వైసీపీ ముఖ్య నేతలకు సరికొత్త తలపోటు
దిశ దశ, ఏపీ బ్యూరో:
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే పరమావధిగా పావులు కదుపుతున్న వైఎస్సార్సీపీ ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న నానుడికి దూరమై పోయింది. ఇంటి వాళ్లను దూరం చేసుకుంటూ బయటి వాళ్లను బరిలో నిలిపి రచ్చ గెలవాలన్న సంకల్పంతో ఉన్నట్టుగా స్పష్టం అవుతోంది. ఒకే రోజు ఏపీలో చోటు చేసుకున్న పరిణామాలు వైసీపీలో మాత్రం హాట్ టాపిక్ గా మారాయని చెప్పకతప్పదు. సొంత ఇంటి మనుషులే ఇతర పార్టీల వైపు చూస్తుండడం వైసీపీ ముఖ్య నాయకులకు మింగుడుపడకుండా తయారైందని చెప్పక తప్పదు. తాజాగా వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో రాజకీయ వైరుధ్యం ఉన్న బీటెక్ రవితో ప్రత్యేకంగా భేటీ కావడం ప్రాధానత్య సంతరించుకుంది. మరి కొన్ని గంటల్లో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్న నేపథ్యంలో బిటెక్ రవితో కలిసి దిగిన ఫోటోలు వైరల్ కావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కడప జిల్లాలో వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా పని చేస్తూ టీడీపీలో క్రియాశీలక నాయకునిగా ఎదిగిన బీటెక్ రవి, జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించి అందరి దృష్టిని ఆకర్షించారు. వైఎస్ కుటుంబానికి రాజకీయంగా పెట్టని కోటగా ఉన్న కడప జిల్లాలోనే పైచేయి సాధించడంతో బీటెక్ రవి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇటీవల ఆయన పులివెందులు వెల్తుండగా హఠాత్తుగా అదృశ్యం అయ్యారు. అనంతరం ఆయన్ని అక్కడి పోలీసులు పాత కేసులో అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. బెయిలుపై బయటకు వచ్చిన బీటెక్ రవి, బ్రదర్ అనిల్ కుమార్ లో ప్రత్యేక భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మరో వైపున వైసీపీలోనే అత్యంత ముఖ్య నాయకుల్లో ఒకరైన ఎంపీ విజయ సాయిరెడ్డి ఇంట కూడా ట్రెండ్ మారుతున్నట్టుగా ఉంది. ఆయనకు అత్యంత సమీప బంధువులు పసుపు కండువా కప్పుకునేందుకు సమాయత్తం అవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. విజయసాయిరెడ్డి భార్యకు స్వయాన తమ్ముడైన ద్వారకానాథ్ రెడ్డితో పాటు సురేంద్ర నాథ్ రెడ్డి, హరెమ్మలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మరో వైపున ఇప్పటికే వైఎస్ జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ కుటుంబ సభ్యుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అన్ని సిద్దం చేసుకున్న షర్మిల తన భర్త, తల్లితో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసి తన తనయుడు రాజారెడ్డి పెళ్లికి రావాలని ఆహ్వనించారు. దాదాపు 25 నిమిషాల పాటు అన్నతో భేటీ అయిన షర్మిల మాత్రం రాజకీయాలకు తావివ్వకుండా అన్నను పెళ్లికి ఆహ్వనించి తాడేపల్లిలోని సీఎం నివాసం నుండి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన షర్మిల వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనవడి పెళ్లికి రావాలని జగన్ మోహన్ రెడ్డిని ఆహ్వానించానని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని వివరించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఢిల్లీకి బయలు దేరారు. వైసీపీకి చెందిన ముఖ్యమైన నాయకుల కుటుంబాలకు చెందిన వారే ఇతర పార్టీల వైపు వెల్లడం, ఇతర పార్టీలకు చెందిన ముఖ్యనేతల టచ్ లోకి వెళ్లడం సంచలనంగా మారింది. అధికార పార్టీని కాదని ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఇతర పార్టీవైపు చూస్తున్నారన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతున్న నేపథ్యంలో అధినేతతో పాటు ఆయన తరువాతి స్థానంలో ఉన్న నేతల ఫ్యామిలీ మెంబర్స్ కూడా పార్టీ ఫిరాయించేందుకు సమాయత్తం అవుతుండడం అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తోంది.