ఐటీ దాడుల్లో సరికొత్త ట్విస్ట్…

రెండు రోజులుగా రాష్ట్ర మంత్రి మల్లారెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులు, సన్నిహితులపై దాడులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి కొడుకు ఆసుపత్రి పాలు కావడం, ఐటీ అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడం సంచలనం కల్గించింది. అయితే బుధవారం అర్థరాత్రి మరో హై డ్రామా చోటు చేసుకుంది. మంత్రి మల్లారెడ్డి బోయినపల్లి పోలీస్ స్టేషన్ లో ఐటీ అధికారులపై ఫిర్యాదు చేయగా, దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఐటీ అధికారులు మల్లారెడ్డిపై పిర్యాదు చేశారు. దీంతో ఐటి దాడుల్లో సరికొత్త ట్విస్ట్ చోటు చేసుకున్నట్టయింది. అటు మల్లారెడ్డి ఇటు ఐటీ అధికారులు ఇద్దరూ కూడా తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తుండడం చర్చనీయాంశంగా మారింది.

సంచనాలకు కేరాఫ్…

చామకూర మల్లారెడ్డి విద్యాసంస్థలను నడుపుతూ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన తెలంగాణ రాష్ట్ర కార్మికశాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన ఆది నుండి సంచలనకాలకు కేరాఫ్ అన్నట్టుగానే ఉంటారన్న పేరుంది. మల్లారెడ్డి మైక్ ముందుకు వచ్చారంటే చాలు ఎదో ఒక కామెంట్ వదులుతారని అందరూ ఆసక్తిగా చూస్తారంటే అతిశయోక్తి కాదు. గతంలో తన కాలేజీ క్యాంపస్ లో విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా కాలం పాటు నెట్టింట వైరల్ అయ్యాయి. విద్యార్థులు జాక్ పాట్ కొట్టాలని ఐశ్వర్యారాయ్ ని పెల్లి చేసుకుని అభిషేక్ బచ్చన్ ఎలా జాక్ పాట్ కొట్టాడో అలాగే ఉండాలన్నారు. సీఎంఆర్ విద్యా సంస్థల ఆవరణలో జరిగిన సమావేశానికి సంబందించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన వ్యాఖ్యలపై చర్చ సాగింది. ఆ తరువాత కూడా మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అసెంబ్లీలో కూడా ఆయన మాట్లాడుతున్నప్పుడు స్వపక్ష, విపక్ష సభ్యులు కూడా ఘొల్లున నవ్విన సందర్బాలూ లేకపోలేదు. కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే మల్లారెడ్డి తన టాకింగ్ స్టైల్ ను మార్చుకునే ప్రయత్నం ఏనాడు చేయలేదు. తన స్థాయి పెరుగుతున్నప్పటికీ ఆయన వ్యవహార శైలి అయినా, మాట్లాడే తీరులో అయినా అంతకుముందు ఎలా ఉండేదో అదే పద్దతిని కొనసాగిస్తుంటారు. కొంత దూకుడుగా కూడా మాట్లాడే ఆయన తనలోని భావాన్ని వ్యక్తీకరించడంలో మాత్రం ఏ మాత్రం వెనుకాడరు అని ఆయన సన్నిహితులు చెప్తుంటారు. ఒక్కోసారి ఆయన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసినా తన నైజం తనదే అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఆయన మద్యం పార్టీలో కూర్చున్న ఫోటోలు వైరల్ కావడంతో ప్రతిపక్షాలు దీనిని అడ్వంటైజ్ గా తీసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయన మాత్రం సహజసిద్దంగానే ఓ స్టేట్ మెంట్ ఇచ్చేశారు. తాను మందు పార్టీలో కూర్చుంటే తప్పేంటి అంటూ ఎదురు ప్రశ్నించడంతో ఆయనపై చేసిన విమర్శకులు సైలెంట్ కావల్సి వచ్చింది. అంతకుముందు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతూ మీడియా సమావేశంలో తొడగొట్టి మరీ చాలెంజ్ చేయడం సంచలనంగా మారింది. క్యాసినో వెనక మనీ ల్యాండరింగ్ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ విచారణ జరుపుతున్న క్రమంలో ఓ వ్యక్తి కారుకు వేసిన స్టిక్కర్ మల్లారెడ్డి ఎమ్మెల్యేగా ఇచ్చిందేనని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ విషయంపై స్పందించిన మల్లారెడ్డి ఆ స్టిక్కర్ ను పడేస్తే చెత్త కుప్పలో దొరికింది కావచ్చంటూ వ్యాఖ్యానించారు. తాజాగా ఐటీ అధికారుల దాడుల నేపథ్యంలో కూడా మల్లారెడ్డి దూకుడు మాత్రం తగ్గలేదు. ఓ వైపు దాడులు జరుగుతూనే ఉన్నా ఆయన ఐటీ అధికారులపై విమర్శలు చేశారు. మరో వైపు తన కొడుకు ఆసుపత్రి పాలు అయ్యే విధంగా ఐటీ అధికారులు హింసించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు బుధవారం రాత్రి ఐటీ అధికారలు సోదాలు ముగించుకుని వెనుదిరిగిన నేపథ్యంలో మంత్రి కొడుకుచే సంతకం చేయించుకున్న విషయంపై పోలీసులకు పిర్యాదు చేశారు. తన కొడుకుచే ఐటీ అధికారులు బలవంతంగా సంతకాలు చేయించుకుంటున్నారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఫిర్యాదు చేసిన తొలి మంత్రి…?

దాడులు నిర్వహించిన తరువాత వారిపై ఫిర్యాదు చేసిన తొలి మంత్రిగా మల్లారెడ్డి రికార్డు క్రియేట్ చేశారు. ఇప్పటి వరకు ఐటీ దాడులు జరిపిన తరువాత వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటనలు దేశంలోనే అత్యంత అరుదు. అలాంటిది ఓ మంత్రి ఐటీ అధికారులపై ఫిర్యాదు చేయడం కూడా ఫస్ట్ టైం అయి ఉంటుందని తెలుస్తోంది. అలాగే తమ అధికారిని నిర్భందించారంటూ ఐటీ అధికారులు కూడా మంత్రిపై ఫిర్యాదు చేయడం కూడా ఇదే తొలిసారని చెప్పవచ్చు. ఏది ఏమైనా వైరైటీగా నడుచుకునే మంత్రి మల్లన్న ఐటీ దాడుల నేపథ్యంలోనూ తన మార్క్ ప్రదర్శించారంటున్నారు నెటిజన్లు.

You cannot copy content of this page