిన ఓ విమానం నేపాల్ రాజధాని ఖాట్మండులోని ఎయిర్‌పోర్టులో క్రాష్ ల్యాండ్ అవుతుండగానే మంటలు చెలరేగడంతో 51 మంది మరణించారు. 2019 ఏప్రిల్ 14న ఎవరెస్ట్ శిఖరం సమీపంలో చిన్న విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో రన్‌వే నుండి జారిపోయింది. దీంతో రన్‌వే పక్కనున్న రెండు హెలిక్యాప్టర్‌లను ఢీకొట్టడంతో ముగ్గురు మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 2022 మే 29న నేపాల్ క్యారియర్ అయిన తారా ఎయిర్ వేస్ నిర్వహించే ట్విన్ ఒట్టర్ విమానం పశ్చిమ నేపాల్‌లోని పొఖారా ఎయిర్‌పోర్టు నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోగ 22 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 2023 జనవరి 15న పొఖారా ఎయిర్ పోర్ట్ సమీపంలో యతి ఎయిర్ లైన్స్ కు చెందిన ఫైట్ క్రాష్ కావడంతో 68 మంది ప్రయాణీకులు, నలుగురు ఎయిర్ లైన్స్ సిబ్బంది మృత్యువాత పడ్డారు. ఘటనా స్థలం నుండి ఎవరినీ కూడా ప్రాణాలతో కాపడలేకపోయామని నేపాల్ ఆర్మీ అధికారి కృష్ణ ప్రసాద్ భండారి వెల్లడించారు. ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాల్లో అతి ఎక్కువ మందిని బలి తీసుకుంది మాత్రం ఆదివారం నాటి ప్రమాదం కాగా, 2018 మార్చి 12న జరిగిన ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ లో 51 మంది చనిపోయారు. తరుచూ ఫ్లైట్ యాక్సిడెంట్స్ నేపాల్ పరిసర ప్రాంతాల్లోనే జరుగుతుండడం చర్చనీయాంశంగా మారింది.