దుబాయి బాట పట్టిన బీఆర్ఎస్ నాయకులు…

ఆ రెండు జిల్లాల్లోనే స్పెషల్…

దిశ దశ, కరీంనగర్:

నేరాలతో సంబంధం ఉన్నట్టుగా అలా తెలుస్తుందో లేదో ఇలా విమానం ఎక్కేస్తున్నారు. పోలీసులకు చిక్కకుండా తప్పించుకునేందుకు చాలా మంది దేశంలోనే ఎక్కడో ఓ చోట తల దాచుకుంటే… ఆ రెండు జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఎంచక్కా దుబాయ్ చెక్కెస్తున్నారన్న ప్రచారం మొదలైంది.

మాజీ ఎమ్మెల్యే సహా…

హైదరాబాద్ లోని ప్రజా భవన్ వద్ద బారిగేట్లను ఢీ కొట్టిన కేసు చిలికి చిలికి గాలి వానలా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇద్దరు సీఐలను కూడా సస్పెండ్ చేయగా కొంతమందిని అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసుకు ప్రధాన కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిజామాబాద్ జిల్లా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు, షకీల్ ఇద్దరు కూడా దుబాయ్ ఫ్లైట్ ఎక్కేశారు. దీంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు వారికి లూక్ ఔట్ నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. షకీల్, ఆయన తనయుడు ప్రపంచంలో ఏ ఎయిర్ పోర్టులోకి అడుగుపెట్టినా అరెస్ట్ కాకతప్పదు. దీంతో వారు ఏనాటికైనా హైదరాబాద్ చిక్కక తప్పదు కాగా వీరిపై యాక్సిడెంట్ కేసు, ప్రధాన నిందితున్ని కేసు నుండి తప్పించిన కేసుతో పాటు చట్టానికి చిక్కకుండా తప్పించుకున్న కేసులు కూడా నమోదు చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఇదే తరహాలో…

బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆయన కొడుకు బాటలోనే కరీంనగర్ కు చెందిన కొంతమంది బీఆర్ఎస్ నాయకులు నడుస్తున్నట్టుగా కరీంనగర్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో భూ దందాలు, సివిల్ సెటిల్ మెంట్ల దందాలకు తెరలేచిన సంగతి తెలిసిందే. ఇంతకాలం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడం… పొలిటికల్ పోస్టింగులే కావడతో పోలీసు అధికారులు కూడా నిందితులను పట్టించుకోలేదు. చాలా కేసులు కూడా అధికార పార్టీ కనుసన్నల్లోనే బుక్ అయ్యాయన్నది బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలో కొంతమంది నాయకులు ఇష్టారీతిన వ్యవహరించి అక్రమాలకు పాల్పడ్డారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రావడం అప్పటి సీపీపై ఈసీఐకి ఫిర్యాదు వెల్లడంతో ఆయన స్థానంలో కొత్త కమిషనర్ ను నియమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో కరీంనగర్ సీపీగా అభిషేక్ మహంతి నియామకం కావడం అక్రమార్కుల భరతం పట్టే పనికి శ్రీకారం చుట్టడం ఆరంభం అయింది. ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత కమిషనరేట్ పరిధిలో జరిగిన అక్రమాల జాతర తతంగం అంతా కూడా బట్టబయలు అయింది. సీపీ కూడా ఈ వ్యవహారంపై సీరియస్ గా వ్యవహరిస్తుండడంతో రోజు రోజుకు బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అధికార బలం ఉందన్న ధీమాతో అక్రమాలకు పాల్పడిన వారిని ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు. దీంతో కొంతమంది తాము ఎక్కడ దొరికిపోతామోనన్న భయంతో విదేశాలకు చెక్కేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కరీంనగర్ కు చెందిన కొంతమంది నాయకులు దుబాయ్ కి వెల్లి తలదాచుకుంటున్నారని తెలుస్తోంది. తమపై పోలీసులు పెట్టిన కేసుల నుండి తప్పించుకోవాలంటే ఫ్లైట్ ఎక్కడం తప్ప మరో మార్గం లేదని గమనించిన కొందరు దుబాయ్ ఫ్లైట్ ఎక్కేశారు. అయితే వీరు అక్కడి నుండే తమ కేసుల పరిస్థితి ఏంటని కూడా తెలుసుకుంటూ యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవాలనే ప్రయత్నాల్లో మునిగిపోయినట్టుగా పోలీసుల దృష్టికి వచ్చింది.

లుక్ ఔట్ నోటీసులేనా..?

అయితే కరీంనగర్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కూడా కఠినంగా వ్యవహరించాలని సీపీ అభిషేక్ మహంతి నిర్ణయించుకున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు విదేశాలకు చెక్కేసిన సదరు ప్రబుద్దులను దారికి తెచ్చుకునేందుకు లుక్ ఔట్ నోటీసులు ఇచ్చేందుకు సమాయత్తం అవుతున్నట్టు సమాచారం. ఈ మేరకు అవసరమైన ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి అన్ని ఎయిర్ పోర్టులకు కూడా లుక్ ఔట్ నోటీసులు పంపించి సదరు నిందితులను అరెస్ట్ చేయాలన్న యోచనలో ఉన్నట్టుగా తెలిసింది.

You cannot copy content of this page