దిశ దశ, హుజురాబాద్:
కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో చల్లూరులో స్వల్ప లాఠీ ఛార్జి జరిగింది. చేపలు పట్టే విషయంలో ఇరు గ్రామాల మధ్య ఏర్పడ్డ వివాదం కాస్తా లాఠీ ఛార్జి వరకు చేరింది. సంఘటనా వివరాల్లోకి వెల్తే… జిల్లాలోని వీణవంక మండలం చల్లూరు, ఇప్పలపల్లి గ్రామలకు చెందిన చేపలు పట్టుకునే విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఇప్పలపల్లి గ్రామ మత్సకారులు చేపలు రవాణా చేస్తున్న క్రమంలో చల్లూరు గ్రామానికి చెందిన వారు అడ్డుకున్నారు. దీంతో ఇరు గ్రామాల ప్రజల మధ్య మాటలు పెరిగి దాడులు చేసుకున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఇరుగ్రామాల మత్సకారులను నిలువరించే ప్రయత్నం చేశారు. రెండు గ్రామాల ప్రజలు పోలీసులు చెప్తున్నా వినిపించుకోకపోగా గొడవ మరింత ఉధృతం అయింది. దీంతో పోలీసు అధికారులు స్వల్ప లాఠీ ఛార్జీ జరపడంతో పరిస్థితి సద్దుమణిగింది.