గరం గరం… కరీంనగరం…

టూరిజం స్పాట్ లో చెలరేగిన మంటలు…

డంప్ యార్డులో అర్థరాత్రి అసలేం జరిగింది..?

దిశ దశ, కరీంనగర్:

ర్యాటక కేంద్రంగా భాసిల్లాల్సిన కరీంనగరాన్ని అగ్ని కీలలు వెంటాడుతున్నాయి. నగరానికి శోభాయమానం తీసుకరావల్సిన నది తీరాన్ని మంటలు చుట్టు ముట్టేస్తున్నాయి. నగరానికి రాకపోకలు సాగించే ప్రధాన రహదారి పక్కనే ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలు ప్రయాణీకులను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఓ వైపున చంపుతున్న చలితో నగర ప్రజలు నిండా ముసుగేసుకుని నిద్రలోకి జారుకుంటే… డంప్ యార్డులో మంటల వల్ల విస్తరిస్తున్న పొగతో సమీప కాలనీ వాసులు అల్లాడిపోతున్నారు. టూరిజం స్పాట్ కాస్తా ఫైర్ జోన్ గా మారిపోయిందన్న ఆందోళన స్థానికంగా వ్యక్తం అవుతోంది.

డంప్ యార్డ్…

కరీంనగర్ మానేరు నది తీరాన్ని దశాబ్దాల కాలంగా డంప్ యార్డుగదా వినియోగిస్తున్నారు. అప్పుడు ఇక్కడ వేసిన చెత్తా చెదారం అంతా కూడా వర్షాకాలం కొట్టుకపోయేది. దీంతో కరీంనగర్ వాసులు చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికిందని అనుకున్నారో ఏమో కానీ ఇదే ప్రాంతాన్ని శాశ్వత డంప్ యార్డుగా మార్చేశారు. రోజు రోజుకు విస్తరించిన కరీంనగర్ జనాభా వేల నుండి లక్షలకు చేరింది. దీంతో పెరిగిన జనాభాతో చెత్త కూడా పెద్ద ఎత్తున తయారు కావడం మొదలైంది. అయినప్పటికీ డంప్ యార్డును మాత్రం యథావిధిగా కొనసాగిస్తున్నారు. మొదట్లో ఈ ప్రాంతంలో నివాస ప్రాంతాలు లేకపోవడం, దిగువన ఉన్న గ్రామాలు కూడా విస్తరించకపోవడంతో ఇబ్బందులు తలెత్తలేదు. కానీ ఇప్పుడు కరీంనగర్ సిటీతో పాటు సమీప గ్రామాలు కూడా విస్తరించాయి. దీంతో మానేరు నది తీరంలో ఏర్పాటు చేసిన డంప్ యార్డులో లక్ష టన్నులకు పైగానే చెత్త చేరి ఉండవచ్చన్న ఓ అంచనా. అటు కరీంనగర్ వాసుల సహనానికి ఇటు మానేరు నది పర్యవారణనానికి సవాల్ విసురుతున్న ఈ డంప్ యార్డులో అర్థ రాత్రి చెలరేగుతున్న మంటలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి.

నగర వాసుల కష్టాలు…

ఒకప్పుడ పాత బజార్, కాపువాడకే పరిమితం అయిన కరీంనగర్ నేడు మారుతీ నగర్, హౌజింగ్ బోర్డు కాలనీతో పాలు కాలనీలు ఏర్పడ్డాయి. మానేరు నది తీరంలో ఆటోమొబైల్ రంగంతో పాటు నివాస ప్రాంతాలు కూడా విస్తరించాయి. దీంతో డంప్ యార్డు వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డంప్ యార్డ్ వెదజల్లే దుర్గంధం భరించలేక ఈ ప్రాంత వాసులు పడుతున్న బాధలు అన్నీ ఇన్ని కావు.

మంటలతో..

మరో వైపున డంప్ యార్డులో చెలరేగుతున్న మంటల వల్ల కూడా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డంప్ యార్డ్ మీదుగా వస్తున్న పొగ వల్ల సమీప కాలనీలు, గ్రామాల్లోని వారంతా కూడా అనారోగ్యం బారిన పడుతున్నారు. శ్వాసకోస సమస్యలతో పాటు కంటి సమస్యల బారిన పడుతున్నారు స్థానికులు. చలికాలంలో పొగ మంచును మించిన డంప్ యార్డ్ పొగ స్థానికుల సహనాన్ని పరీక్షిస్తోంది. అయితే పెద్ద ఎత్తున తయారైన ఈ చెత్తను తరలించేందుకు మరో మార్గం లేకపోవడంతో నిప్పు పెడుతుంటారని దీనివల్ల కొన్ని టన్నుల చెత్త కాలిపోతుందన్న కారణంగానే ఈ పద్దతిని అవలంభిస్తున్నారన్న వాదనలు కూడా ఉన్నాయి మునిసిపల్ సిబ్బందే ఇక్కడి చెత్తకు నిప్పు పెడుతుంటారని ఆఫ్ ది రికార్డులో అధికారులు, ప్రజా ప్రతినిధులు చెప్తుంటారు.

పర్యావరణానికి సవాల్…

మానేరు నది తీరంలో ఏర్పాటు చేసిన ఈ డంప్ యార్డు పర్యావరణ సమస్యలకు కూడా సవాల్ విసురుతోంది. సహజసిద్దంగా ప్రవహించే నది తీరం అంతా కలుషితం కావడంతో పాటు వాయు కాలుష్యాన్ని కూడా తీవ్రం చేస్తోంది. మరో వైపున భూ గర్భ జలాలు కూడా కలుషితం అయ్యే ప్రమాదం లేకపోలేదు. అన్ని విధాలుగా కూడా సమస్యలను క్రియేట్ చేస్తున్న డంప్ యార్డును ఇక్కడి నుండి తరలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇక్కడ పేరుకపోయిన చెత్తా చెదారం వల్ల కాలుష్యం కోరలు చాచకుండా ఉండేందుకు చొరవ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇప్పటికే ఈ ప్రాంతాన్ని టూరిజం కేంద్రంగా చేయాలని మానేర రివర్ ఫ్రండ్ పేరిట పెద్ద ఎత్తున నిధులు వెచ్చించారు. అసంపూర్తిగా ఉన్న ఈ ప్రాజెక్టు పూర్తయితే మాత్రం టూరిస్టులు ఈ ప్రాంతంలో తిరిగే అవకాశం ఉంటుందా లేదా అన్న విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంది. పేరుకపోయిన చెత్తా చెదారం, చెత్త కుప్పల నుండి వెలువడుతున్న పొగ పర్యాటకులకు అనారోగ్యాన్ని అందిస్తుందే తప్ప అందాలను వీక్షించే పరిస్థితి మాత్రం ఉండదన్నది వాస్తవం.

You cannot copy content of this page